ఈ దారి ఎక్కడికి ?

కథ

శీల సుభ్రదాదేవి

”అమ్మా మిక్కిమౌస్‌” అంటూ ఒక పాప వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని లాగుతూ అటువైపు వెళ్లామని పేచీ పెడ్తోంది.

ఫంక్షన్‌ హాలులోకి అడుగు పెట్టగానే అరుంధతికి కనిపించిన దృశ్యం అది. మిక్కీమౌసే అటువచ్చి పాపకి షేక్‌ హాండ్‌ యిస్తుంటే ఆ పాప సంబరంగా గెంతులేస్తోంది. మిక్కీమౌస్‌ ఆ పాపకి ‘బై’ చెప్పి అరుంధతి వైపు వచ్చి షేక్‌ హాండ్‌ కి చెయ్యి చాపింది.

శోభతో మాట్లాడుతూనే ఎదురుగా నిలబడిన మిక్కీమౌస్‌ ముఖంలోకి చూసింది అరుంధతి. మిక్కీమౌస్‌ కళ్ళు మిలమిల మెరిసాయి. అంతలోనే మరో బాబు వస్తుంటే అటువైపు వెళ్ళిపోయింది.

‘పెళ్ళిళ్ళ సీజను అంటేనే మండే ఎండాకాలం. దానికితోడు ఆ వేషంలో… పాపం… ఎలా భరిస్తారో” జాలిగా చూసింది అరుంధతి.

”ఇంత ఆలస్యం ఏమిటే” అంటూ పెళ్ళికొడుకు తల్లి అయిన చిన్ననాటి స్నేహితురాలు ముందు వరసలో కూర్చోటానికి పిలిచింది. అక్కడ కూర్చున్న వాళ్ళకు నీళ్ళు అందిస్తున్న అమ్మాయి చటుక్కున పక్కకి తప్పుకోబోయింది.

”కాస్త నీళ్ళు యియ్యమ్మా” అని అరుంధతి చెయ్యి చాపేసరికి ముందుకు వచ్చింది. ఆ అమ్మాయిని పరకాయించి చూసి ఆశ్చర్యపోయింది అరుంధతి. ఆ అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఎనిమిదో తరగతి చదివే కమల! యూనిఫామ్‌ లో చిన్నగా కనిపించే ఆ పిల్ల, చీర కట్టుకొని సిగచుట్టుకొని ఉంటే గుర్తుపట్టలేక పోయింది అరుంధతి. అక్కడ నలుగురైదుగురు అమ్మాయిలు ఒకే రకమైన వేషధారణతో ఒకే అలంకరణతో అందరికీ నీళ్ళు, స్నాక్స్‌ అందిస్తున్నారు. వారిలో కమల ఒకతి.

”నువ్వా కమలా!” అని పలకరిస్తూ తాగిన గ్లాసుని ఆమె పట్టుకున్న ట్రేలో పెట్టింది.

”అవును టీచర్‌, కేటరింగు వాళ్ళు మా బస్తీ దగ్గర ఉంటారు. వాళ్ళు ఏ ఫంక్షనుకు కేటరింగు చేసినా మమ్మల్నే ‘వాటర్‌ ఉమెన్‌’గా తీసుకెళ్తారు టీచర్‌” అని చెప్పి మరోవైపు నీళ్ళు అందించటానికి వెళ్ళిపోయింది.

‘పరీక్షల సమయం దగ్గర పడింది. వీళ్ళు ఇలా పన్లకి పోతుంటే చదువేంగాను’ ఆలోచన్లో పడింది అరుంధతి.

అక్కడే ఉన్న శోభ ”ఇంతకు ముందుకూడా ఒకటి రెండు పార్టీలలో ఇలా చదువుకొనే వయస్సు పిల్లల్ని చూసాను. అదిగో అలాంటి కార్టూను పాత్రల వేషంలోకూడా పిల్లలే ఉంటారు. వీళ్ళకిది మామూలే. ఇంటిల్లపాదీ పన్లు చేస్తుంటారు. లేకపోతే గడిచేదెట్లా? ఇది సాధారణ విషయమే” అంది.

ఇంతకుముందు స్కూల్లో ఎవరో ఒక టీచరు చెప్తుండగా కూడా ఈ విషయం వింది అరుంధతి. చూడటం మొదటిసారేమో మనసు బాధగా మూల్గింది. చటుక్కున ఇందాకటి మిక్కీ మౌస్‌ గుర్తొచ్చింది. అది కమల అన్న నరేందర్‌ కాదుకదా?! కళ్ళు మిక్కీమౌస్‌ కోసం వెతికాయి. కమల కనిపిస్తే అడుగుదామని ఆమె కోసం చూసింది.

