జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పండుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు. ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు. నష్టపరిహారం కొంత డబ్బు ఇవ్వాలనుకుంటడు సేటు. ఆడబ్బు కోసం ఏదులు తండ్రి సంగడి ఆలోచన తెలిసి సేటు. ఏదులు భార్య పిల్లల పేరు మీద చెక్కులిస్తడు. వాటితో ఇల్లు బాగుచేసుకుని. మామ ఊర్ల భూమి కొనాలనుకుంటడు ఏదులు.కొడుకు తన డబ్బులు దక్కనియ్యలేదని పగబట్టిండు ఏదులు తండ్రి. ఒకరోజు పగటిపూట ఇంటికొస్తూ దారిల మందను సరిచూసుకుంటన్న ఏదులు మీద పడ్డరు ఆయుధాలతో
————ఇక చదవండి——–

ఒంగి కాలుకు నాటిన ముల్లు పీకుతున్న ఏదులు మీద ఉపద్రవమొచ్చిపడ్డది…
ఒక దెబ్బ మెడ మీద ఒకటి నెత్తి మీద బలంగ పడ్డయి. నెత్తురు చిమ్మికొట్టింది.. ఎనకకు తిరగాలను కున్నడు..
తిరగ లేక పోయిండు. బోర్ల బొక్కల బురదల పడ్డడు.. పందిని పొడిసే బరిసె ఈపుల దిగింది.. ఇద్దరు మడుసులు దెబ్బ మీద దెబ్బ పొడిసిన్రు.. పందులన్ని కాకిరి భీకిరి అనుకుంట ఆడ్నించి ఉరికినయి… పందినెత్తక పోనొచ్చి పగ తీర్చుకున్నరు..
అందరు పగటి నిద్రల్ల ఉన్నరు. చెట్టు కదలట్లేదు పిట్ట రెక్కాడిస్తలేదు.. సైకిల్ మీద పోతున్న రంగడు దూరన్నించి చూసిండు.
ఏదులు మీద దాడి చేసిన ఆ ఇద్దరు రంగడిని సూసిన్రు .. చిటుక్కున అక్కడినించి. పారిపోయిన్రు…
రంగడు దగ్గరికి వచ్చేటప్పటికీ గిల గిల కొట్టుకుంటుండు ఏదులు. జీవి గాలిల కలిసింది, సూస్తుండగనే కదలడం ఆగి పోయింది. దగ్గరికి పోటానికి బయపడి ఊళ్ళెకురికి జనాన్ని తోలుకొచ్చిండు… అందరు కలిసి బురదలనించి బయిటకు గుంజిన్రు… పొడి భూమి మీద
పండ పెట్టిన్రు…..
ఎవరో ఉరుకొచ్చి నాంచారికి చెప్పిన్రు.. రేషన్ బియ్యం చాట్ల పోసుకొని బాగు చేసుకుంటున్న నాంచారి చాట పక్కన పెట్టి… ఉరికింది తల్లెమ్మటి పోరల్లు ఏడుసుకుంట ఉరికిన్రు.
అప్పటికే జనమంత గూడిన్రు.. జనాన్ని నెట్టుకుంట లోపలకి జొరపడింది నాంచారి. అక్కడున్న తడికి నేలంత నెత్తురు బారింది. ఎర్రటి రంగు నీళ్ళు పొలంల పారిచ్చినట్టు… ఏదులు బోర్లపడి ఉన్నడు. వంటి మీద బట్టలు నెత్తురుతో తడిసినయి. ఏదులు బిడ్డ తండ్రిని అట్ల సూసి..
యయ్యా.. అని కీకపెట్టి కింద పడిపోయింది. మూర్చొచ్చిన్నట్టు కాళ్ళు చేతులు కొట్టుకుంట కళ్ళు తేలేసింది. పక్కనే ఉన్న రంగడు పిల్లను ఎత్తుకొని ఊర్లవున్న డాక్టర్ దగ్గరికి వురికిండు సైకిలు మీద. “పిల్లభయపడింది ఏమి కాదులే” అని ఒక సూది ఏసి కాసేపు కూసోపెట్టుకొని పంపిండు.
“మళ్ళీ అక్కడికి తీస్కపోకు పిల్ల భయిపడతది” అని చెప్పిండు డాక్టర్.
రంగడు ఆ పిల్లను తన ఇంటికాడ పండ బెట్టి తల్లిని చూడమని.. నాంచారి తండ్రికి కబురు పెట్టిండు.
