
ఉదాసీనం ఉలిదెబ్బ పడని శిలలాంటిది
ఉత్సాహలేమి ఊబిని తలపిస్తుంది
నిర్వేదం చైతన్య శీలతకు
పెనుముప్పౌతుంది
అనాసక్తి అనుభూతి పరిమళాల్ని ఆస్వాదించనీయదు
నిరాసక్తి మదిని అయోమయంలో పెట్టి
లక్ష్యసాధనను తిరోగమనంలోకి నెట్టేస్తుంది
స్పందించని నీ మది సాధించాలనే తపనను తుంగలోకి తొక్కేసి బతుకు పోరును సందిగ్ధంలో పడేస్తుంది
జీవనగమనాన్ని తలక్రిందులు చేస్తూ నిస్తేజ స్థితిలో స్థిరావాసం చేయిస్తుంది
సవాలుకు స్పందించని తత్వంతో నీలోని సామర్థ్యాలకు తిలోదకాలు ఇవ్వబడతాయి
ఉత్సాహలేమి ఓ సామాజిక రుగ్మత నిస్తేజమైన నీ భావోద్వేగాలపై స్వయం ప్రేరణాస్త్రం సంధించి నిన్ను నీవు వెన్ను తట్టుకుంటూ
పడి లేచే కెరటమై ముందుకు సాగాలి
ఉదాసీనతా ఉప్పెనలో కొట్టుమిట్టాడక
చైతన్య స్రవంతివై ఉరకలేయాలి
స్తబ్దత వీడిన మరుక్షణంలో నువ్వు గ్రహణం విడిచిన సూర్యబింబమౌతావు