ఒడిపిళ్ళు

ధారావాహికం – 14 వ భాగం

బుధవారం రోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఇరవై మైళ్ల దూరం నుండి “పొడగోడ్” వస్తారు. “సరసుపదార్” నుండి పన్నెండు మైళ్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశంలో వారాంతపు సంత జరుగుతుంది. దాన్ని ‘హాత్’ అంటారు. భారతదేశ గ్రామీణ ప్రాంతంలో నియమిత కాలంలో జరిగే ఈ గ్రామీణ సంతలు ఎంతో ముఖ్యమైన సమ్మేళనాలు. ఇవి జానపదులకు ప్రత్యేకంగా గిరిజనుల జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగినవి. స్త్రీ పురుషులు సమానంగా అందరూ పర్వతాలను ఎక్కుతూ కొన్ని మైళ్ళు నడిచి, గుహలు అడవులు దాటి కొండల మీదుగా ప్రయాణిస్తారు, కొద్దిపాటి  నాణాల విలువచేసే ఉప్పు, నూనె వంటి వస్తువుల కోసం లేదా తమ తోటలో పండే ఎర్రటి ఎండు మిరపకాయలను అమ్మటం కోసం. అసంఘటితంగా జీవించే ఈ ప్రజలకు వారాంతపు సంతలో పండుగ వాతావరణం సంతరించుకొని ఆనందాన్నిస్తుంది, ఒక సామాజిక అవసరం వ్యాపారానికి తెర లేపుతుంది. గిరిజన స్త్రీలు తమకు ఉన్నంతలో మెరుగైన దుస్తులు, అద్భుతమైన పూసలదండలు ధరించి, పెద్దపెద్దగా ముచ్చట్లాడుతూ, గట్టిగా బృందగానాలు చేస్తూ, విలాసంగా నవ్వుకుంటూ ముందుకు సాగుతారు. స్నేహితులంతా కలుసుకొని కొత్త పాత ముచ్చట్లన్నీ కలబోసుకునే ప్రత్యేక ప్రదేశం సంత.

కొన్నిసార్లు ప్రేమికులు కలుసుకునే అవకాశాన్ని సంతలు కలిగిస్తాయి.

ఈ సంత జరిగే రోజున “పోడగోడ్” రద్దీగా మారుతుంది.

ఆ గుంపుల మధ్య లిలీ, పన్నెండు మైళ్ల దూరం నడిచి వచ్చాడు, తన చిన్నారి కొడుకు కోసం కేవలం రెండు నాణేల విలువచేసే బియ్యం పిండి బెల్లం పాకంతో చేసిన మిఠాయిలు మొలాస్లు కొనేందుకు . గ్రామ పెద్ద భార్య కూడా ఒక నాణెంతో కిరోసిన్ కొనడానికి వచ్చింది. దాంతో ఆమె వారమంతా తను గుడిసెలో దీపం వెలిగిస్తూంది.

భయం కొలిపే కొండల నడుమ ఉండే ఈ సంత ప్రపంచ వాణిజ్య కేంద్రాల కంటే గొప్పది. స్త్రీల ఆకర్షణీయ బేరసారాలతో సంత వ్యాపారం పెరిగింది. అన్నిటికంటే నగల దుకాణం వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. అక్కడ రాగి, ఇత్తడి నగలు, పూసలు, దువ్వెనలు, అద్దాలు గిరిజన అందగత్తెల సౌందర్యాన్ని పెంచే వస్తువులన్నీ అక్కడ ప్రదర్శించబడి ఉన్నాయి. ఈ అలంకార సామాగ్రి వెల కొన్ని  నాణాలు మాత్రమే.

