
పచ్చని పంటపొలాలు , పాడి పశువులు ఊళ్లల్లో సాధారణ దృశ్యాలు. నాగేటిచాళ్ళు చేన్లు చెలకలూ . పంటలు పండించే అతణ్ణి రైతును కృశీవలుడు అని, కర్షకుడు అనీ, వ్యవసాయదారుడు అనీ హాలికుడు అంటూ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. కానీ అతనితోపాటు జీవితాంతం కృషిచేసే స్త్రీ మూర్తి కి ఏం పేరూ లేదు.
ఉద్యోగం చేసే మహిళలను ఉద్యోగిని అంటారు. చేయకుండా ఇంట్లోనే ఉండి సమస్త పనులూ చేసే ఆడవాళ్ళ ను ఇల్లాలు అనీ , ఇంగ్లీష్ లో హౌజ్ వైఫ్ అనీ అంటారు. ఒకానొక సందర్భంలో హౌజ్ కు వైఫ్ నా అని ప్రశ్నించారు. హౌజ్ మేకర్ అనాలని నిర్ణయించారు.అంతాబాగానే ఉంది.
జీవితమనేది ఎంత దూరం విసిరేస్తే అంతదూరం పోతుంది. తలుచుకుంటే చాలు నిజానిజాలు కళ్ళముందు వచ్చివాలుతాయి.నిజమే ఆరుగాలం శ్రమించి పండించిన పంట తింటున్నాం. కృషీవలుడు కదా తప్పకుండా రైతును నమ్ముకున్న వాళ్ళం కాబట్టి అతని యోగక్షేమాలు ఆశించాలి. అందుకే జూలై ఒకటో తేదీని మనం ప్రపంచ వ్యవసాయ దినోత్సవం నిర్వహిస్తాం. ఇది చాలా ముదావహం.
ఆరుగాలం అతని వెంట ఉండే ఆడవాళ్ళ ను గురించి ఎవ్వరూ ప్రస్తావించరు. ఆ హాలికునికి నిత్యం వెన్నుదన్నుగా నిలిచేదెవరు? ఆ హాలికుని భార్య హాలిని . అతని ఆలోచన లో ఆలేచనగా , అతని కష్టం లో కష్టం గా , అతని పని లో పనిగా లీనమై మమేకమై జీవితాంతం తోడుగా నీడగా ఉంటుంది.
నాగలి చేతబట్టి రైతు దున్నుతుంటే విత్తనాలు వేసేది ఎవరు? ఒక స్త్రీ. అయితే అతని భార్య నో, లేదా కూలీ పని చేసే స్త్రీ నో సహాయం గా ఉంటేనే వ్యవసాయదారులు పంటలు తీయగలుగుతున్నారు. వరి నాట్లు వేయటం, కలుపుతీయడం తోనే పొలం కళకళనాడేది. పంట పండాక పంట కోత కోయడం, కట్టలు కట్టడం, కుప్పలు వేయడానికి కట్టలు అందించడం వరకూ ఆడవాళ్ళ సహాయం లేకుండా జరగదు. తర్వాత కుప్పలు వాళ్ళు కొడుతుంటే ఒడ్లు తూర్పారబట్టడం,చెరడగం,వరిధాన్యాన్ని బస్తాసంచులలోకి ఎత్తేవరకూ ఆడవాళ్ళ సహాయం లేకుండా జరగదు. అలాగే చెల్కలలో మొక్కజొన్న,కందులు పెసలు , శనగలు వంటి గింజల ధాన్యాలు ఇంటికో మిల్లులకో మార్కెట్ కో చేర్చేదాకా ఆడవాళ్ళ వనులెన్నో ఉంటాయి.
ఇంతా చేస్తే ఈ వ్యవసాయ క్షేత్రంలో స్త్రీ సమశబ్దం ఒక్కటీ కానరాదు. అందుకే నేను ‘ హాలిని‘ అనే పదాన్ని స్థిరీకరించాను. పెద్దలందరూ ఆమోదించారు. ఈ రోజు వ్యవసాయ దినోత్సవం సందర్భంగా మహిళా వ్యవసాయ దారుల కృషి ని మనమంతా స్మరించుకోవాలి . ప్రపంచంలో ని హాలికులకూ హాలినులకూ శుభాకాంక్షలు అందజేయాలి.
అన్ని వృత్తులకంటే అన్నం పెడుతున్న అన్నదాతలు మిన్న . వాళ్ళ కు అన్నీ మంచి జరగాలని కోరుకోవాలి.
” అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్నారు మన పూర్వీకులు. అన్నం అంటే ఆహారం, పరబ్రహ్మం అంటే దైవ సమానం అని అర్థం. ఏ కులం వారికైనా ఏ మతం వారికైనా ఏ దేశం ఏ ప్రాంతం వారికైనా తాము విశ్వసించే శక్తి ను భగవంతుని ఎంత ఇష్టం గా కొలుస్తారో అదే తీరులో భుజించే పదార్థాలను భావించాలని మన పూర్వీకులు చెప్పారు.
మన జీవనానికి అవసరమైన ఈ ఆహారం పండిస్తూ ప్రపంచ ఆకలిని తీర్చే హాలిని , హాలికుల స్ఫూర్తి ని లోకానికి చాటి చెబుదాం.
_*_