అంతం లేని ఆరంభం….
జీవితం నిండా ఉద్వేగాలు, ఓదార్పులు, ప్రేమలు, విప్లవాలు, కన్నీళ్లు, చిరునవ్వులు , ఓ మానసిక సంఘర్షణ, ఓ నిరంతర, చిరంతర అన్వేషణ.
లేళ్లు, కుందేళ్ళు, పులులు, సింహాలు, గుంట నక్కలు, తోడేళ్ళు వీటిని మించిన జనారణ్యం, ఆ జనారణ్యంలో తప్పిపోయిన ఆమె, తనను తాను వెతుక్కుంటూ, తన గమ్యాన్ని, తన స్థితిని, తన చుట్టూ వున్న సమాజపు ఆనందాన్ని వెతుకుతూ సాగిస్తున్న , సాగించిన, సాగించాల్సిన ప్రయాణంలో ఆమె అడవిని జయించిందా!!? ఓ కెరటమై ఉవ్వెత్తున ఎగసిందా!? తీరానికి తల ఒడ్డి కూలబడిందా!?
రండి డాక్టర్ గీతాంజలి గారి కలం నుంచి జాలువారిన ” ఆమె అడవిని జయించింది” ని పలకరిద్దాం….కలిసి ప్రయాణిద్దాం…..
తానే ప్రశ్న, తానే జవాబు అయిన సంధ్య అనేక సంధ్యల మానసిక సంఘర్షణను మోస్తుంది ఈ నవలలో. ఒక అంతఃసంఘర్షణ, మరో అంతః చేతన, నైరాశ్యం, తెగింపు అన్నీ వున్న ఆమె సంవేదనా పర్వం ఈ “ఆమె అడవిని జయించింది”. ఎందుకు తాను దేనికైనా బంధీ కావాలి ? అన్న మీమాంసలో నుంచి ఎందుకు తాను సమాజపు స్వరాలకు సమాధానం కాకూడదు అన్న బాధ్యతతో ఉక్కిరబిక్కిరైన ఓ అతివ కథ, వ్యధ, ఆమె మార్గం, ఆమె గెలుపు.
తన స్నేహితుడి ఇల్లాలినే ప్రేమించానని వెంటబడ్డ ఓ ద్రోహి, ఆతని తియ్యని మాటలకు ముందు మనస్సు చలించినా ఎక్కడా అడుగు ముందుకు వేయకుండా జాగ్రత్త పడ్డ ఆమె మనో చైతన్యం, తనకు అడుగడుగునా అండగా వుండే భర్త ప్రేమ, ఆదరణ వెరసి ఆమెలోని ఆమె వెలుగొందిన వైనం, అత్తింటి కష్టాలతో పాటు పుట్టినింటి చికాకులు, శత్రువులా మారిన అమ్మ, అందుకు దారితీసిన అనేక రకాల మానసిక, సామాజిక అస్తవ్యస్త అవస్థలు. కులపు గోడలు, మతాల మాయలు, స్నేహాలు, స్నేహపు వంచనలు. మనుషుల్లోని కుళ్ళు , కుతంత్రాలు, అనేక రకాల ఈర్ష్యా ద్వేషాలు, ఎత్తులు, ఎత్తుకు పై ఎత్తులు వేసే కుంచిత స్వభావాలు , ఆశలు, మోహాలు, ఆవేశాలు, తెలివి తక్కువ నిర్ణయాలు, ఫలితంగా చేజార్చుకున్న జీవితాలు సమస్తాన్ని చర్చించింది ఈ నవల, నవల మాధ్యమంగా dr. గీతాంజలి మేడం.
