ఎడారి కొలను 

ధారావాహికం -50వ భాగం

(ఇప్పటివరకు:  కోర్ట్ కేసు వాయిదాకి రెండు రోజులు ఉన్నదనంగా మైత్రేయి ఎక్కినా ఆటో ని ఒక బైక్ వ్యక్తి గుద్దేసి వెళ్తాడు. ఆ ప్రమాదంలో చిన్న గాయాలతో మైత్రేయి బయట పడుతుంది. ఇది కావాలనే చేసిన యాక్సిడెంట్ అన్న అనుమానం అందరికి వస్తుంది. జులై 15 న కోర్ట్ లో విచారణ మొదలయింది. కేసుకి సంబంధించిన వాద  ప్రతివాదనలు విన్నతరువాత జస్టిస్ జయమ్మ ఫైనల్ తీర్పు కి డేట్ ఇస్తుంది. పరంధమయ్య గారి రాక ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రసాద్ కి.)

పరంధామయ్య గారిని దింపేసి వస్తుంటే సుమంత్ ఆఫీస్ కి వెళుతూ కనిపించాడు  ప్రసాద్ కి.  ప్రసాద్ ఆగి అతని తో చేతులు కలిపాడు. ఇద్దరు పక్కనే ఉన్న చిన్న టీ కొట్టు లో బెంచ్ మీద కూర్చొని “రెండు కప్పులు టీ”  అని చెప్పాడు ప్రసాద్.

“సుమంత్! ఆశ్చర్యం, నిన్న వసుంధర వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఆయన్ని దింపేసే వస్తున్నాను,” అన్నాడు.

“ ఇందులో ఆశ్చర్యమేమీ లేదు ప్రసాద్, ఆయనతో ఒకరోజు ముందరే వసుంధర మేడం మాట్లాడారు, ఆయనకి అసలు విషయాలన్నీ చెప్పి , అయన అండ ఉంటె మైత్రేయి మరింత ధైర్యం గా ఉంటుందని చెప్పి, ఆయన్ని వాయిదా రోజు కోర్ట్ కి రమ్మని అడిగింది. ఆయనకి ఇప్పటివరకు జరిగింది, అయన అల్లుడు అయన కూతురి పట్ల చేస్తున్న నిర్వాకం రెండు బాగా అర్ధమయి అయన నిన్న కోర్టుకి కూడా వచ్చారు. కానీ తాను వచ్చిన విషయం మైత్రేయికి చెప్పొద్దని అన్నడాయన, అంతేకాదు , తనని చుస్తే మైత్రేయి ఎక్కడ భయపడి బలహీన పడుతుందేమో నని అయన కోర్ట్ లో కూడా వెనకాతల ఎక్కడో కూర్చుని అంత విన్నాడు,” అని వివరంగా చెప్పాడు.

“చాలా మంచి పని చేసారు వసుంధర గారు,” అంటూ “ఓకే మరి మళ్ళి  కలుద్దాం అంటూ కరచాలనం చేసి  ఇద్దరు అక్కడినుంచి వెళ్లిపోయారు.

                                        ************************     

ప్రసాద్ ఇంటికి రాగానే , అపూర్వ వాళ్ళ అమ్మ సుమతి ఫోన్ చేసింది. “ హలో ప్రసాద్ , బాగున్నావా బాబు,”

“ నమస్తే అంటి , బాగున్నాను. మీరెలా ఉన్నారు? మావయ్యగారేలా ఉన్నారు? బుజ్జి బాగున్నాడా ?” అంటూ కుశల ప్రశ్నలు కురిపించాడు.

“ అందరు బాగానే ఉన్నారయ్యా. నువ్వే మమల్ని మరిచిపోయినట్లున్నావు? ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు నీ నుండి. ఎప్పుడు అపూర్వ కేనా, మాకూడా చేయాలి గదా ?”  కాస్త నిష్టురంగా అంది.

“ అయ్యో అదేం లేదండి. ఎదో వర్క్ బిజి ,” అన్నాడు మొహమాటంగా.  ఆమెతో మాట్లాడుతూనే అపూర్వ వాళ్ళఅమ్మకి తాను ఫోన్ లో మాట్లాడుతున్నానని చెప్పింది కాబోలు అని అనుకున్నాడు.

“ వింటున్నావా ప్రసాద్,” అన్నది సుమతి.” ఆ! అంటి !చెప్పండి,” అన్నాడు.