నాంచారి పిల్లలను కూడ పట్టకుండ ఏదులు మీద పడి ఏడుస్తంది.. పిల్లకు మందిచ్చిన డాక్టరు కూడ వచ్చిండు. అక్కడి ఆ నెత్తురు ఆ భీభత్సం చూసి పానం పోయ్యే ఉంటదనుకున్నడు. తన తెలివి చూపించకుండ నోరు మూసుకొని నిలబడ్డడు.
పక్కనించి ఎవలో “పంతులు ఎందో సంగతి చూడరాదు” అన్నరు.
గుడ్లు పెద్దై చేసి భయంగా.. “సంగతేందో నీకెంత తెలుసో నాకంతే తెలుస్తంది… లొల్లిపెట్టకు” అన్నడు. గుసగుసగా గసపెట్టుకుంట…
ఇంతలనే.. సేటు కొడుకుతో కార్ల వచ్చిండు. సర్పంచ్ కూడ వచ్చిండు.
ఊరు ఊరంత గుమ్మిగూడిన్రు కని సంగడు, ఎంకులు అయిపు అజా లేకుండ పోయిన్రు …
“ఏమి చేద్దాం సేటు పట్నమేసక పోదామా..” అన్నడు సర్పంచ్.
“సరే మా కార్లనే ఏసక పోదాం పాండి..” అన్నడు సేటు. రంగడు ఇంకో ఇద్దరు కలిసి ఏదుల్ని లేపిన్రు.
ఎర్రరంగు నీలల్ల ముంచిన గుడ్డల మూటోతిగ నెత్తురు కారతనే ఉన్నది ఏదులు పీనిగ. ఈగలు దోమలు జుమ్మున లేచినయి. సేటు కొడుకు డిక్కీల కెల్లి తాడిపత్రి తీసి ఎనక సీట్ల పరిసిండు.. ఏదుల్ని అందుల పండేసి… సర్పంచును కూడ కారెక్కిచ్చుకొని సేటే కారు తోలుకుంట పట్నం పోయిండు.. మిగిలినోల్లను ఎనక రమ్మన్నడు.
కారు బైలెల్లి ఊరు బయిటికి వచ్చేటాలికి ఏదులు అత్త మామ ఎదురు పడ్డరు. కారాపి వాల్లకు ఏదుల్ని చూపిచ్చి. మీరు ఎనక రండి అని చెప్పిండు సర్పంచ్.
కారు మల్ల కదిలింది, పానం పోయిన సంగతి గుర్తుపట్టిండు ఈరన్న. బిడ్డ ఎట్లున్నదో అని గుడిసె కాడికి పోయిండు. ఇంకా ఏదులు గాయపడ్డ కాడనే జనమంతా ఎవరికి తోసింది వాళ్ళు మాట్లాడుకుంట ఉన్నరు.
అక్కడే కూసోని నాంచారి గుండెలు బాదుకుంటూ శోఖాలు పెడతా ఉన్నది. నాయనకు ఏమైనదో తెలవక మగ పోరలిద్దరు దిక్కులు సూసుకుంట. తల్లి కాడనే కూసున్నరు. వాల్లకు ఏడవలనన్న సంగతి కూడా తెలవట్లేదు. తండ్రి బురదల నెత్తురులో మునిగినట్టు ఉన్నది చూసి పోంగనే కాసేపు ఏడిసిన్రు.. మట్టిల ఆడితేనే గద్దిచ్చే తండ్రి.. ఎందుకు బురదల పడి ఉన్నాడో అర్థం కాలేదు.. చుట్టూ ఉన్నోళ్ల మాటలు ఇనుకుంట ఉన్నరు.
ఈరన్న వచ్చి బిడ్డను లేపి ఇంటికి నడిపిచ్చిండు. నాంచారి తల్లి ఇద్దరు పిల్లలని చెరో చేతపట్టుకొని “సెల్లేదిరా..?” అని అడిగింది..
పక్కనున్నోళ్లు “పిల్లకు భయంతో మూర్ఛలొస్తే రంగడు డాక్టర్ కాడికి తీసక పోయిండు” అని చెప్పిండ్రు.
పిల్లలను పట్టుకొని మొగని ఎంట దారి పట్టింది ఆమె.
ఇంతలనే రంగడి తల్లి ఏదులు బిడ్డను ఎత్తుకొని గుడిసె కాడికి వచ్చింది. పిల్లను నాంచారి తల్లి అందుకుంది పిల్ల మత్తుగా నిద్రపోతుంది గుడిసెల చాపేసి పిల్లను పండబెట్టిందామె..