హేమ్లా తనకు కాబోయే భార్య సాలీని గుర్తు చేసుకోగానే ఆమె నేస్తం కమిలీ కూడా అతనికి గుర్తుకొచ్చింది. ఏదైనా బహుమతి కొనాలంటే ఇద్దరికీ కొనాలి, ఎవరో ఒకరికి కొనలేను కదా అనుకున్నాడు. సాలీ బట్టల షాపు ముందు అటు ఇటు తిరుగుతూ ఉన్నది. తన అన్న భూక్యా కోసం చూస్తూ ఉన్నది. అతను తనకు చీర కొనిస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు కను చూపు మేర ఎక్కడా కనిపించడం లేదు. ఆమెకు అసంతృప్తిగా అసహనంగా అనిపించింది, అనుమానం కలిగింది. తనకు కనపడకుండా దాక్కొని వెళ్ళాడో ఏమో.. తనను తప్పించుకోవడానికి అని అనుకుంది. అక్కడున్న గుంపులన్నింటిని తన చూపులతో జల్లెడ పట్టింది. అక్కడ ఎత్తైన గుమ్మటాలు గ్రామాల నుండి గృహాలంకరణ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. మతం మార్చుకున్న ఒక క్రిస్టియన్ సమూహం అక్కడికి చేరుకున్నారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వెళ్లిపోయారు. వారు కొండ మరియు పరజ తెగ గిరిజనులు. కొందరు గడబ తెగ అమ్మాయిలు నిలువు చారల దుస్తులు ధరించారు. పెద్ద పెద్ద రాగిరింగులు చెవుల నుండి భుజాల వరకు వేలాడుతున్నాయి వారికి. కొత్త ముఖాలు కొత్త ఫ్యాషన్ల మిశ్రమం. వింతైన దుస్తులు రంగురంగు నగలు, శబ్దాలతో ఎడతెగని గమనం అది. సాలీ తాను ఒంటరిదైనట్టు భావించింది.

ఉన్నట్టుండి ఆమెకు హేమ్లా కంటపడ్డాడు. అతని వెంట పరిగెత్తింది ఆమె ముఖాన్ని చిరునవ్వు అలముకుంది. అప్పుడే తన చీర కొంగును ఎవరో పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూడగా, కమిలీ కనిపించింది. ఇద్దరూ నవ్వుకున్నారు.

” నేను మా అన్న కోసం వెతుకుతున్నాను. అతను నాకు కనిపించలేదు” అన్నది సాలీ.

“అతను అక్కడ ఉన్నాడు, నేను చూశాను” సిగ్గుతో గొణిగింది కమిలీ.

“చూసే ఉంటావులే” నవ్వుతూ అన్నది సాలీ. “అతను నీ కళ్ళను ఎట్లా తప్పించుకుంటాడు” నవ్వి కమిలీ వెళ్ళిపోయింది.

అప్పుడు మళ్ళీ హేమ్లా వైపు చూసింది సాలీ.

“అయితే నువ్వు ఇక్కడున్నావన్న మాట. నాకు మా అన్న అన్న కనపడలేదు” అన్నది సాలీ.

హేమ్లా నవ్వుతూ “నువ్వు చూడలేదా! అదిగో అక్కడ చెట్టు వెనక” అంటూ దూరంగా వేలెత్తి చూపుతూ, “అతడు ఏం చేస్తున్నాడో చెప్పమంటావా? కిరోసిన్ అమ్ముతున్నాడు” అన్నాడు.

” కిరోసినా” అంటూ సాలీ రెట్టించ్చింది.

హేమ్లా నవ్వుతూ “అవును కావాలంటే నువ్వు పోయి చూడు” అన్నాడు.

సాలీ చెట్టు దగ్గరికి పోయి చూసి ఆశ్చర్య పోయింది. ఎందుకు హేమ్లా తన అన్న గురించి అబద్ధం చెప్పాడు అనుకుంది. భూక్యా పెద్ద తలపాగా చుట్టుకొని నేల మీద కూర్చుని ఉన్నాడు, ఆకుతో చుట్టిన చుట్టను కాలుస్తూ. అతని ముందు కిరోసిన్ అమ్మే ట్రేలో వరుసగా సీసాలు పెట్టి ఉన్నాయి. రద్దిగా లేదక్కడ.

” మంచిది” ఇదా నువ్వు చేస్తున్నది అన్నట్టు అన్నది సాలీ.

ఆమెను చూడగానే భూక్యా మండిపడ్డాడు. “ఇక్కడ ఏం చేస్తున్నావ్ నువ్వు ? ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కదా!” అని అరిచాడు.