“ అపూర్వ కి అమెరికా ఛాన్స్ వచ్చింది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నది. నిన్ను కలవాలని అంటున్నది. నీకు తెలుసనుకుంటాను ,” అన్నది.

నాకేమి చెప్పలేదే. నేను ఆంధ్ర కి వచ్చిన తరువాత అపూర్వ ని అస్సలు కలవనే  లేదు. అనుకుంటూ , “అలాగే ఆంటీ  నేను మాట్లాడతాను.. ఈసారి మెడ్రాస్ వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పక కలుస్తాను,” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.  ఇప్పుడు అపూర్వ ఎం చెప్పిందో వాళ్ళ అమ్మ నాన్నలకి అని ఆలోచించసాగాడు.

మైత్రేయి చాలా సంతోషంగా ,” ప్రసాద్ గారు మీరు వచ్చేసారా? నాన్నగారికి వెంటనే బస్ దొరికింది కదా ?’ అంటూ వరండాలో తన గది  దగ్గరికి వచ్చింది.

“ ఆ ఆ ! ఎక్కించే వచ్చాను. ఆయన మ ళ్ళి లాస్ట్ వాయిదాకి వస్తానని చెప్పారు కూడా,” అన్నాడు. సుమంత్ చెప్పింది మైత్రేయి కి చెప్పాలా వద్ద అని కాసేపు ఆలోచిస్తూ , ఇప్పుడే వద్దులే. అవసరమయితే వసుంధర గారే చెబుతారు అనుకొంటూ ఆ విషయాలేవి తెలియనట్టు గానే ఆమెతోటి మాట్లాడి , “నాకు పనుంది  మైత్రేయి, మీరు కాలేజీ కి వెళ్ళండి . సాయంత్రం

మాట్లాడుకుందాము,”అన్నాడు.

“ఓకే ఓకే ,” అంటూ మైత్రేయి వెళ్ళిపోయింది. ఇంతలోనే ప్రసాద్ కి ఒక టెక్స్ట్ మెస్సేజ్ వచ్చింది.

“ఐ  యామ్  కమింగ్ ఈవెనింగ్ మెడ్రాస్ మెయిల్ ,

రిసీవ్ మీ ఎట్ విజయవాడ స్టేషన్ ,అపూర్వ”

ప్రసాద్ కి మనసంతా ఏదో తెలియని బాధ కమ్మేసింది. ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపాడు. తన గది  చాలా చిన్నది అపూర్వ వస్తే ఎక్కడ ఉంచను? తనని ఎలా మానేజ్ చేయాలి ? అయినా ఎందుకొస్తుంది ఇక్కడికి? నన్ను రమ్మంటే నేనే వెళ్ళేవాడిని కదా? ఇలాటి ఆలోచనలతో ప్రసాద్ కి తల వేడె క్కి  పోతున్నది. సాయంత్రం టైం ఎంతయిందో కూడా చూసుకోలేదు మైత్రేయి పిలిచేవరకు. ప్రసాద్ ని చూస్తూనే మైత్రేయి కి అనిపించింది అతను దేనికో ఆందోళన పడుతున్నాడని.

“ ప్రసాద్ గారు, ఎందుకలా ఉన్నారు? మీకు వంట్లో బాగా లేదా? డాక్టర్ దగ్గరికి వెళదామా ?” అన్నది.

“ అయ్యో నేను బాగానే ఉన్నాను మైత్రేయి,” అన్నాడు పొడిపొడిగా.

“ మీరు అబద్దం చెబుతున్నారు? ఎదో ఉంది ? ప్లీజ్ చెప్పండి/ తనకెందుకులే అని అను కోవద్దు. ఫ్రెండ్ షిప్ అన్నాక ఒకరికొకరం హెల్ప్ చేసుకోక పోతే ఎలా, ప్లీజ్ చెప్పండి,” అని బతిమాలాడింది.

ఇక ప్రసాద్ కి చెప్పక తప్పలేదు. “అంత సీరియస్ విషయమేమి కాదు మైత్రేయి, నా భార్య అపూర్వ ఇవాళ రాత్రి మెడ్రాస్ మెయిల్ లో ఇక్కడి కోస్తున్నది. నన్ను విజయవాడ స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకోమని మెసేజ్ పెట్టింది,” అన్నాడు.

“ ఇంత మంచి వార్తకి ఖుషి గా ఉండాలి  ప్రసాద్ గారు, అలా డల్ గ చెబుతారేంటి?” అంది ఉత్సాహంగా.

