
ఇప్పటివరకు: సుబ్బారావు కూడా ఒక లాయర్ ని పెట్టుకున్నాడు. ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. సుబ్బారావు పైన పోలీస్ స్టేషన్ లో గృహ హింస కేసు పెట్టించిన తరువాత ప్రత్యక్ష సాక్ష్యం కోసం లాయర్ వసుంధర, మైత్రేయి ఇంటి ఓనర్ రమాదేవిని, ఆమె భర్త కోటయ్య పంతులు గారిని కలిసి ఇంటికి ఆహ్వానించింది. తన భర్త లాయర్ వేంకటేశ్వర్లు గారి ద్వారా మాట్లాడించి కోర్ట్ కు రావడానికి వాళ్ళని ఒప్పించింది
సుబ్బారావు తన లాయర్ కోదండపాణి గారిని కలిసాడు. “రావయ్యా సుబ్బారావు! పరిస్థితి ఎలా ఉన్నది! నీకు నొప్పి తగ్గిందా?” అంటూ వెటకారంగా నవ్వాడు.
“ఎం నొప్పి లాయర్ గారు? “అన్నాడు ఏమీ తెలియనట్లు.
“అదేనయ్యా. నువ్వే చెప్పావుగా మీ ఆవిడే నిన్ను కొట్టిందని”,
”అదా సార్, పెద్ద దెబ్బేమీ కాదులెండి ! అంతకంటే పెద్ద దెబ్బె కొట్టిందిగా! “అన్నాడు రోషంగా.
“నువ్వు జైలు కూడు తినకుండా ఉండాలా వద్దా ? అలాగే విడాకులు కావాలా వద్దా?”
“వద్దంటే, కేసు ఆగిపోతుందా!” అన్నాడు ఆశగా. “అలాటి ఆశలేమీ పెట్టుకోకు. అవతలవైపున్నది లాయర్ వసుంధర. అంత సులువుకాదు నీన్నీ కేసునుండి తప్పించటం .”
“ ఛాన్స్ లేదంటారా?”
“ఉన్నది! కాంప్రమైస్ కావడమే. దానికి రెండు పక్షాలవాళ్ళు ఒప్పుకోవాలి.”
“మీరు కాంప్రమైజ్ కి ప్రయత్నం చేయగలుగు తారా ! బంగారు గుడ్ల లాంటి జీతం ఉన్న పిచ్చుక అది. అంత త్వరగా వదులుకోడానికి మనస్కరించడం లేదు.”అన్నాడు చాలా ఆశగా.
“మాటలు కాస్తంత పొదుపుగా వాడు. నోటికి ఎదోస్తే అది లాయర్ల ముందు వాగమాకు. ఇట్టేదొరికిపోతావు. గుర్తుంచుకో నీ భార్య తరఫున ఉన్నది ఒక సివంగి లాంటి లాయర్”.
“నేను ప్రయత్నిస్తాను, రేపు సాయంత్రం వచ్చి మా జూనియర్ కి ఒక 20 వేలు ఇచ్చివేళ్ళు. కోర్ట్ ఖర్చులు ఉంటాయిగా”, అంటూ కోదండపాణి గారు తన కుర్చీలోంచి లేచాడు.
కార్ డ్రైవర్ ని పిలిచి మనం అడ్వకేట్ వెంకటేశ్వర్లు గారింటికి పోవాలి షెడ్ నుండి కార్ తీసుకురా అని పురమాయించి, ఆఫీస్ లోంచి ఇంట్లోకి వెళ్లి పోయాడు. సుబ్బారావు దవడలు నొక్కుకుంటూ ఆవేశంగా అక్కడినుంచి బయటపడ్డాడు.
కొద్దిసేపట్లోనే కోదండపాణిగారి కారు వెంకటేశ్వర్లు గారింటి దగ్గర ఆగింది. జూనియర్స్ అయినా రాజ్య లక్ష్మి. సుమంత్ ఎదురెళ్లి ఆయన్ని ఆఫీస్ లోకి తీసుకొచ్చారు.
“నమస్తే కొదండం గారు! కోర్ట్ దారి మరిచిపోయి మా యింటికొచ్చారా ఏంటి “అంటూ నవ్వుతు ఆయన్ని ఆహ్వానించాడు వెంకటేశ్వర్లు.
“ అయ్యో! ఎంత మాట! మీ ఇల్లే ఒక మంచి ధర్మ స్థలం. ఇక్కడంతా న్యాయమే తప్ప అన్యాయం అనే మాటే వినపడదు. మీ తోటి మాట్లాడి నేను ఎన్ని కేసు లు సెటిల్ చేయలేదు. అలాటి పనిమీదే వచ్చాను. కాకపోతే ఈ సారి మేడం వసుంధర గారి సహాయం కావాలి,” అంటూ లేని వినయాన్ని ప్రదర్శించాడు. అది వసుంధర గమనించి “అయ్యో మీలాటి లాయర్ మా దగ్గరికి రావడమే చాలా గొప్పవిషయం. నేను చేయగలిగేదయితే చేద్దాం లెండి,” అంటూ ఆమె భర్త వంక చూసింది.
“ఏంలేదమ్మా. మీరీమధ్యన ఒక కేసు తీసుకున్నారని విన్నాను. అది ఒక కాలేజీ లెక్చరర్ పైన గృహహింస,”
“అవును”
“ఆమె భర్త నా క్లయింటు. మొదటిసారి ఇలా జరిగిందని, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానని, ఆమెని విడిచివుండలేనని ఎలాగయినా ఆమెను ఒప్పించి కాంప్రమైస్ చేయించమని ఒకటే బతిమాలాడుతున్నదండి.”
“దానికి మీ రేమన్నారు”
“నేనేమంటాను. మీతో మాట్లాడాలని అన్నాను. మీరెలా చెబితే అలా . కావాలంటే కాంప్రమైస్ కి ఒప్పిస్తే మీ జూనియర్స్ కి కూడా కొంత ఇప్పిద్దాం. ఏమంటారు?” అంటూ అసలు పాయింట్ లోకి వచ్చేసాడు లాయర్ కోదండపాణి.
“ఎంత? మా జూనియర్స్ కెనా ? మాక్కుడాన?” అప్పటికే వసుంధర వదనంలో రంగులు
మారుతున్నాయి. అది గమనిస్తూనే వెంకటేశ్వర్లుగారి వంక చూస్తూ నీళ్లు నములుతున్నాడు కోదండ పాణి.
వెంకటేశ్వర్లు గారు కల్పించుకొని, “చూడండి కోదండపాణి గారు, ఈ కేసు లో తను చాలా దూరం వెళ్ళిపోయింది, కేవలం కోర్ట్ లో వినడమే తరువాయి. ఇప్పుడిక ఈ బేరసారాలు ఉండవని మీ క్లయింట్ కి బాగా నచ్చచెప్పండి,” అంటూ ముగించేశాడు. చెప్పేదేమీ లేక చిన్నపాటి లోకాభిరామాయణం , ఒక కప్పు కాఫీ తోటి సరిపెట్టు కొని వెళ్ళిపోయాడు కోదండ పాణి.
( ఇంకావుంది)