” నీ ప్రశ్నలు నీ దగ్గరే పెట్టుకో. నువ్వు ఒక్కడివే తెలివికలవాడినని అనుకుంటున్నావా? నాకు చీర కొని ఇస్తానని మాటిచ్చి కనిపించకుండా పోయావు” కోపంగా అన్నది.

అంతలో కొనుగోలుదారులు వస్తున్నారు..

” నాకు ఒక సీస ఇవ్వు” అన్నాడు ఒకడు. “నాక్కూడా ఒకటి” ఇంకొకడు అన్నాడు. ఒక్కొక్కరు రెండు నాణాలు ఇచ్చారు. భూక్యా సీసాలు నింపి ఇచ్చాడు. వారు గుటగుటమని తాగారు.

” అయితే నువ్వు అమ్ముతున్నది, ఈ కిరోసిన్ అన్నమాట” అంటూ నవ్వింది సాలీ.

సారా కొనడానికి వచ్చిన వాళ్ళు వెళ్లిన తర్వాత. “నీకు కుప్పలు కుప్పలుగా డబ్బులు కావాలి. ఇప్పుడు వచ్చి నాకు ఒక చీర కొనిద్దువు రా” అన్నదామె.

“కొంచెం ఆలోచించు సాలీ” భూక్యా అభ్యర్థించాడు.

” మనకు డబ్బు కావాలి, పంటనూర్చే కూలీలకు ఇచ్చేందుకు. ఇంకా భూమికి కట్టాలి. చీర కోసం ఆగవచ్చు” అన్నాడు.

ఆమె ముఖం మాడ్చుకుని “మంచిది కానీ, డబ్బంతా దాచుకో పెళ్ళికూతురు ధనంగా కమిలీకి ఇవ్వడానికి. నాకు నీ డబ్బు ఏమీ వద్దు” అన్నది.

అట్లా పోట్లాట మొదలైంది.

భూక్యా మధ్యలో “మనం పోట్లాడుకోవద్దు. కొంచెం ఓపిక పట్టు, నేను డబ్బాలో ఉన్నదంతా అమ్మితే, అప్పుడు చూస్తాను” అన్నాడు.

సాలీ మనసం గాయపడింది తనకు చీర కొన్నా కొనకపోయినా బాధ లేదు అనుకున్నది. కానీ సంత రద్దీగా మారేంతవరకు వేచి ఉన్నది.

*** *** ****  *** ***

డిసెంబర్లో ఆ కొండ ప్రాంతమంతా బాగా చలిగా ఉంటుంది. చలి నుండి కాపాడుకోవడానికి ప్రతి ఇంటిలో బొగ్గుల కుంపటి వెలుగుతూ ఉంటుంది. రాత్రి వేళల్లో ప్రతి గ్రామంలో వెలుగుతున్న నెగళ్ళ చుట్టూ జనం గుమిగూడి ముచ్చట్లు పెట్టుకుంటారు.

అది డిసెంబర్, ఆ నెలలో గిరిజనుల ముఖ్య పండుగలు ఉంటాయి. పండిన పంటను ఇళ్లకు చేర్చడం,  దాని తర్వాత పదిహేను రోజులకు కొత్త ధాన్యం ప్రసాదం తినడం అనే పండుగ వస్తుంది. గిరిజనుల జీవితంలో ఒక క్రమంలో పండుగలు వస్తాయి. కానీ అన్నింటిలో ముఖ్యమైనది వసంతోత్సవం. ఒక పదిహేను రోజులు విలాసంగా వేటాడి విందులు చేస్తూ తూగుతూ‌, ఎవరూ పని చేయరు. డప్పుల మోత రాత్రి పగలు ఆగకుండా మోగుతూనే ఉంటుంది నాట్యానికి అనుగుణంగా. పాత సంవత్సరం వెళ్లి పోయి కాలచక్రం తిరిగి ఈ పండుగ తరువాత గిరిజనులలో వెన్ను విరిగే కష్టం మొదలవుతుంది.