“నా గది చాలా చిన్నది కదండీ,ఇక్కడ అపూర్వ ఎలా అడ్జస్ట్ అవుతుందోనని  ఆలోచిస్తున్నాను ,” అన్నాడు.

“అంతలా ఆలోచించటానికేముంది నాతోనే నా ఇంట్లో ఉంటుంది, మీరేమి ఇబ్బంది పడకండి. మీరు తనని తీసుకురండి మనం అడ్జస్ట్ చేసుకుందాము,” అంది. వద్దంటానికి కూడా అవకాశం లేక పోవడం తో మైత్రేయి చెప్పిన దానికి ఒప్పేసికొని విజయవాడ వెళ్ళాడు అపూర్వని  రిసీవ్ చేసుకోవడానికి. ప్రసాద్ వెళ్ళగానే మైత్రేయి  తన బెడ్ రూమ్ ని చక్కగా సర్దింది. ముందు గదిలోకూడా ఒక మంచం ఏర్పాటు చేసింది. రాత్రికి డిన్నర్ కూడా రెడీ చేసి వాళ్ళ రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

ప్రసాద్ బస్ లో విజయవాడ చేరుకొని రైల్వె స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురుచూడసాగాడు. స్టేషన్ అంతా  చాల కోలాహలంగా ఉన్నది. ప్రతి రెండునిమిషాలకి ఏదొక అనౌన్సమెంట్ వినిపిస్తూనే ఉన్నది. ప్రతి ప్లాట్ ఫామ్ జనాలతో కిటకిటలాడుతుంది. ఎంత వేగంగా రైళ్లు వచ్చి ఆగుతున్నాయో  అంతే వేగంగా జనం పరిగెడుతున్నారు వాళ్ళు ఎక్కాల్సిన బోగిల్లోకి. ఆ హడావిడిలో ఒకరినొకరు తోసుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. అందరికంటే తానే  ముందుగా ట్రైన్ ఎక్కెయ్యాలన్న తాపత్రయం మాత్రం అందరిలో మెండుగా కనిపిస్తున్నది.

అంత శబ్దం లోను ప్రసాద్ మనసు నిశ్శబ్దం గా ఉన్నది. మనసు ఆలోచించటం మానేసింది. ఇంత హాఠాత్హుగా రావాల్సిన అవసరం ఏమై ఉంటుందబ్బా అన్న ఆలోచన ఒక్కటే ప్రసాద్ ని ఒక చోట నిలబడనీయటంలేదు. రాత్రి పదిగంటల పదిహేనునిమిషాలకి మెడ్రాస్ మెయిల్ నాలుగో ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్నట్లు అనౌన్సమెంట్ వినిపించింది. ప్రసాద్ చక చక మెట్లు ఎక్కుతూ నాలుగో ప్లాట్ ఫా మ్ చేరుకున్నాడు. ఏ బోగీలో ఉన్నదో తెలియక A c/టు టయిర్ , త్రి టయిర్ బోగీలన్నీ వెతకటం చేస్తున్నాడు. ఏ 2 బోగి లోంచి దిగుతున్న అపూర్వ కనిపించింది. ప్రసాద్ ఆమె వైపుకి నడిచాడు. బోగీలోంచి అపూర్వ వెనకాలే భవ్య కూడా దిగింది. ప్రసాద్ ఆమెని చూస్తూనే ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అది పైకి కనిపించనీయకుండా , ప్లెసెంట్ గా వాళ్ళని రిసీవ్ చేసుకొని , వాళ్ళ సూట్కేస్ కూడా కిందకి దింపాడు.

“ హాయ్ ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు?” అంటూ పలకరించింది భవ్య. అపూర్వ ప్రసాద్ ని చుట్టేసి ,” హాయ్ డియర్ , ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం కలుసుకుంటున్నాము. నువ్వు వస్తావో లేదో అనిపించింది. కానీ నా మనసుకి తెలుసు నువ్వు తప్పక వస్తావని,” అంటూ చేతిలోచెయ్యేసి ఒకచేత్తో హ్యాండ్ బాగ్ తోటి నడవసాగింది. ప్రసాద్ సూట్కేస్ పట్టుకొని నడవ సాగాడు. స్టేషన్ బయటికి రాగానే ,” భవ్య మీరు కూడా మాతోపాటు మా ఇంటికి వస్తారా?” అన్నాడు.

