ఒంటరితనం

కథ

నిరంతరం రణగొణధ్వనులమధ్య, తమకంటూ క్షణం తీరికలేని మనుషులున్న మహానగరంలో అది ఒక ప్రశాంతమైన ఉద్యానవనం.జీవితమంతా బ్రతుకుతెరువు కోసమో లేక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విజయాన్ని దక్కించు కోవడంకోసమో పరుగెత్తి అలసిసొలసి చివరిరోజులు గడుపుతున్న కొందరు వృద్ధులు, తమ గతస్మృతులను నెమరు వేసుకుంటూ ఆ ఉద్యానవనంలో సేద తీరుతున్నారు.ఉపాధ్యాయుడిగాపనిచేసి నెలరోజుల క్రితం పదవీవిరమణను పొందిన రాధారమణ కూడా వారిలో ఉన్నాడు.

అంతవరకూ పిల్లలకు పాఠాలు నేర్పుతూ పాఠశాలే లోకంగా కాలం గడిపిన రాధారమణకు, అలా పని చెయ్యకుండా తీరుబడిగా కూర్చోవడం చాలా కష్టంగా ఉంది.జీవితంలో తను ఎంచుకున్న ఆశయాలను సాధించడంకోసం పెళ్ళి చేసుకోలే దురాధారమణ.ఇప్పుడుఒంటరితనం అతనికిభారంగా అనిపిస్తోంది.తనభవిష్యత్తు గురించి దీర్ఘంగాఆలో చిస్తున్నరాధారమణకు ఎక్కడో దూరంగా ఒక చిన్నపిల్లవాడి మాటలు వినిపించాయి.తలతిప్పి పిల్లవాడివైపు చూశాడు రాధారమణ. ఒక మూడేళ్ళ వయసున్నఆపిల్లవాడు తనతాతగారి చెయ్యి పట్టుకుని, ప్లాస్టిక్ సంచీలో ఉన్న మిఠాయిని తింటూ, ఏవో కబుర్లు చెబుతూ మెల్లిగా నడుస్తున్నాడు.

ఆ పిల్లవాడి ముద్దుమాటలు ఎంతో మురిపెంగా వింటున్న అతడి తాతను చూసి, ‘అలా గడపడానికి నాకు మనవళ్ళు లేరుగా!’,అని అనుకుంటూ మరో వైపుకు చూశాడు రాధారమణ.అక్కడ ఒక యువకుడు తన సెల్ ఫోన్లో  వీడియోలను తీస్తున్నాడు.

రాధారమణ చిరాకుపడుతూ,’ఈరోజుల్లోఎవడిని చూసినా ఇంకేమీ పనిలేనట్టు ఈ సెల్ ఫోనొకటి పట్టుకుని దానివంకే చూస్తూ ఉంటాడు.మానవసంబంధాలకు ఈ ఆధునిక పరికరాలు ఒక అడ్డంకిగా మారిపోతున్నాయ్!’,అనుకున్నాడుమనసులో.

ఉన్నట్లుండి మిఠాయి తింటున్న పిల్లవాడి చేతిలోని ప్లాస్టిక్ సంచీ గాలికి ఎగిరుతూ వచ్చి రాధారమణ కాళ్ళ దగ్గర పడింది. రాధారమణ మెల్లిగా వంగి ఆ సంచీని చేత్తో తీసి తనకు కాస్త దూరంగా ఉన్న చెత్త డబ్బాలో వేశాడు.రాధారమణ చేస్తున్న పనిని తదేకంగా చూసిన పిల్లవాడు తనకు దగ్గర్లో ఎగురుతున్న చిత్తు కాగితాన్ని చేత్తో తీసి దాన్ని చెత్త డబ్బాలో వేసి రాధారమణవంక ఒకింతగర్వంగాచూశాడు.

