అయితే మీరే (భుజాలు తడుముకుంటున్నారుగా!)

నూతన ధారావాహికం

ఆకాశంలో సగం అని కితాబు లిచ్చినా,ఆకాశమే మీది అని కీర్తిస్తున్నా నేటి మహిళలు ప్రస్తుత సమాజంలో అనునిత్యం ఎన్నో ఆటుపోట్లను,ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. తమదైన అనురాగం,ఆప్యాయతలతోవాటిని అధిగమించి జీవితంలో నిలిచిగెలుస్తున్నారు. హద్దులు దాటిన అమానుషత్వానికి, పైశాచిక తత్వానికి పరాకాష్ట గా మారిన పురుష నైజానికి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో
తమదైన స్వావలంబన,సాధికారతలనే మంత్రంతో తమ అస్తిత్వాన్ని సుస్థిరం చేసుకున్నతీరును ప్రతిబింబింపచేసే ” అయితే మీరే ….(భుజాలు తడుముకుంటున్నారుగా!) ” అనే పేరుతో సోంపాక సీత రచించిన

నవల

ను పాఠకులంతా ఆదరించాలని ఆకాంక్షిస్తూ… ఈ నవల ధారావాహిక గా మీ కోసం !

కొండపల్లి నీహారిణి
పత్రికా సంపాదకురాలు

నవలా రచయిత సోంపాక సీత

ఆటోలో కూర్చున్న స్నేహితురాళ్లిద్దరి దృష్టి ఒకేసారిగా తమకు కుడివైపు ఎదురుగా ఉన్న సందు మొదట్లో నిలబడిన వ్యక్తి మీదుగా నిలిచిపోయాయి.

‘‘ఆ… ఆ… అతనేనండి. పద్మినిగారి వాళ్ళాయన’’ అంది మాలిని, మైథిలితో.

‘‘అవునా? సరిగా చూడండి… పద్మినిగారి తాలూకు అవునో? కాదో?’’ అనే ఓ చిన్న సందేహాన్ని వ్యక్తం చేసింది మైథిలి.

ఇంతలో ఆ సందు మొదటికి వచ్చిన ఆటో ఆగటమూ…

ఆయన ‘‘ఆ… ఇక్కడే నండి. ఇదేనంటూ’’ దిగమని ఆటోవానికి ఆపమన్నట్లుగా చేత్తో సైగ చేయటం క్షణాల్లో జరిగిపోయాయి.

మాలిని, మైథిలి ఇద్దరూ ఆటో దిగి, ఆటోవాలాకు ఆటోచార్జి ఇచ్చేసి, చేతిలో ఉన్న చిన్న చిన్న బ్యాగులను తీసుకుని వారు ఆటోలోంచి దిగుతూ పద్మిని వాళ్ళ ఆయన్ని విష్‌ చేస్తూ పలకరించారు.

మాలిని ఉండేది, పద్మిని ఉండేది ఒకే ఊరవటం మూలాన తను అప్పుడప్పుడు పద్మినిని కలవటంతో తను, పద్మిని వాళ్ళ ఆయనతో బాగానే కలివిడిగా మాట్లాడేస్తోంది. మైథిలి మాత్రం మాట్లాడడానికి కొంచెం బిడియపడుతోంది. ముప్ఫై ఏండ్లు దాటిపోయింది పద్మినిని, వాళ్ళ భర్తను, పిల్లల్ని చూసి. మనుష్యులలో మార్పు వాళ్ళ వయసును బట్టి వస్తుంది సహజంగా. ఆ వయసువల్ల వచ్చిన మార్పు తప్ప ఆయన మాట్లాడే తీరు, చూపే ఆప్యాయతలో ఏమాత్రం మార్పు రాలేదనిపించింది మైథిలికి ఆర్‌.పి.గారిని చూస్తుంటే.