“ లేదు,  లేదు! నేను విజయవాడలో  హోటల్ ఖాంధార్  లో రూమ్ బుక్ చేసుకున్నాను. కావాలంటే మీకు అపూర్వ కోసం కూడా ఇంకో రూమ్ తీసుకుందాము,” అన్నది.

“ వద్దు . నేను విజయవాడ లో ఉండను. విజయవాడ దగ్గరలో ఉన్న   తెనాలి లో ఉంటాను,” అన్నాడు.

“వ్వాట్? నువ్వు విజయవాడలో ఉండవా? మరి  మనం  ఎప్పటికి చేరుకుంటాము తెనాలి?” అడిగింది అపూర్వ అసహనంగా.

నేను కాబ్ బుక్ చేశాను వన్ అవర్ లో వెళ్లిపోవచ్చు అంటూ భవ్య కోసం కాబ్ బుక్ చేసి , తమ కోసం కూడా ఇంకో కాబ్ బుక్ చేసుకొని తెనాలి కి బయలు దేరారు.  రాత్రి పన్నెండు అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు ప్రసాద్ అపూర్వ తో.

అపూర్వని చూస్తూనే ఎంతో ప్రేమతో మైత్రేయి ఆమెని ఇంట్లోకి తీసుకెళ్లింది. తెల్లగా పాలరాతి బొమ్మల ఉన్న అపూర్వ ను చూస్తూ   “ప్రసాద్ గారికి చాలా అందమయిన భార్య ఉన్నది’ అనుకున్నది మనసులోనే.

మైత్రేయి ని పరిచయం చేసాడు ఆమెకి. “ అపూర్వ నువ్వు మైత్రేయి గారింట్లో బెడ్ మీద పడుకో, భోజనం కూడా ఇక్కడే, నా గది  చాలా చిన్నది, నేనెళ్ళి పడుకుంటాను,” అన్నాడు.

“అదేంటి ప్రసాద్ గారు, మీరు మాతో కలిసి తినరా? పైగా మీ భార్యకూడా ఉన్నది. మీరు ఫ్రెష్ అయి రండి అందరం కలిసే తిందాము ” అన్నది మైత్రేయి చనువుగా.  మైత్రేయి చూపిస్తున్న చనువు ఎందుకో అపూర్వకి నచ్చలేదు.

“తనకి తినాలని లేదంటే మీరెందుకు ఆయన్ని బలవంతపెడుతున్నారు. ఆయన్ని వెళ్లి పడుకోనీయండి. మనం తిందాము,” అంది కాస్త రాష్ గా.

ప్రసాద్ వస్తున్న కోపాన్ని అణుచుకుంటున్నట్లు దవడలు బిగించి కొంచం సీరియస్ గా అపూర్వ వంక చూస్తూ, “అపూర్వ ముందు నువ్వెళ్ళి ఫ్రెష్ అవు,” అన్నాడు. అపూర్వ తన సూట్కేస్  లోంచి బట్టలు తీసుకొని చరాచర వెళ్ళిపోయింది.

“మైత్రేయి, నాకు చాల అలసటగా ఉన్నది, కొంచం మజ్జిగ ఇవ్వండి చాలు, తాగేసి వెళతాను, తినేసి మీరు పడుకోండి, రేపుదయం తీరికగా మాట్లాడుకుందాము,” అంటూ  మైత్రేయి ఇచ్చిన మజ్జిగ తాగేసి తన రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.

ప్రసాద్ ఎందుకో బాధ పడుతున్నాడని పించింది మైత్రేయికి.

అపూర్వ ఫ్రెష్  అయి వచ్చింది. “ మైత్రేయి గారు, ప్రసాద్ వెళ్ళిపోయాడా?” అడిగింది.

“ఇప్పుడే తను వెళ్లి పోయాడు . నిద్దర వస్తున్నదని, రేపుదయం మాట్లాడుకోవచ్చని చెప్పాడు ,” అంది.