ఈరన్న పెండ్లం దగ్గరికొచ్చి “నేను దావఖానకు పోతన్న, నువ్వు పిల్లల కాడ ఉండు” అన్నడు.
సరే అన్నట్టు తలూపిందామె. నాంచారి యాప చెట్టు కింద కూసోని శోకాలు పెడుతంది. ఇరుగు పొరుగు ఆమెను ఊకుంచుతున్నరు.
ఈరన్న ఇంకో ఇద్దరిని ఎంట పెట్టుకొని పట్నం దారి పట్టిండు. షేర్ ఆటోలు పట్టుకొని పట్నం చేరేటప్పటికి చీకటి పడ్డది.
దావకాన గేటు కాడికి పోయేటప్పటికి సేటు కారు ఊరికి బయలెల్లుతంది. ఈరన్న అనుకున్నట్టే ఏదులు నిర్జీవంగా పడున్నడు.
“పానం పోయి మూడు గంటలయింది అన్నడు… పాలీసులు గోల లేకుండ, సర్పంచ్ పంచనామా చేయిచ్చిండు. పిల్లల పంది మీద బడి సంపిందని రాయించిన్రు….” అని సేటు చెప్పిండు.
అయిపోయింది… ఎవరు సంపిన్రో అందరికి తెలుసు.
అందరు కలిసి ఊరి దారి పట్టింన్రు. ఆ రాత్రికి దానం చేసుడు కుదరలేదు.
తెల్లారి పగటేల కాకముందే చెరువు కట్ట పక్కన ఈత తోపుల బొంద పెట్టిన్రు. ఏదులు మారుతల్లి బొంద కాడికి వచ్చి చూసింది, పిడికెడు మట్టేసి పోయింది. తండ్రి తమ్ముడు అయిపు లేకుండా పోయిన్రు దినాలు అయ్యేదాకా…
అన్ని కర్సులు ఈరన్నే అరుసుకున్నడు.. దినాలైనంక వారం రోజులుండి.. తల్లీ పిల్లలను తోలకొని బయలెల్లిండు ఈరన్న.
సంగడు గద్ద లాగా వచ్చి అడ్డం పడ్డడు.
“నా కొడుకు పొయ్యిండు.. వాని నిశాని నా మనవల్లను నేనే సాత్త..” అన్నడు.
తల్లి సాటుకురికిన్రు పోరల్లు …
“నేను తాతను రా.. నేసే దిక్కిప్పుడు… మీ అవ్వ సాటుకు నక్కతరేంది..? దానికే ఒక సెయ్యి కాలిపాయె, మిమ్మల్మెట్ట సాత్తదిరా… “అన్నడు.
“పోరగాల్లు భయపడతన్రు. నేను తోలకపోత నాలుగొద్దులుంచుకొని పంపుతలే.. నేను సుత తాతనే…”
అన్నడు ఈరన్న..
ఊరికి పొయ్యేటోల్లను రోడ్డు మీద ఆపి జగడం మొదలు పెట్టే… నలుగురు కూడిన్రు.
“తలసెడున్నది.. అవ్వగారింట్ల నిద్రసెయ్యాలె…” అన్నరెవరో..
నాంచారి ఏడ్పందుకుంది గట్టిగ.. తల్లి ఏడ్పు సూసి..
పోరల్లు వా.. అంట నోరు తెరిసిన్రు.. సంగడు ఆడికెల్లి జారుకుండు..
ఈరన్న బిడ్డను ఊకుంచి ముందుకు సాగిండు..
నాంచారి ఏడ్సింది ఏడ్సినట్టే ఉన్నది. ఎవలతో మాట్లాడదు, పోరల్లను పట్టిచ్చుకోదు.
నాంచారి తల్లి కైకిలి పోకుండ ఇంటి పట్టునుండి నాంచారిని పిల్లలని సూసుకుంట ఉన్నది…
హాస్టల్ల ఉన్న బిడ్డను కొడుకును తీసుకొచ్చిండు ఈరన్న.
నాంచారి సెల్లె తెలివికల్లది తండ్రోతిగ. నాంచారి తల్లోతిగ మెతక మనిషి.
నాంచారి పిల్లలను సెల్లే సూసుకునేది… అక్కను ఓదార్చేది.. వారం తర్వాత వాల్లను మల్ల హాస్టల్ల తోలొచ్చిండు ఈరన్న.