ఆడవాళ్ళకు మాత్రమే వరమైన మాతృత్వం నిజంగా వారికి వరమేనా!? లేదా దానినీ సైకలాజికల్ గా తర తరాలుగా సమాజం వాళ్ళ మనసుల్లోకి, బుద్దుల్లోకి, తద్వారా వారి, వారి శారీరక అవస్థల్లోకి చొప్పించిందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇష్టపడి చేసే ఏ పని అయినా ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది, అటువంటి స్థితిని అసలు అందించకుండా ఆడవాళ్ళు పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని వారి వృద్ధిలో, సంసారపు బాధ్యతల్లో గడిపివేయడానికే అన్నట్లుగా తీర్చిదిద్దింది ఏ సమాజం. ఇందులో రచ్చయిత్రి కేవలం మనువాదం పట్ల మాత్రమే తన వ్యతిరేఖ వైఖరిని వెలిబుచ్చుతున్నారు, కానీ ఈ సైద్ధాంతిక విషయం అన్ని వాదాల్లోనూ వుంది, అన్ని రకాల కుల సమాజాల్లోనూ ఈ వికృత ప్రవృత్తి కనిపిస్తుంది. దీనిని జనరలైజ్ చేసి వుంటే నవల ఇంకా నిండుగా వుండేదని నా అభిప్రాయం. ఇక పోతే చేసే ఏ పని అయినా తృప్తిగా చేయాలి, ఎప్పుడూ ద్వందీ భావంతోనో, పని పట్ల పూర్తిగా ఇచ్చలేని స్థితి లోనో చేస్తూ వుంటే మానసికంగా కృంగుబాటు తప్ప ఎదుగుదల వుండదు. ఈ నవలా నాయకి సంధ్య ది కూడా ఈ రకమైన ద్వంద్వ ప్రవృత్తి కల మనస్తత్వం మొదట్లో. ఇంట్లో చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, మరీ ముఖ్యంగా తన ఇష్టా ఇష్టాలను గౌరవిస్తూ , తన అభివృద్ధికి, మానసిక ప్రశాంతతకు సహకరిస్తూ తనకు అన్ని వేళలా అండగా వుండే భర్త తో సంతోషంగా వున్నప్పటికీ, తుఫానులా వచ్చిన భర్త స్నేహితుడి మాయలో పడటం, అతనిని , అతను తన శరీరం పై చూపించే ఇష్టాన్ని ఇష్టపడనూ లేక అలా అని పూర్తిగా తిరస్కరించనూ లేక కేవలం అతనితో స్నేహ బంధాన్ని కొనసాగించాలని కోరుకోవడం, తద్వారా తనకు అంతకు మునుపే ఫ్రెండ్ గా వున్న అతని భార్యతో శతృత్వం, ఆమె మానసిక అశాంతి, తిరిగి భర్త ప్రేమతోనే ఆ అశాంతిని జయించడం, ఆ తుఫాను లో నుంచి తన గమ్యాన్ని చేరుకోవడం ఆ మానసిక సంఘర్షణను రచయిత్రి చాలా చక్కగా అక్షర బద్ధం చేశారు. ఓ వివాహిత స్త్రీకి ఒక పర పురుషుడి పట్ల ఉన్న ఆకర్షణ, ఆ ఆకర్షణను అతను అర్దం చేసుకుని ఆమె శరీరాన్ని మోహిస్తూ ఆమె మనసుని వశ పరచుకోవడం, ఆమె ఓ పవిత్ర దృష్టితో వున్నా సమాజం, మనుషులు ఆమెనూ, ఆమె స్నేహాన్ని అర్దం చేసుకున్న తీరు, దాని పట్ల ఆమె వైఖరి, చివరికి మనసుకు హాని కలిగించే ఆ బంధాన్ని ఆమె త్యజించిన తీరు నేటి యువతకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఓ పాఠం. ఇది ఈ నవలలోని ఓ కోణం.
