ఉషోదయం

       మాధవపెద్ది ఉషా

పొగడ్తతో సాధించలేని పనిలేదు

పొగడ్తలంటే ఇష్టపడనివారు, పొగడ్తలకి లొంగనివారూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ ముఖస్తుతికీ, నిజాయితీ ప్రశంసకూ తేడా తెలుసుకుని ఉండాలి. నిజమైన ప్రశంస మనిషికి ఆహ్లాదాన్ని కలిగించడమే కాక వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

కొంతమంది ఎదుటివారిని తెగ పొగిడేస్తూ తమ పనులు చేయించుకుంటూ ఉంటారు. అలాంటివారిని కనిపెట్టి వారికి దూరంగా ఉండడం మంచిది. నిజమైన ప్రశంస అంటే మంచి గంధపు లేపనం లాంటిది. అటువంటి ప్రశంసల వల్ల మనిషిలో నిద్రాణమై ఉన్న కళలూ, నేర్పరితనం, వగైరా పైకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అది ఒక టానిక్ లాంటిది.

కొంతమంది తమ పనులు చేసుకోవడానికి పొగిడి ఎదుటివారిని తమ బుట్టలో వేసుకుంటే, మరికొంతమంది అసలు ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను పొరపాటున కూడా మెచ్చుకోరు. వారికి తాము అలా చేస్తే ఎదుటివారికి గర్వం వచ్చేస్తుందన్న అభిప్రాయం ఉంటుంది.

కానీ, అటువంటివారు మాత్రం తమని అందరూ మెచ్చుకోవాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.

భార్యభర్తల బంధం పటిష్ఠం కావాలంటే ఒకరినొకరు సందర్భం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ప్రశంసించుకోవడం ఎంతైనా అవసరం. భార్య ఏదైనా కొత్త వంటకం చేసినప్పుడో, అందంగా అలంకరించుకున్నప్పుడో ‘అబ్బ ఈ వేళ నీవు చేసిన కూర ఎంత బాగా కుదిరిందనో, ఈ అలంకరణలో నువ్వు ఎంత అందంగా ఉన్నావనో’ ప్రశంసిస్తే ఇక ఆ భార్య ఎంతగా పొంగిపోతుందో చెప్పలేం.

అలాగే భర్త బయట ఆఫీసులో ఏదైనా సాధించినప్పుడో లేక ప్రమోషను వచ్చినప్పుడో అబ్బ మీరు ఎంత తెలివైన వారండీ మీ తెలివితేటల వల్లనే మీకీ ప్రమోషన్ వచ్చిందని భార్య కనుక మనస్ఫూర్తిగా ప్రశంసిస్తే ఇక ఆ భార్య పట్ల భర్త అనురాగం రెట్టింపు అవుతుంది. అంటే అతిశయోక్తి కాదు.

నాకు తెలిసిన ఒక భార్య భర్త ఉన్నారు.  భార్య ఒక రైటర్ కానీ ఆవిడ రాసిన కథలూ, వ్యాసాలూ ఆమె భర్త ప్రశఁసించకపోగా కనీసం చదవనైనా చదవడు. అందుకు ఆమె బాధపడని క్షణం లేదు. ఇక సెలవు రోజుల్లో గడ్డం చేసుకోవడానికి బద్ధకించే భర్తలున్న భార్యలకి ఓ చిట్కా. మీరు గడ్డం చేసుకుంటే ఎంత బావుంటారండీ అని ఒకసారి అని చూడండి. ఆయనలో వచ్చే మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు.

అలాగే ఆఫీసులో పనిచేసే సబార్డినేట్స్ బాస్ కనుక వారి పనితనాన్ని అప్పుడప్పుడు మెచ్చుకుంటూ ఉంటే వారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్న విషయం ముమ్మాటికీ నిజం.

ఇక పిల్లలు చదువులో బాగా రాణించి జీవితంలో పైకి రావాలంటే పెద్దలు చేసే చిన్న చిన్న ప్రశంసలు ఎంతో దోహదపడుతాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రోగ్రెసు మార్కులు చూసి వారికి మూడో ర్యాంక్ వస్తే, రెండో ర్యాంక్ రాలేదేమనీ, సెకండ్ వస్తే ఫస్ట్ ర్యాంకు రాలేదని నిరుత్సాహపరుస్తారు. అలా కాకుండా థర్డ్ ర్యాంకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ ఈసారి ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే నీకు సైకిల్ కొనిపెడితాననో, లేక రిస్ట్ వాచ్ కొని పెడతాననో చెప్పి వానిని ప్రోత్సహించాలి. అంతేకానీ పిల్లల శక్తికి మించిన లక్ష్యాలను వారి ముందుంచి వారిలో ఆత్మవిశ్వాసం పోయేటట్లు చేయరాదు. అందరూ ఏ ఐన్ స్టీనో, లేక బిల్ గేట్స్ కాలేరు కదా.

ఈ ప్రశంస అనే టానిక్ అరవై దాటిన ముసలివారికి అక్కర్లేదు అనుకుంటే పొరపాటే. అరవై దాటిన ఏ ముసలివారికైనా “అబ్బా! మీరి వయస్సులో కూడా ఇంత యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతున్నారండీ” అని చూడండి. ఆయన పాతికేళ్ళ యువకుడి లాగా ఫీల్ కాకపోతే అప్పుడడగండి. దాని ప్రభావం ఆయన దినచర్యలో కూడా పడకుండా ఉండదు. “మీకే మండీ! మీరు తలచుకుంటే ఏమైనా సాధించగలరు లాంటి ప్రశంసల వల్లనే సీనియర్ ఒలింపిక్స్ రాణించిన వృద్ధులు ఎందరో!

అలాగే అప్పటి దాకా ముక్కుతూ మూల్గూతూ ఉన్న బామ్మలూ, నాయనామ్మలూ, ఏ మనవడో , మనవరాలో వచ్చి “నీవు ఫలానా స్వీట్ బాగా చేస్తావు బామ్మా…. అది చేసి పెట్టవూ” అని అడగ్గానే ఎక్కడలేని ఓపిక తెచ్చుకుని లేచి అప్పటికప్పుడు అవి చేసి పెట్టడం మనం ప్రతీ ఇంట్లోనూ చూస్తూనే ఉంటాము. ప్రశంసలకు అంతటి శక్తి ఉన్నదన్న మాట. అందుకే ప్రశంసలను అందుకోవడంలో ఉన్న ఉత్సాహం ప్రశంసలను అందజేయడంలో కూడా చూపించాలి ఏమంటారు.

 

 

 

 

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణీయం

నా నుంచి మనంలోకి (నాటకం)