ఆ అన్నట్టు ఆర్‌.పి.గారే మా ఫ్రెండైన పద్మిని గారి ఇంటాయన. ఆర్‌.పి.గారని షార్ట్‌కట్‌లో పిలవటం అలవాటు పద్మినికి. ప్రస్తుతం పండక్కి పద్మినివాళ్ళ పిల్లలు ఇంటికి రావటం మూలంగా మనవళ్లు, మనవరాళ్లకు అన్నం తినిపిస్తుండటంతో తాను రాలేక వాళ్ళాయనను ఆ వీధి చివరి వరకూ వెళ్లండంటూ, వాళ్లు వీధిని సరిగా గుర్తు పడతారో లేదోనని అంటే తానే వచ్చినట్లుగా చెబుతూ `

‘‘ఇదేనండీ మైథిలిగారూ! పైన ‘పి’ అని అక్షరం పెట్టుకుంది తనపేరే’’ అంటూ మూడవ అంతస్తుపైన అందంగా అమర్చిన ‘పి’ని చూసిస్తూ, చిరునవ్వు నవ్వారాయన.

‘‘ఆ… మా ఫ్రెండునంటున్నారు గానీ మీ పేరులో గూడా ‘పి’ ఉందిగదా’’ అన్నా, నేనూ నవ్వుతూ.

నెమ్మదిగా గేటు తీసుకుని మాలిని, నేనూ, ఆర్‌.పి.గారూ లోనికి వెళ్లాం.

మెట్లు ఎటువైపున్నాయా అని వెతికే పనిలో పడ్డాను నేను.

ఇంతలో ‘‘లిఫ్ట్‌ ఉందండీ’’ అన్న ఆర్‌.పి. గారి మాటతో ఓ చల్లని తెమ్మెర మనసును హాయిగా తాకిన ఫీలింగ్‌ కలిగింది నాకు.

లిఫ్ట్‌లో రెండో అంతస్తులోకి తీసుకెళ్ళారు మాలినిని, నన్నూ.

మారాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఎంతో ఆనందం, అంతకు మించిన ఇష్టాన్ని కలగలుపుకున్న ముఖారవిందంతో గుమ్మంలో ప్రత్యక్షమైంది పద్మిని. ఎడమ చేతిలో మనవళ్ళకు అన్నం తినిపిస్తున్న గిన్నె, కుడిచేతికి అంటిన పప్పూ, అన్నం ఇవేవీ గుర్తు రాలేదు పద్మినికి. సరాసరి అలాగే వచ్చేసింది.

చాలా రోజులు కాదు, ఏండ్లే అయింది ఒకళ్ళకొకరం చూసుకుని. నేను అమాంతంగా పద్మినిని హగ్‌ చేసుకున్నా.

‘స్నేహమంటే ఇదిగదా!’ అనిపించింది ఒక్కసారిగా. ఆ హగ్‌లో కలిగిన తీపి అనుభూతిని వర్ణించటానికి ‘మధురం’ అనే పదం కూడా సరిపోదనిపించింది.

‘‘ఏమోయ్‌! మీ ఫ్రెండ్స్‌ వచ్చిన సందర్భంలో ఓ మంచి టీ దట్టించవోయ్‌!’’ అన్నారు ఆర్‌.పి.గారు చమత్కారం నిండిన గొంతుకతో.

‘‘ఆ… అవును… వాళ్ళకే టీ పెడతా… మీకేం లేదుపోండీ!’’ అంతే చమత్కారం నిండిన గొంతుకతో అంటూ పద్మిని చెయ్యి కడుక్కోవటానికి వంటగదిలోకి వెళ్ళింది.

‘‘ఇప్పుడే వద్దండి టీ… ఫంక్షన్‌ నుండి ఇటే వస్తున్నాం. భోజనాల ఏర్పాట్లు బాగా చేశారు ఆమనివాళ్లు. కడుపునిండుగాగా లాగించేశాము. గులాబ్‌జాంలు అద్దిరిపోయాయ్‌. ఐస్‌క్రీమ్‌ కూడా రెండుసార్లు పెట్టించుకుని మరీ తిన్నాము. ఇంకా భుక్తాయాసమే తీరలేదండి’’ అంది మాలిని, వంటగదిలోకి వినపడేటట్లుగా.