సెల్లె ఉన్నన్నాల్లు అక్కనుబతింలాడి ఎంగిలి పడేసేది…
నాంచారి “నాయినా.. ఎన్నాళ్ళున్నా ఊరొదలాలసిందే… అన్నడు లోకం వదిలి పోయిండే… ” అని బావురుమనేది…
బిడ్డనెట్ల ఊకుంచాలో ఈరన్నకు తెలవట్లే “ఊకో బిడ్డ మనసేతుల్ల ఏముంది..? అంత ఆ పైనున్నోడి ఆట.. గుండె రాయి సేసుకో, పోర్ల మొగం సూసుకొని బతకాలె.. ” అని ఊకుంచెటోడు.
రోజులు గడుస్తన్నయి… ఏమనుకున్నదో ఏమో…
“యయ్యా ఇంటికి పోత..” అన్నదొకనాడు నాంచారి. “ఎటుబోతవు.. ఏం సేత్తవు.. ఇక్కడనే అందరం కూడి ఉందాము బిడ్డా.. నువ్వూ, నీ పిల్లలు నాకు బరువు కాదు..” అన్నడు ఈరన్న.
“కాదే యయ్యి.. ఒకపాలి పోత.. ఉండ లేక పోతే మల్లొస్త.. ఇల్లు గడ్తన్నడు….. పందు లేమాయనో.. కాపాడాలె… సేటుకాడికి పనికి పోత..” అన్నది.
సరెనని ఈ రన్న పెళ్ళాంతో కలిసి బిడ్డను మనవళ్ళను తీసుకొని బీర్పూర్ వచ్చిండు.
నెల రోజులకే ఇల్లు గుడిసె మరింత ఆగమయింది… ఎవరో గెలికినట్టు గుడిసెలున్న తల్లె ముంత గుడిసె మధ్యల కుప్పపోసినట్టున్నయి.. ఏమి జరుగుంటదో ఈరన్న ఊహించుకో గలడు.. నాంచారి తండ్రి మోర చూసింది… ‘ఇల్లుకాలి ఏడుస్తంటే.. ఇంగలం అడుక్కున్నట్టు’ ఆ బుద్ధి ఎవరిదో అర్థమయినది.. తల్లి ఇల్లంత సవర బెట్టింది.
తండ్రి సరుకులు కొనుక్కొచ్చి పెట్టిండు.. ఇరుగుపొరుగు గుడిసె కాడికొచ్చి మందలిచ్చి పోతాన్రు…
నాంచారి ఎక్కువ మాట్లాడట్లేదు..
అందరికి తల్లి దండ్రి సమాధానం చెప్తాన్రు… పందుల లెక్క సూసిండు సుక్క పంది దాని పిల్లలు తప్ప అన్ని మాయమయినయి – సుక్కపంది ఎవర్ని దగ్గరికి రానియ్యది ఏదుల్ని తప్ప..
పాతిక కోళ్ళకు ఐదు మిగిలినయి…
ఇంటికి ఆధారమయిన మనిషినే మింగినంక – ఇయ్యన్ని ఒక లెక్కా… ‘ఏనుగులు తినిటోడికి పీన్గెలు పిండాకూడు’ అన్నట్టు.. ‘కంచే చేను మేసింది’. తండ్రి లేని పిల్లలు అవిటి తల్లి మిగిలిన్రు.
తండ్రి తర్వాత తండ్రోలె కాసుకోవలసినోడు సొంత కొడుకును మింగిండు..
నాలుగు రోజులయినంక తల్లిని తీసుకొని సేటు కాడికి పొయ్యింది.. ఏదన్న పనియ్యమని…
“మరి.. నీ పిల్లలను నెవరు సూస్తరు. పిల్లల్నేసుకొని పనెట్ల చేస్తవు..” అన్నడు సేటు.
నాంచారి తల్లి కలగ జేసుకొని.. “చిన్న పిల్లను నేను తీసుకొని పోత… మొగపిల్లలతోటి పనికొస్తదయ్య.. ఏదో దయ సూడండి..” అన్నది.
“సరె.. రాపో నీకు చాతనయింది చేసుకో ఊడ్సుడు కసువెత్తుడు.. పొద్దుందాక ఈడనే ఉండాలె..” అన్నడు. సరే నన్నది నాంచారి.
ఇంకో మూడ్రోజులుండి.. చిన్న పిల్లను తీసుకొని నాంచారి తల్లి ఊరికి పొయ్యింది … సేటు కట్టుబడి పూర్తయింది.. దుకనం మొదలు పెట్టిన్రు. అదో ఇదో రోజంత పని ఉండేది. సేటు ఎంతో ఒకంత ఇచ్చెటోడు.. ఎంతిస్తె అంత అనుకునేది..
**** **** *** సశేషం*** *** ***