రాధారమణ పిల్లవాడివంక చూస్తూ చిరునవ్వు నవ్వి, ‘పెద్దలేంచేస్తేపిల్లలదేచేస్తారనినిరూపించాడువీడు!’, అనిఅనుకుంటూ అక్కడినుండీ వెళ్ళిపోయాడు.

రెండురోజుల తర్వాత మళ్ళీ అదేఉద్యానవనానికి వచ్చాడు రాధారమణ.రాధారమణను చూస్తూనే కొందరు యువతీ యువకులు నవ్వుతూ అతడి దగ్గరకు వచ్చిరాధారమణతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నం చెయ్యడం మొదలు పెట్టారు.రాధారమణకు ఏమీ అర్థంకాలేదు.

ఆవచ్చినవారిలోఒకయువతిరాధారమణకునమస్కరిస్తూ,”మీరు భలే మంచి పని చేస్తున్నారు సార్!రేపటి తరానికి మార్గం చూపించేందుకు మీలాంటివాళ్ళు చాలా అవసరం!”, అంది.

“మీరు నన్ను చూసి ఎవరని అనుకుంటున్నారో!నా పేరు రాధారమణ. రిటైర్డ్ టీచర్ని”, అన్నాడు రాధారమణ.

“ఓహో! అందుకే మీరు చిన్నపిల్లవాడికి అర్థమయ్యేటట్లు ప్రకృతి పరిరక్షణ గురించి చక్కటి పాఠం ఎంతో తేలికగా నేర్పించగలిగారు.సోషల్ మీడియాలో మీరు చెత్త ఎత్తడం,మిమ్మల్ని చూసి చిన్నపిల్లవాడు కూడా ఈ ప్రాంతాన్ని శుభ్రం చెయ్యడం అంతా చూశాను సార్!ఆ వీడియో ఎవరు తీసారో కానీ సోషల్ మీడియాలోతెగ వైరల్ అయిపోయి, మీరు ఒక్కసారిగా అందరిదృష్టినీఆకర్షించేసిగొప్పవారైపోయారు!మిమ్మల్నిచూసిప్రేరణపొందినాలాంటివాళ్ళుఇలా నడుంవంచిపనిచెయ్యడంమొదలుపెట్టారు!”,అన్నాడు ఒక వ్యక్తి ఎవరో కిందపడేసిన ఐస్-క్రీం పుల్లను ఏరి చెత్త బుట్టలో వేస్తూ.

విషయమంతా క్షణంలో బోధపడింది రాధారమణకు.ఇది రెండురోజుల క్రితం అక్కడ తన సెల్ ఫోన్లో వీడియోలు తీసిన యువకుడి పనే అయి ఉంటుందని గ్రహించినరాధారమణ,’ఆ భగవంతుడు నాకు తెలియకుండానే నా చేత ఒక మంచి పనికి శ్రీకారం చుట్టించాడన్నమాట!’,అనుకున్నాడు.

అంతలో,”సార్! మీరు ఒప్పుకుంటే మనమంతా ఒక సంఘంగా ఏర్పడి ఈ ఉద్యానవనంతోపాటూ మన నగరాన్ని కూడా శుభ్రం చేసి, అందరిలో శుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ, మన ఊరిని అందంగా తీర్చిదిద్దుదాం!”,అంది అందరికన్నా ముందు రాధా రమణ నుపలకరించిన యువతి.

“అహా! అద్భుతమైన ఆలోచన!”,అంటూ అందుకు తన సమ్మతిని తెలిపాడు రాధారమణ.

“అయితే మీరే మా సంఘానికి అధ్యక్షులు!!”, అన్నారు అక్కడున్నవారంతా ముక్తకంఠంతో.

‘ఇక ఒంటరితనం నా దగ్గరకు రాదు!’,అనుకుంటూ కార్యోన్ముఖుడయ్యాడు విశ్రాంత ఉపాధ్యాయుడైన రాధారమణ.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యూరోప్ ట్రిప్ – 14 

చిత్ర మాలిక..