నేను పద్మిని పిల్లల్ని పలకరిస్తున్నాను వరుసగా. పద్మిని, ఆమని దాదాపుగా అక్కడ ఉండేవాళ్ళే. ఏదో ఓ సందర్భంలో కలుస్తూనే ఉంటారు. ఏ సందర్భం కుదరకపోతే కనీసం రెండు నెలలకోసారైనా గెట్‌ టు గెదరో లేదా కిట్టీ పార్టీ లాంటిదో ఏదో ఒకటి పెట్టుకుని ఆ వంకతో కలుసుకుంటూ, మనసారా మాట్లాడుకుంటూ కష్ట, సుఖాలన్నీ కలబోసుకుని మనసు తేలిక పరుచుకుంటూ రిలాక్సేషన్‌ పొందుతుంటారు. వీరితో ఇంకో ముగ్గురు కూడా కలుస్తారు. వాళ్ళెవరంటే ఒకరు హాసిని, మరొకరు చంద్రిక, ఇంకొకరు ఆమని.

‘‘అసలిప్పుడు ఎవరింటి నుండి ఫంక్షన్‌ పూర్తి చేసుకుని వచ్చామంటే, ఆమని వాళ్ల మనవడి బర్తడే పార్టీ నుండి పిలిస్తే… తప్పకుండా హాజరవ్వాలనే పట్టుదలతో బయల్దేరి వచ్చా. వచ్చాగదా, అందర్నీ ఓసారి కలుసుకుని రావటమే నా ప్రయాణంలోని మరో ఆంతర్యం.

***

‘ఎప్పుడో గ్రహణాలు పాఠం చదువుకున్న గుర్తు చిన్నప్పుడు. కానీ నాకు పట్టింది అనారోగ్య గ్రహణం. ఎప్పుడు అది నన్ను విడుస్తుందో తెలియటం లేదు. అసలు నేను ఈ లోకం విడిచేదాకా నన్ను విడిచిపెడుతుందో? లేదో? ప్రశ్నార్థకమే! ఖగోళ శాస్త్రవేత్తలు, భూగోళం బోధించే లెక్చరర్లూ ఐతే మాత్రం దీనికి కచ్చితంగా క్రొత్త పేరు పెట్టి తీరుతారు అనుకుంటూ’ మనసులో నాకు నేనే నవ్వుకున్నాను, ఏడవలేక నవ్వారంటారే అలాగన్నమాట.

‘‘అసలు సంగతి మీకు చెప్పటం మర్చేపోయాను సుమా… నేను, మాలిని, పద్మిని, హాసిని, చంద్రిక, ఆమని… మేమంతా విజయవాడలో ఒక పాపులర్‌ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశాము. ఇదిగో అదే స్నేహం ఇప్పటికీ కొనసాగుతుందని గర్వంగా చెబుతాను. ఏ పొరపొచ్చాలు లేకుండా అప్పటి నుండి ఈనాటివరకు. వాట్సాప్‌ గ్రూపులో వేడుకలు, పండుగలు, పబ్బాలు అన్నింటికీ సంబంధించిన వాట్సాప్‌ ఫొటోలు అన్నీ పోస్టు చేసుకుంటాం, శుభోదయాలతో పాటుగా. ఇది మాకు దూరంగా ఉంటున్నామే, కలవలేకపోతున్నామనే ఫీలింగును దూరం చేస్తుందని గ్యారంటీగా చెప్పగలను. అసలు ఇంత బంధం ఏర్పడటానికి ముఖ్యకారణం మా పిల్లలంతా, మేం బోధించిన కళాశాలలోనే ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.

అటు తర్వాత చంద్రిక, హాసిని, పద్మినిలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావటం, వేర్వేరు ఊళ్ళల్లోకి బదిలీమీద వెళ్ళిపోవటం… అదీనుగాక ఇప్పట్లాగా పెద్ద ఫోన్లు కాదుగదా కనీసం మాకు అప్పట్లో చిన్న ఫోన్లు కూడా మార్కెట్లోకి రాకపోవటంతో, మాలో కొందరితో కొందరికి లంకెలు తెగిపోయి ఇదిగో మళ్ళీ ఓ సంవత్సరం క్రితం ‘స్నేహిత ఫ్యామిలీ’ అనే పేరుతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని, మళ్ళీ మేము అపూర్వ స్నేహ వైభవంలోకి అడుగుపెట్టే అవకాశం కల్పించింది. పెద్ద ఫోను, అందులోని ఫేస్‌బుక్‌ లదే అగ్రస్థానం. మేము కలిసేందుకు మార్గం ఏర్పాటు చేసిందని నేను గట్టిగా చెప్పగలను.

