
పోస్ట్…. పోస్ట్ మాన్ గట్టిగా అరిచే కేక వీనులకు విందుగా ఉండేది ఒకప్పుడు. మిట్ట మధ్యాహ్నం వేళలో కాస్త కునుకు తీసే సమయంలో నిద్రాభంగం కలిగిస్తూ సైకిల్ బెల్ తో పాటు వినిపించే కేక.. అది వలపు ఉత్తరమైతే తలుపుకి అతికించిన కళ్ళతో ఎదురు చూస్తూ… ప్రేమంతా నింపి అక్షరాలుగా ఒంపి తమకంలో ముంచే వాక్యాలను చేత్తో తడమాలని ఎంత ఆరాటమో? చిరు అలకలు, గిల్లి కజ్జాలు, గదమాయింపులు, కవ్వింతలు, నిష్ఠూరాలు, ప్రశ్నల బాణాలు, చివరకు సముదాయింపులు అన్నీ సొంత దస్తూరీతోనే. తిరిగి వచ్చే జవాబు కోసం వారంరోజులు ఎదురుచూడడంలో ఎంత హాయి?? ఒక్కో క్షణం ఒక్కో యుగమై కాలం భారమై తోచేది. ఇక స్నేహితుల ఉత్తరాలైతే కలిసివున్న క్షణాల కబుర్లు, కలుసుకోలేక పోతున్నామన్న వేదనలు, వ్యక్తిగత సమస్యల ఊరటలు, కన్నీటి తుడిచివేతలు, నేనున్నానంటూ మనోబలాన్ని పెంచే మమతలు కలబోసిన మనసుల చెమరింతలు.. అత్తవారింటికి వెళ్లిన ఆడపడుచు పుట్టింటి వారికి రాసే లేఖల్లో అత్తవారింటి కొత్తదనాలు, అలవాట్ల సర్దుబాట్లు, వీటికి జవాబుగా ఏది ఎలా వున్నా చక్కదిద్దుకోవాలని, పుట్టింటి, మెట్టింటి గౌరవాన్ని కాపాడాలని, వారికి అనుకూలంగా మెదలాలని తల్లిదండ్రుల ఓదార్పులు, హితబోధలు….దూరంగా చదువుకుంటున్న పిల్లలు ఇంటికి రాసే ఉత్తరాల్లో తాము చదువు కోసం పడుతున్న కష్టం, తిండి విషయంలో చేసుకుంటున్న సర్దుబాటు, ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరిస్తే “ఇప్పుడు కష్టపడితేనే మాపై ఆధారపడకుండా భవిష్యత్తులో మంచిస్థాయిని సంపాదిస్తావని, అవసరమైనప్పుడు ఏమి చేసైనా డబ్బులు పంపిస్తామని, బెంగ పడొద్దని” రాస్తూ, చాటుగా
తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చే సందర్భాలు. ఇలా ఎన్నో, ఎన్నెన్నో..
ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలలో ఉన్నవారు ఉత్తరాలు రాసుకుంటూ సంబోధన తోనే ‘ఉభయకుశలోపరి’ అని ఒకరికొకరి యోగ క్షేమాలు తెలుపుకోవడంలో ఎంతో ఆత్మీయత కురిసేది. ఇక పెళ్లిళ్లు, పేరంటాలు, అనారోగ్యాలు, మరణవార్తలు అన్నీ ఉత్తరాల్లోనే.. ‘పోస్ట్’ అనగానే ఏ వార్త చూడాల్సి వస్తుందోనని గుండె దడ పెరిగే సందర్భాలు కూడా అనేకం…ప్రభుత్వ వ్యవహారాలతో సహా ఎలాంటి లావా దేవీలైనా ఉత్తరాల్లోనే..ఇంకా చెప్పాలంటే ఉద్యమ స్ఫూర్తిని కలిగించడంలో, విప్లవజ్వాలలు రగిలించడంలో, నిరసన సెగలు పుట్టించడంలో కూడా లేఖల పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆనాడు లేఖలే ప్రచారాలు. వాటిల్లో చాలా ముఖ్యమైన వాటిని అపురూపంగా అల్మారాలో దాచుకొని, గుర్తొచ్చినప్పుడల్లా మరోసారి చదువుకొని, అనుభూతిని నెమరు వేసుకోవడం మనసును ఆనందంలో ఊయలలూపేది….సాధారణమైన వాటిని తీగకు గుచ్చి కొయ్యకు తగిలించడం, దూలాల సందుల్లో చెక్కడం గమ్మత్తు అయిన అనుభవం.
సత్వర వేగంగా సాగుతున్న ప్రగతి కొన్నింటిని దూరం చేసినా దేన్నీ కాదనలేని స్థితి. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులన్నీ ఆహ్వానించదగినవే, మన్నించదగినవే, ఆచరించదగినవే.
మనిషి జీవన క్రమంలో ఎదుగుదల ఎంత అవసరమో దానికి తగ్గ విచక్షణ , నైతిక, మానవీయ విలువలను గుర్తెరిగి సంస్కారవంతుడుగా ఉంటే ఎంతటి అభివృద్ధి అయినా హానికరం కానేరదు. లేకుంటే తనను తాను పతనావస్థలోకి నెట్టుకోవడమే కాక సమాజ పతనానికి కూడా కారకుడవుతాడు. అవునన్నా, కాదన్నామనిషి మనిషిగా జీవించడమే అసలైన ప్రగతి..కాదంటారా???