1..ఉత్పలమాల
స్వాగతమిత్తువిశ్వవసు సాదర స్నేహపు స్వాంతనంబుతో
భాగము నందరిన్ కలిపి భాసుర మొప్పగ నుత్సవంబునన్
భోగము చిందగన్ విరిసె భూతల శోభలు మిన్ను తాకగన్
రాగము కోయిలల్ పలుకు రమ్యత నామని కాలమందు నన్!
2.ఉత్పలమాల
ఆమని రాగమై కులుకు నానవ కన్యక చూడముచ్చటన్
తామస మంతయున్ తొలగి ధారుణి నిండెను రంగవల్లి తో
గోముగ నిల్చెనే ప్రియుడి కోసము కొమ్మల కోకిలమ్మగన్
కోమల మాధురీ రసము గ్రోలుతు మత్తుగ చిందులేయుచున్!
3.
ఉత్పలమాల
నూతన వర్షమై కదులు నూహల నాశలు తేజమొందగన్
పోతగ పోసెనాశయము పూర్ణిత లక్ష్యము కార్యశీలతన్
జాతికి జాగృతిం గలుగ చైత్రపు కౌముది స్వాంతమీయగన్
ఖ్యాతిని పొందగోరనిల గాథలు కృత్యపు క్రాంతిరేఖలై !
4..ఉత్పలమాల
కోయిల పాటలన్ వినగ కొత్తదనమ్ములు హృద్యమొప్పగన్
హాయిగ జావళీల పద హాస్యపు జల్లుల మేళవింపుతో
మాయల మర్మముల్ విడిచి మంజుల భాషణ మోదమీయగన్
రాయల కాలమందలి సరాగము రాజ్యము నేలగా వలెన్!
5.
ఉత్పలమాల
అర్పణ జేసితిన్ కృతిని నచ్యుత మూర్తికి వందనమ్ముతో
నేర్పుగ భాసిలెన్ ఘనపునెయ్యము నాకస వీధులందునన్
దర్పము లేకయున్ నిలుచు తారల వెల్గులు కైతలందునన్
కర్పుర స్వచ్ఛతల్ విరియు కాంతులు చంద్రుని మోవిపైగనన
6.కందము
తీపి పులుపు చేదు వగరు
తాపినకారపు మిరియము తగినంతుప్పున్
జ్ఞాపికగా షడ్రుచులే
నోపికతోజీవితములనొద్దిక జేయున్!
7.కందము
పంచాంగశ్రవణమ్ములు
వంచన లనురూపుమాపి బ్రతుకున వెలుగుల్
పంచగ మమతలు విరియును
సంచిత పుణ్యము యిహమునసాఫల్యమగున్!