ఇంతలో పద్మిని వాళ్ళ మూడో అమ్మాయి లాస్య అందరికీ టీలు తెచ్చింది. మాటల ప్రవాహాలు రసవాహినిలా దొర్లిపోతున్నాయి. ఇల్లంతా పద్మినివాళ్ళ మధుర ఫలాలతో సందడి సందడిగా ఉంటే, హాల్లోని నేలంతా బొమ్మలతో రంగుల హరివిల్లులా సంతోషమంతా అక్కడే క్రుమ్మరించినట్లుగా తళుకులీనుతోంది. పెద్దలందరిదీ ఒక లోకం, పిల్లలందరికీ మరో లోకంగా… మొత్తం అందరం ఎవరి లోకాల్లో వాళ్ళే సంతోష తరంగాలమవుతున్నాం.

‘‘మైథిలీ, మాలినీ రండబ్బా! కాసేపు గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకుందురుగానీ’’ అన్న పద్మిని చేసిన సూచనాప్రాయానికి మేం అంగీకారంగా తల ఊపుతూ, పడకగదిలోకి వెళ్ళి, హాయిగా నేనూ, మాలిని చెరో దిండుకూ మా తలలిచ్చేసి, మా కెదురుగా కుర్చీలో కూర్చున్న పద్మినిని ` ‘‘నీవు కూడా మాతోపాటు కాసేపు వచ్చి ఒరగరాదూ?’’ అన్నా చనువుగా.

‘‘లేదోయ్‌! ఇలా ఎదురుగా కూర్చుంటే, మీ ముఖాలు కనబడుతుంటే బాగుంటుంది. అందుకే ఇలా కూర్చున్నా’’ అంది పద్మిని.

పిల్లల పెండ్లిండ్లు, పురుళ్లు, పుణ్యాలు, శుభకార్యాలు మొదలుకుని ఇండ్లు కొనుక్కోవటం, తను ప్రిన్సిపల్‌గా ప్రమోషన్‌ వస్తే తిరస్కరించటం లాంటి ఇబ్బందులన్నీ వీటితో పాటుగా చంద్రిక, ఆమని, రిటైర్మెంట్‌ ముచ్చట్లతో పాటుగా, మనవళ్ల, మనవరాళ్లు సాధించిన విజయాలు ఒకటేమిటి… అన్నీ దృశ్యరూపాలై మా అంతరంగాలను ఆనంద సముద్రంలో ముంచి తేల్చాయి.

ఎప్పుడు కిచెన్‌లోకి వెళ్ళిందో ఏమో… మాకూ, తనకూ ప్లేట్ల నిండా స్నాక్స్‌, స్వీట్లు తెచ్చి ముందు పెట్టింది, తినాల్సిందేనన్నట్లుగా చూశాయి పద్మిని కండ్లు మావైపు. ప్లేట్లలో ఉన్న స్వీట్సు రుచికంటే పద్మిని మాపై చూపే ఆప్యాయతే ఇంకా తియ్యగా అనిపిస్తోంది మాకు.

‘‘సరేగానీ పద్మినీ… మీ దగ్గర కార్డ్సు ఉన్నాయా?’’ అని అడిగా నేను.

‘‘ఆ మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. మా అల్లుళ్లొచ్చినపుడు మేం అంతా కలిసి సరదాగా ఆడుతాం’’ అని తను చెప్పటంతో ఆశ్చర్యపోవటం నావంతయింది.

‘‘పాతవయితే మా ఆర్‌.పి.గారు అసలాడరు. వాళ్ళు అటు ఊళ్ళ నుండి రాగానే ఈయన గారిటు కొత్త ప్లేకార్డ్సు తెస్తారని’’ చెప్పింది పద్మిని నవ్వుతూ.

నాకు ఆ మాటలు వినగానే హుషారొచ్చేస్తోంది.

‘‘అయితే పాత సెట్టుంటే ఒకటి తీసుకురా పద్మినీ’’ అనటం ఆలస్యం, వెంటనే పద్మిని తన పతిదేవులకు, కార్డ్సు చూడండనే ఆర్డర్‌ జారీ చేయటం, క్షణకాలంలో జరిగిపోయింది.

ఆ… ఆయనేం సెట్‌ చేస్తారులే కాసేపట్లో అనుకున్నా నా మనసులో.