“ అదేంటి, ఆ విషయం నాతో  నే చెప్పొచ్చుగా?  మీ తో టి చెప్పించటమెందుకు,” అంది చిరాకుగా. మైత్రేయి మౌనంగా ఆమెని అర్ధం చేసుకునే ప్రయత్నం లో ఉంది. అపూర్వ కి ప్లేట్ లో చపాతీ కుర్మా పెట్టి ఇచ్చింది. అపూర్వ మైత్రేయి కోసం ఆగకుండానే గబా గబా తినేసి , “ మైత్రేయి , నేను ప్రసాద్ దగ్గరికెళ్తాను. కొద్దిసేపు మాట్లాడి వచ్చేస్తాను పడుకోవటానికి, మీరు పడుకోండి, తలుపు కి  గొళ్ళెం  పెట్టకండి,” అని హడావిడిగా చెప్పేసి  ప్రసాద్ రూమ్ కి వెళ్ళింది.

తలుపు బోల్ట్ వేసి ఉండటం తో  కాస్త గట్టిగానే తలుపు మీద కొట్టింది. ప్రసాద్ కొంచం విసురుగా తలుపు తీసాడు. “ఏంటి ప్రసాద్ , ఇన్ని రోజులకి నేను వస్తే  నాతో మాట్లాడకుండా , వచ్చి పడుకున్నావు?”

“ అదేం లేదు అపూర్వ , నీకు నాతో కబుర్లెముంటాయి చెప్పు? ఎదో అవసరముండే  ఇక్కడి దాక వచ్చావనిపిస్తున్నది.  అలాటి ది  ఏదయినా ఉంటె మనం రేపు శాంతి గా మాట్లాడుకోవచ్చు. నువెళ్ళి పడుకో ,” అన్నాడు సహనంగా.

“ రేపటిదాకా నేను ఆగలేను. రేపు నేను విజయవాడ వెళ్ళాలి. భవ్య నేను చాల ప్లాన్ చేసుకున్నాము తిరగటానికి. నువ్వు కూడా ఉంటావని అనుకున్నాను. నాకేం తెలుసు నువ్విక్కడ అజ్ఞాతవాసం గడుపుతున్నావని ,” అంది చురుకుగా.

“ మంచిగా చెప్పావు. నాది అజ్ఞాత వాసమే. నీ రాక నా జీవితాన్నే మార్చేసింది. నేను నిన్నునీ సంతోషానికి అటంకంలేకుండా  నిన్ను వదిలేసి వచ్చేశాననుకున్నాను కానీ  నేను నానుండే  పారిపోతున్నానని అనుకోలేదు.” అన్నాడు విరక్తిగా.

“ నువ్వేం మాట్లాడుతున్నావో  నాకేమి అర్ధం కావటం లేదు. కానీ నేను ఎందుకొచ్చానో    ఇప్పుడే చెప్పాలి ,” అంది పెంకిగా.

“ సరే చెప్పు,” అన్నాడు నిర్లిప్తంగా.

“ మేము పని చేస్తున్న కంపెనీ కి మా ప్రాజెక్ట్ వర్క్ బాగా నచ్చింది. అందుకే మాకు ఏడాది కాకుండానే అమెరికాలో ఉన్న వీళ్ళ కంపెనీలో  వర్క్ చేయడానికి పర్మిషన్ దొరికింది.  మేము ఆల్రెడీ USA వెళ్ళడానికి కావాల్సిన పేపర్ వర్క్ చేసేసాము. ఒక సారి వర్కుపర్మిట్ మీద మేము USA చేరుకుంటే, అక్కడే స్థిరపడిపోవచ్చని అనుకుంటున్నాము.”

“ కంగ్రాట్స్!”

“ కానీ అమ్మ నన్ను ఒక్కదాని వెళ్ళటానికి వప్పుకోవటం లేదు. భవ్య తోటి వెళుతున్నానని చెబితే, ఆ పిల్లెవరూ. నీకు పెళ్లయింది కదా! నీ భర్త ని సంసారాన్ని వొదులుకోని ఎలా వెళతావు అని ఒకటే గోల చేస్తున్నది. ఆమెకు మా గురించి తెలియదు కదా! అందుకే నీతో మాట్లాడి అమ్మని ఒప్పించమని అడుగుదామని వచ్చాను,” అన్నది.

“ అపూర్వ, ఆమె నీకు  కన్నతల్లి. ఆమెకి నిజం చెప్పొచ్చుకదా? అది నీకు, నాకు, వాళ్ళకి కూడా మంచిది. నీకు భవ్య కున్న రిలేషన్ ని ఎంతకాలం దాచిపెడతావు? ఇప్పుడేమో నీ దారి నువ్వు చూసుకుంటున్నావు. అసలు విషయం  తెలియక వాళ్లెంత  మానసిక క్షోభ అనుభవిస్తారో ఆలోచించావా?”

