ఎందుకో ఎదుటి వ్యక్తిని చూడగానే ఏదో ఒక ఆలోచన చేయకుండా ఉండరు. తొందరగా ఒక నిర్ణయానికి వస్తారు.మంచివారనో, చెడ్డ వారనో ఒక భావాన్ని స్థిరీకరించుకుంటారు. ఇటువంటి అలవాటు ఉన్నవాళ్లు వెంటనే తమలో ఉన్నటువంటి మంచి విషయాలను గొప్ప గానూ, చెడు విషయాలను తక్కువ గానూ అనుకొని, ఇతరుల తో పోల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల అయితే గర్వభావమైనా వస్తుంది లేకుంటే ఆత్మన్యూనతా భావమైన వస్తుంది.వీటి వల్ల ఏం ఉపయోగం? రెండింటితోను నష్టమే కలుగుతుంది. గర్వం అస్సలే మంచిది కాదు.

ఇంగ్లీషులో ఇన్ఫీరియాటిక్ కాంప్లెక్స్ అని అంటాం. సుపీరియారిటీ కాంప్లెక్స్ కి పూర్తి వ్యతిరేకం అయిన పదం. వీటి అర్థాలు తెలియకనా ?మనకందరికీ తెలుసు.అయినా సరే మనస్సు పొరలలో లోపల నిలిచిపోయిన ఒక భావ దారిద్ర్యం ఏదైతే ఉంటుందో అది మనసును కుదురుగా ఉండనీయదు .గర్వంగా ప్రవర్తించే అహంభావవికారాలు వ్యక్తపరిచేలా చేస్తుంది.
ఇది ఒక రకమైన ప్రమాదం అయితే, మరింత ప్రమాదకారి ఆత్మన్యూనత. ఇది ఒక పెద్ద మానసిక అవస్థ. ఇదెలా మొదలవుతుందంటే ,ఎదుటి వాళ్లు తమను గుర్తించడం లేదని గౌరవించడం లేదనే ఊహలకు ఇంకా ఎక్కువ ఆలోచనలను జోడించి తమకు తాము తక్కువ చేసుకుంటారు. ఒకవేళ ఎదుటివారిలో ఎక్కువ సామర్థ్యం ఉంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అని అనుకోరు. వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాము అనేదే ఎప్పటికీ వీళ్ళ ను వేధిస్తూ ఉంటుంది.
ఇవి రూప పరంగా చూస్తే, అందము, అందవికారము అని రెండు రకాలుగా అనుకుంటారు. నల్లగా ఉన్నామని, పొట్టిగా ఉన్నామని చాలా లావుగా ఉన్నామని లేదా చాలా సన్నగా ఉన్నామని ఇటువంటి రూపపరమైనటువంటి విషయాలలో తక్కువ చేసుకుని ఆత్మన్యూనత కు గురవుతుంటారు. అసలు సిసలైన అందమంతా వాళ్ళ వాళ్ళ మనసు మంచిదైతేనో, నడవడి మంచిదైతేనో అందరినీ ఆకట్టుకుంది.
ఇక జీవనం విషయం చూస్తే,ఉన్న వాళ్ళు లేని వాళ్ళు రెండు వర్గాలుగా సమాజంలో ఉండడం సహజం. ఆర్థికంగా తక్కువ ఉన్నంత మాత్రాన ఆత్మాభిమానంలోనూ విజ్ఞతలోనూ మంచితనంలోనూ తక్కువ ఉండదు కదా!ఈ లక్షణాలు డబ్బుతో రావు. గుణం ప్రధానంగా గ్రహించినప్పుడు ధనవంతులు అందరూ మంచివాళ్ళై ఉండరు, చెడ్డవాళ్ళై ఉండరు.బీదలూ అంతే బీదలందరూ చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు గా ఉండరు. డబ్బు ఉన్నంత మాత్రాన ఆత్మ అభిమానం కలిగి ఉండకపోవచ్చు విజ్ఞత కూడా తక్కువ కలిగి ఉండొచ్చు అందు గురించి హోదా విషయం చూసుకుని ఆత్మన్యూనతకు గురికావడం కూడా మంచిది కాదు.కానీ ఇవి మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే కారణాలు కావు. కాబట్టి మనదైన ఆత్మాభిమానంతో కృషితత్వంతో ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తే ఎవరి వ్యతిరేకార్థ భావాలు మన మనసుకుతాకవు, ఇబ్బంది కలిగించవు. స్పష్టమైన ఆలోచనలు ఉన్నవాళ్లు ఏకాగ్రతతో సాధన చేస్తూ ఉంటే ఎంతటి పనులనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు,కష్టతరమైన పనులనైనా సాధిస్తారు.
సంస్కారం ,సహనం ,సఖ్యత ఇవి త్రికరణలుగా ఉండాలి. ప్రశాంతమైన చిత్తంతో కృషిని నమ్ముతూ మునుముందుకు వెళుతూ ఉంటే విజయానికి దగ్గరవుతారు. కావలసింది సంకల్ప బలం మాత్రమే. కాబట్టి ఆత్మన్యూనత , ఇన్ఫీరియాటిక్ కాంప్లెక్స్ కు అవకాశం ఇవ్వద్దు, మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. ఇక అంతా ఆనందమే!
__***__