రెండు మాతృత్వం, ఇందాకే అనుకున్నట్టు మాతృత్వం వరమా!? శాపమా!? అన్న విషయం చర్చకు పెడితే భావజాలాలకు లొంగని ఏ స్త్రీ అయినా శాపమని, తమ జీవిత అభివృద్ధికి అది ఒక నిరోధకమని ప్రకటించే అవకాశం లేకపోలేదు, ఇక సామాజిక కట్టుబాట్లు, పైగా అది ఆడవారికి మాత్రమే ఉన్న ఒకే ఒక్క అవకాశం ఈ కోణాల ముఖతహా చూస్తే అది వరమనే చెప్పాలి. వరమైనా, శాపమైనా తనకు ఆ ఫలితం అందిన తీరు, తద్వారా తన జీవితంలో వచ్చే మార్పులు, ఆపై జీవితంలో ఆమె, ఆమె లక్ష్యాలను సాధించగలుగుతుందా లేదా, ఈ జీవన్మరణ పోరాటంలో, తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరొక జీవికి పుట్టుకనిచ్చే ఈ బృహత్తర కార్యంలో తన వాళ్ళ అండ వుందా, తనను , తన తదుపరి జీవితాన్ని ఆ కొత్త జీవి రాక ఎలా ప్రభావితం చేస్తుంది అనే అనేక రకాల సంశయాలు, సమాధానాలపై ఆధారపడి వుంటుంది. ఏదేమైనా అదొక శృంఖల చర్య, వద్దనుకున్నా కొన్నిసార్లు తప్పించుకోలేక, కావాలనుకున్నా కొన్నిసార్లు పొందలేక ఎప్పటికీ సంఘర్షణ సూత్రంగా మిగిలిపోయే వివాదం. కానీ ఇందులో రచయిత్రి రాసినట్లు లేబర్ రూం కష్టాలను తలచుకుంటే ఏ స్త్రీ కూడా మాతృత్వాన్ని వరమని అనుకోదు, అనుకోలేదు. అదొక ఆస్వాదనలో కొట్టుకు పోవలసిన చర్య అంతే, వద్దు అనుకుని దూరం జరగలేము, కావాలి అనుకుని ఆ కష్టాలను తలుచుకుంటూ మానసిక అస్తిరత్వాన్ని నిత్యం అనుభవించనూ లేము. కాకుంటే ముందూ వెనుకల అవగాహన అవసరం, దానితో పాటు తన అనుకున్న వాళ్ళ తోడ్పాటు అత్యంత అవసరం. ఇవి వున్నప్పుడు ఏదీ కష్టం కాదు, బతుకు కాష్టంలోనూ కాలదు. ఈ విషయాన్ని రచయిత్రి తన డాక్టరు వృత్తి అందించిన అనుభవంతో అనేక రకాల ప్రశ్నలు – సమాధానాల ద్వారా చర్చించారు తన ప్రవృత్తి అయిన కథను నడిపించే కథనం ద్వారా.
ఇక నవల మొత్తం స్త్రీ ఆవేదనలు సంవేదనలు, స్త్రీలకు సంబంధించిన రకరకాల భావోద్వేగాలు, అనుభవాలు, రాజీ పడటాలు, అనేక రకాల వ్యామోహ వ్యవహారాలు, లైంగిక పొరపాట్లు, అవస్థలు, అత్తింటి ఆరళ్ళు, స్వీయ, పర నిర్భంధ దౌర్జన్యాలు ఇలా రకరకాల విషయాల వివరణలు, చర్చలు, పరిష్కార దిశగా సాగించే యోచనలతో సాగుతుంది. సమాజంలో అనేక రకాల వ్యవస్థలు కుల వ్యవస్థ, మత వ్యవస్థ, మాతృ స్వామ్య, పితృ స్వామ్య వ్యవస్థ , ధనిక, బీద ఇలా సమస్తం వున్నప్పటికీ, సమస్తాన్ని ఈ నవలలో చర్చకు పెట్టినప్పటికీ ఎక్కువ శాతం మనువాద , బ్రాహ్మణ వ్యతిరేక, అగ్రకుల ఆధిపత్య ధోరణుల మీదనే రచయిత్రి దృష్టి సారించారు. మిగిలిన కుల , మత, జాతి ఆధిపత్యాలను అక్కడక్కడా అన్నా ఎండగట్టి వుంటే సమస్యల పట్ల ఇంకొంత న్యాయం జరిగి వుండేది.