“ఆలోచించడానికేముంది. వాళ్ళకి చెబుతాను, కొన్ని నెలల తరువాత నువ్వు USA వస్తావని, ప్రాబ్లమ్  సొల్వెడ్ .” అంది చిలిపిగా.

అది పసిపిల్ల మనస్తత్వమో, లేక నిర్ల్యక్శయమో అర్ధం కాలేదు ప్రసాద్ కి.

“ నేను వస్తానని నువ్వెలా అనుకున్నావు. ”

“ ఎం నువ్వు రావా నేను పిలిస్తే ?”

“  ఏ హక్కుతో రమ్మంటావు నన్ను?”

అపూర్వ మౌనంగా ఉండిపోయింది. “చూడు అపూర్వ! మన ఈ  వివాహ బంధాన్ని ఇక్కడితో ఆపేద్దాము. నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు. అయన తో మాట్లాడి ఎవ్వరికి ఏ  ఇబ్బంది కలగకుండా మనం విడిపోదాం. అప్పుడు నువ్వు మరింత స్వేచ్ఛగా నీ జీవితాన్ని అనుభవించొచ్చు. నేను బంధ విముక్తుడినవుతాను . ఏమంటావు?”  అపూర్వ ఆలోచన లో పడింది.

“అలాగే రేపు మాట్లాడుకుందాము,” అని వెళ్ళిపోయింది పడుకోవటానికి.

************

ప్రసాద్ అపూర్వ ని తీసుకొని లాయర్ వెంకటేశ్వర్లు గారి దగ్గరికి పోయాడు. అయన కి ప్రసాద్ గురించి పూర్తిగా  తెలియకపోవడం తో, తన భార్యని పరిచయం చేయడానికి తీసుకొచ్చాడనుకొని వసుంధర ని కూడా పిలిచాడు. కొద్దీ సేపు పిచ్చాపాటి కబుర్లు అయ్యాక వసుంధర కోర్ట్ కి   బయలు దేరింది. వెంకటేశ్వర్లు గారేమో ప్రసాద్ తోటి కబుర్లు చెబుతున్నాడు. వెళ్ళబోయేముందు వసుంధర అపూర్వ కి స్కై బ్లూ కలర్  సిల్క్ చీరని బొట్టు పెట్టి ఇచ్చింది. వసుంధర వెళ్ళగానే ప్రసాద్ వెంకటేస్వర్లు గారికి తానొచ్చినా పని చెప్పాడు.

“ అర్ధమయింది ప్రసాద్! నీ భార్య కి నీ తో వివాహ జీవితం మీద ఆసక్తి లేదు. ఆమెకి ఆమె ఫ్రెండ్ భవ్య మీద ఆసక్తి ఆకర్షణ ఉన్నాయి. కానీ నీకు ఆమెకి వివాహమైంది. ఇది కాస్త చిక్కే, ఎందుకంటే వాళ్ళ సహజీవనాన్ని సపోర్ట్  చేసే చట్టాలింకా మన దేశం లో రాలేదు. మీరిద్దరూ విడాకులు తీసుకోవాలంటే ఆమె గురించి చెప్పక తప్పదు. అలా చెప్పటం  ఆమెకి ఇష్టం లేదు,” అంటూ అపూర్వ వంక చూసాడు. అపూర్వ తనకేమి పట్టనట్టు కూర్చుంది.

“ అవును.  మీరే చెప్పాలి,” అన్నాడు ప్రసాద్ .

“ ఆలోచిస్తాను. వసుంధర ఏదయినా ఐడియా ఇస్తుందేమో చూద్దాము. మీరిద్దరూ లంచ్ కి ఎందుకు రాకూడదు,” అన్నాడు.

“ అయ్యో మీకెందుకండి శ్రమ, మేడం తో మాట్లాడి నాకు కాల్ చేయండి నేను ఈవినింగ్ వస్తాను,” అంటూ లేచాడు.

అపూర్వ ని తీసుకొని నేరుగా ఇల్లు చేరుకున్నాడు. “ అపూర్వ భవ్య కి చెప్పు ఇంకొక రెండురోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుందని,” అన్నాడు.

ఏ  కళ నుందో  “అలాగే,” అంటూ తలూపింది.

“నాకు పనుంది,” అంటూ ప్రసాద్ వెళ్ళిపోయాడు.

(ఇంకావుంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

శాన్వి చిత్రాలు