స్కూల్లో రేపటినుండి జరగబోయే పదో తరగతి పరీక్షలకోసం, బెంచీలపై నెంబరింగు పని హెచ్చెమ్‌ తనకి అప్పగించిన విషయం గుర్తొచ్చి గభాలున లేచింది అరుంధతి. తొందరగా భోజనం కానిచ్చి స్నేహితురాల్ని, నూతన దంపతుల్ని కలిసి హడావుడిగా బైటపడింది.

ఫంక్షనుహాలు నుండి బయటికి వస్తుంటే పిల్లలతో ఆడుతోన్న మిక్కీమౌస్‌ కనిపించింది. గేటు దగ్గర నిల్చున్న ఆటోని ఆగమని చెప్పి మిక్కీమౌస్‌ దగ్గరికి వచ్చింది అరుంధతి. ఆమెని చూసి మరోవైపు తప్పించుకు వెళ్లామనుకున్న మిక్కీమౌస్‌ ని చెయ్యి పట్టుకొని ఆపి ”నువ్వు నరేందర్‌ వేనా?” అంది అరుంధతి.

”అవును” అన్నట్లు తల వూపిన మిక్కీ మౌస్‌ ముఖం పకపక నవ్వుతున్నట్లుంది. కానీ మాస్క్‌ దాగిన నరేందర్‌ కళ్ళతడిని గుర్తించగలదు అరుంధతి. చెయ్యి నెమ్మదిగా జారిపోయింది.

మిక్కీమౌస్‌ చెరో చేత్తో ఇద్దరు చిన్నపిల్లల్ని పట్టుకొని మరోవైపు వెళ్ళిపోయింది.

‘నీకు రేపటి నుండి పరీక్షలు కదా నరేందర్‌’ అరుంధతి మాటలు పెదవి దాటి రాలేదు.

స్కూలుకి వచ్చినా మనసంతా వికలం అయిపోయింది. పేద బస్తీలోని పిల్లలు చదువుకొనే ఆ స్కూల్లో పనిచేస్తున్న అరుంధతికి తమ దగ్గర విద్యార్థులు పాలపేకెట్లు, పేపర్లు వేస్తారనీ, ఆడపిల్లలు బాసాన్ల పని చేసి వస్తారనీ తెలుసు. కానీ మంచి తెలివైనవాడు, మంచి భవిష్యత్తు ఉందని స్కూల్లో అందరి మెప్పు పొందే నరేందర్‌ ఇలా పరీక్షలముందు పనిచేయాల్సిన పరిస్థితికి బాధ కలిగింది.

తోటి టీచర్లతోపాటు ప్రతీరూములో నెంబరింగ్‌ పని పూర్తిచేసి సెంటర్‌ రూములో నిస్త్రాణగా కూచుండిపోయింది అరుంధతి. ఒక్కొక్క విషయమే ఆమె కళ్ళముందుకు వచ్చింది.

ఎయిడెడ్‌ స్కూలులో రిక్రూటింగ్‌ లేకపోవటంతో సబ్జెక్టు టీచర్లు లేక ఫలితాలు రాకపోతే పై అధికారులు అసలువిషయాన్ని పట్టించుకోక మెమోల మీద మెమోలు జారీచేస్తారు. ఆ బాధ భరించలేక బాగా చదివేపిల్లల్ని ఒక పదిమందిని ఎంపిక చేసి దగ్గర్లోని ఒక కోచింగు సెంటరు వాళ్ళతో మాట్లాడి, నాలుగు నెలలకీ తక్కువ ఫీజుతో చేర్చుకోవడానికి ఏర్పాటు చేసింది పదవ తరగతి క్లాసు టీచరుగా బాధ్యత ఉన్న అరుంధతి.

తెలిసిన వాళ్ళదగ్గర కొంత విరాళంగా తీసుకొని, అరుంధతి కొంత డబ్బు వేసి పిల్లల్ని కోచింగు సెంటరులో చేర్చింది. టీచర్లు లేని సబ్జెక్టులలోకూడా గట్టెక్కితే ఫలితాలు బాగుంటాయని ఆశించింది అరుంధతి.

తీరా రెండు నెల్లు గడిచిన తర్వాత నరేందర్‌ స్కూలుకి రావటం తగ్గించాడు. కోచింగు సెంటరుకీ వెళ్ళడం లేదని తెలిసింది. ఒకరోజు స్కూలు అయ్యాక ఎనిమిదో తరగతిలోని కమలని తీసుకొని వాళ్ళింటికి వెళ్లింది అరుంధతి.