తానెంతో ఆరాధించి, ప్రేమించి ఓ మార్గదర్శిగా చూస్తున్న భర్తలోనూ ఓ సగటు మగవాడిని చూసిన భార్య, అతని మనసు చంచలతాన్ని, ఆడవారి పట్ల అతని చంచల చూపుల ఆకలిని, అతనిలోని రసోద్రిక్త స్పందనను భరించలేక ఎంతలా నలిగిందీ, ఎంత ఘర్షణకు గురై, ఎంతలా విలిపించింది, ఎంతదాకా ఎదిరించిందీ చదువుతూ వుంటే ఓ స్త్రీ తన సాటి స్త్రీ ల పట్ల కూడా ఎంత బాధ్యతగా వుండాలి, తప్పు చేస్తున్నది తన భర్త, తన పిల్లలూ అయినా ఎలా ఎదిరించాలి అన్న సున్నిత స్పృహ మనకు కలుగుతుంది. ఆ రకంగా రచయిత్రి ఆడవారిలో ఉండాల్సిన అతి ముఖ్య కోణాన్ని చాకచక్యంగా ఈ నవల ద్వారా చెప్పగలిగారు. చంద్రం తనను తాను మార్చుకున్న విధానాన్ని కూడా చర్చిస్తారు. ఆశయ, ఆదర్శాలు ఏకమైన జంటగా సంధ్యా, చంద్రంలు నిలబడగలుగుతారు.
కూలంకషంగా, సవివరంగా , సమగ్రంగా ఈ నవలను చర్చించాలంటే ఇదొక స్త్రీ వాద, పితృ స్వామ్య వ్యతిరేక , మనువాద వ్యతిరేఖ నవల. చలం గారి ప్రభావం, రంగనాయకమ్మ గారి రచనల ఇంపాక్ట్ ఈ నవలలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రచయిత్రి అనేక మార్గాలలో, అనేక రకాలుగా స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక కృంగుబాటును సంధ్య పాత్ర ద్వారా మన కళ్ళకు కడుతారు. సంధ్య , చంద్రం ఓ సమున్నత ఆశయాలు కలిగిన , ఒకరికి ఒకరుగా మసల గల చక్కని జంట. ఈ జంట లాగానే అన్ని జంటలూ వుంటే, మరీ ముఖ్యంగా చంద్రం లాగా సమాజాన్ని, భార్యను అర్దం చేసుకునే పురుషులు వుంటే ఇక ఇలాంటి నవలల అవసరం , వాటిని రాయాల్సిన అవసరం ఏ రచయితలకూ వుండదు. అలాంటి సమాజం ఇప్పటికీ కనుచూపు మేర లో లేదు. అటువంటి ఓ మాతృ- పితృ సమ సమాజం వస్తుందన్న ఆశలు సన్నగిల్లడం మినహా తీరే సూచనలు లేవు. కానీ రచయిత్రి కల, సంధ్య ఉద్దేశ్యం నిజం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకోవడమే ఇప్పుడు మనం చేయగలిగింది, చేయాల్సింది. వీలైనంతగా సమాజంలో మార్పు, అది తీసుకు రావడానికి మన వంతు కృషి చేయాలి, చేస్తూనే వుండాలి. సంధ్య లా మనమూ ఈ అడవిని జయించాలి.
ఆప్యాయంగా మాట్లాడే గీతాంజలి గారిని పలకరించి, ఆమె అడవిని జయించిన ముచ్చట పంచుకుంటారా ప్రేమకు చిరునామా వారు మరెందుకు ఆలస్యం
మాటా మంతీ కలపండి