పంటల పండుగ సమయంలో పురుషులంతా తమ గ్రామాలకు తిరిగి వస్తారు. గోటీలుగా పనిచేసే వారితో సహా బుడ్రా తన కూలీలతో కలిసి తిరిగి వచ్చాడు. వాళ్ల పేర్లు కాక్నా, టెండా, ఘోర, చీతం . వీరంతా సోమ్లా పాత స్నేహితులు. ఇప్పుడు ఒకే అదృష్టాన్ని పంచుకుంటున్నారు. షావుకారు పండుగ ముందు ఒక్కరోజు మాత్రమే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. పండుగ కాగానే పనిలోకి రావాలని ఆంక్ష పెట్టాడు.

సోమ్లా టిక్యాలు అడవిలో నడుస్తున్నప్పుడు అనేక గుంపులు ఇంటికి వెళుతూ కనిపించారు. ఆ కొండ దారిలో అందరూ గుడ్డపీలికలతో తయారుచేసిన బొంతలను కప్పుకొన్నారు. వాళ్ళు తమ భుజాలపై గొడ్డళ్ళను మోస్తున్నారు. కొండ దారులన్నీ బంగారు పసుపు రంగు పూలతో నిండి లేవు. బూడిద రంగులో ఉన్నాయి. పొలాలన్నీ గోధుమరంగులో పంటలు నూర్చబడి ఉన్నాయి. కేవలం ఎక్కడో ఒకటి రాగుల పంట మడులు కోయకుండా మిగిలి ఉన్నాయి. అక్కడ అక్కడ చొప్ప గుడిసెలు పొలాల్లో పని చేసే వారి కోసం మిగిలి ఉన్నాయి. అంతా విచారంగా నిర్జనంగా కనిపిస్తున్నాయి.

రాత్రయింది వారు నడవాల్సిన దూరం చాలా ఉన్నది. కొండలన్నీ నల్లగా మారాయి. అదృశ్యహస్తం చీకటితో అలికినట్టుగా. కొందరు బాటసారులు కాగడాల వంటివి వెలిగించారు. వాటి చుట్టః తుమ్మెదలు ఎగురుతున్నాయి. ఆఖరి పంటకు కాపలా ఉన్న రైతులు అరుస్తున్నారు. కొమ్ములు ఊదుతున్నారు, అడవి మృగాలను తరిమేందుకు. గిరిజన స్త్రీలు వాగుల వద్దనుండి కుండలనిండా నీళ్లు నింపుకొని ఇంటికి వెళ్తున్నారు. సోమ్లా టిక్యా ఒక గుంపు దాటుకొని రెండో గుంపును చేరుతూ, వేగంగా నడుస్తూ దూరాన్ని అధిగమిస్తున్నారు.

చివరకు సరసుపదార్ దీపాలు కొండల మధ్య నుండి తొంగి చూస్తూ కనపడ్డాయి. సోమ్లా టిక్యా పెద్ద పెద్ద అ అంగలు వేస్తూ పురాతన పర్వత దారులను దాటుతున్నారు.యువకుల డార్మెటరీ నుండి డుంగుడుంగా వాయిద్యం ధ్వని గాలిలో ఎగురుతోంది. పంటల పండుగ ముందు రాత్రి అది. పండుగ నాట్యాల కోసం తయారీలు జరుగుతున్నాయి.

ఇల్లు చేరడం ఆనందాన్ని ఇవ్వలేదు సోమ్లాకు. అతను సరైన సమయంలో ఇల్లు చేరలేకపోయానని బాధపడ్డాడు. భూక్యా సొంతంగా వ్యవసాయం చేయలేక చేసిన తప్పిదాలు, అతని మనసుకు కష్టాన్ని కలిగించాయి. ఈ పండుగ మరొక దురదృష్టకరం జ్ఞాపకంగా మిగులుతుంది. అతడు ఆలోచనల్లో పడ్డాడు. ఎప్పుడో ఒకసారి కలిగే ఆనందం పొంద లేకుండా ఎగిరిపోయింది. ఇంకెప్పుడూ తిరిగి కోలుకోలేడు.

టిక్యాకు ఇంటికి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కానీ కొత్త ఆడ కూలీలతో గడిపే సమయం పోగొట్టుకున్న భావన అతని ఆలోచనల్లో చేరింది.

……………….

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను

దొరసాని