అరుంధతి వెళ్ళేసరికి నరేందర్‌ ఇంట్లో పడుకొని ఉన్నాడు. అప్పుడే పనిలోకి వెళ్ళిన తల్లి కూడా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమెనీ, నరేందర్‌ ని కూచోబెట్టుకొని బోధపరచింది. ‘మంచి మార్కులతో పది పాసైతే చదువుకోటానికి స్కాలర్‌ షిప్‌ వస్తుందనీ, వృత్తి విద్యాకోర్సులలో చేరితే ఉపాధి తొందరగా లభిస్తుంద’ని ఇలా ఎన్నో అవకాశాల గురించి వివరించి చెప్పింది. క్రమం తప్పకుండా స్కూలుకీ, కోచింగుకీ వెళ్ళటానికి ఒప్పించి తిరుగుముఖం పట్టింది అరుంధతి.

అరుంధతికి ఈ సంఘటన తర్వాత మళ్ళీ విషయం మొదటికి వచ్చిందని భయం పట్టుకుంది. అందర్నీ ఒప్పించి పైసలు సేకరించి కోచింగుకి కుదిర్చింది తను. నరేందర్‌ కొంచెం శ్రద్ధపెడితే 500కి పైగా మార్కులు సాధించగలడు. మంచి రాంకు సాధించగలిగే విద్యార్థులు ఉన్నారని చెప్పి కొత్త టీచర్లని స్కూలుకి కేటాయించమని డిపార్టుమెంటులో ఒత్తిడి తేవచ్చు అనుకున్న ఆశ నీరు కారేలా ఉంది. అరుంధతికి దిగులుపట్టుకుంది.

స్కూల్లో సెంటర్‌ ని పూర్తయ్యేసరికి సాయంత్రమైపోయింది. హెచ్చెమ్‌ కి కూడా విషయమంతా చెప్పింది అరుంధతి. ఒక నిర్ణయానికి వచ్చి అటెండర్ని తనకి సాయంగా పంపమని ఆమెని అడిగి నరేందర్‌ యింటికి బయల్దేరింది అరుంధతి.

అక్కడికి వెళ్ళేసరికి గోలగోలగా వుంది. నరేందర్‌, కమల ఒక మూల దిగులు ముఖాల్తో కూర్చుని ఉన్నారు. వాళ్ళమ్మ ఒకవైపు ఏడుస్తో ఎవర్నో తిట్టిపోస్తోంది. అక్కడున్న వాళ్ళంతా ఎవరికి తోచిన మాట వాళ్ళు చెపుతున్నారు.

అరుంధతి దూరంగా ఆగి అటెండర్ని పంపింది. అటెండరు నరేందర్ని, కమలని పిల్చుకొచ్చాడు.

నరేందర్‌ తండ్రి బస్తీ నాయకుడితో పాటు రెండు నెలలుగా దగ్గర్లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నాడట. పార్టీ సభలకి జనాన్ని పోగు చేయటంలో బస్తీ నాయకుడికి సాయపడుతున్నాడట. మామూలుగా ఎప్పుడూ చేసే కూలి పనులు మానేసి ఇదే పనిలో తిరుగుతున్నాడట. ఇంక చేతిలో పైసలు పడేసరికి తాగుడు ఎక్కువైందట” అని అటెండరు విషయం తెలియజేశాడు.

నరేందర్‌ దిగులు ముఖంతో ”మాయమ్మకి మూడు రోజులసంది జొరం టీచర్‌. ఇంట్ల బియ్యం కూడా తేకుండా అయ్య పొద్దుగూకులా తాగుడు, మాయమ్మని కొట్టుడూ సానా అయ్యింది. మాయమ్మ మందుకో, బియ్యంకో వస్తదని చెల్లీ, నేను కేటరింగు వాళ్ళతో పోయినాం. మా అయ్య మేం తెచ్చిన పైసలూ గుంజుకుపోయిండు. అడ్డుకుందని మాయమ్మని మస్తు కొట్టిండు”.

అంతవరకూ నరేందర్‌ పరీక్షలు రాసి స్కూలుకి రేంకులు సాధిస్తే బాగుపడబోయే స్కూలు గురించే ఆలోచించింది అరుంధతి. ఇప్పుడు బాగుపడాల్సింది నరేందర్‌ కుటుంబమా? స్వార్థం కోసం బడుగు జనాలకి సారా పోసి ఓట్లు సాధిస్తున్న నాయకులా? సమస్య ఎక్కడుందో అంతుపట్టలేదు.

ఏమనాలో తోచక బేగులోంచి ఓ వందరూపాయల నోటు తీసి నరేందర్‌ చేతిలోపెట్టి ”అమ్మకి మందు కొని వెయ్యి” అని చెప్పి వెనుతిరిగింది అరుంధతి.

(ఏప్రిల్‌ 2015)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ

పాట