మాలిని స్నాక్స్‌, స్వీట్లను రుచి చూస్తూ, వాటికి పద్మిని చెప్పే ముచ్చట్లను అద్దుకుంటూ ఎంజాయ్‌ చేస్తోంది.

‘‘నువ్వు తినవా మైథిలీ?’’ అని పద్మిని అనటంతో…

‘‘ప్లీజ్‌… అబ్బా ఏమీ అనుకోకు. నాకు పొట్ట చాలా నిండుగా ఉంది’’ అంటూ తను నొచ్చుకోకూడదని కారాని కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకున్నా.

‘‘ఊ… చాలా బాగున్నాయి’’ ఎప్పుడు చేశావని అడిగా తనను.

‘‘చేయటమా? ఏమన్నానా? రెండు మోకాళ్లకి ఆపరేషన్‌ జరిగినప్పటి నుంచి, స్టౌ దగ్గర ఎక్కువసేపు నిలబడి వంటే చేయలేకపోతున్నా. ఇంకా పిండివంటలు కూడానా!’’ అని నిట్టూరిస్తూ… ‘‘లేదు మైథిలీ… మా కాలనీలో ఒకావిడ ఆర్డర్‌ మీద మనకు ఏ ఐటం కావాలంటే అది చేసిస్తుంది. బాగానే తయారు చేస్తుంది. పిల్లలొస్తున్నారని ఆర్డరిచ్చానని’’ చెప్పింది పద్మిని.

‘‘అవును నిజంగానే మనం ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉన్నాయబ్బా’’ అంది మాలిని.

‘‘‘కార్డ్స్‌’ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక సెట్‌ కలెక్ట్‌ చేయమన్నా, మా వారితో’’ అంది పద్మిని.

మాటవరుసగా అన్నా పద్మినితో. నా మనసులోని ఇష్టాన్ని గమనించి, భర్తకి కార్డ్సును సెట్‌ చేయ్యమనటం చూస్తుంటే పద్మిని పట్ల నా మనసులో స్నేహ మాధుర్యం ఉప్పొంగుతోంది.

‘‘ఆ… అయిపోయింది… ఓ ఐదు నిముషాల్లో తీసుకొస్తా’’ నన్న జవాబు వినపడిరది అటునుండి.

అన్నట్లుగానే ఠంచనుగా ఐదు నిముషాల తరువాత ఒక ప్లే కార్డ్సు సెట్‌ టీపాయ్‌, పిల్లలు రాసుకునే పరీక్ష అట్ట, వాటితో పాటుగా పాత నోట్సు, స్కోర్‌ వేయటానికి ఓ బాల్‌ పెన్నుతో సహా ప్రత్యక్షమయ్యారు ఆర్‌.పి.గారు.

***

తమ బండిమీద ఫ్రెండ్స్‌ ఇళ్లకు దింపటమో, మళ్లీ తీసుకురావటమో లేదా వాళ్లు మన ఇళ్లకొచ్చినపుడు కాసేపు కూర్చుని మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ కబుర్లు కలపటమో… ఇంతవరకే తెలుసు తనకు. ఎక్కువ శాతం పెరిగిన ఏరియర్స్‌, రిటైర్మెంట్‌ తర్వాత రావలసిన బెనిఫిట్స్‌ ఇవే మాటలుంటాయి మా ఇంటికి ఎవరొచ్చినా. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఉంటూ, ఎటువంటి భేషజాలకు తావీయని సందడితో, కలుపుగోలు తనంతో కూడిన సంభాషణలు నడుస్తుంటే, ఆనంద లోకాల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతోంది నాకు.

ఇంతలో పేకల్ని చకచకా కలపటం, మాలినినే ముందుగా కార్డ్సు వేయమనటం, తను నల్గురికీ వేయటం, చకచకా జరిగిపోయాయి. సాధారణంగా మన మహిళలకు సంబంధించిన (ఫ్రెండ్స్‌) వస్తే ఏదో మర్యాదకో, మొహమాటానికో వచ్చి ఓ రెండు నిమిషాలు మాట్లాడటం, తర్వాత ఏదో పనున్నట్లుగా, వాళ్లు బైటకు వెళ్ళిపోవటమో లేకపోతే పనున్నట్లుగా లోపలికి తమ గదిలోకి వెళ్ళిపోయి ఫోన్‌లో ఏదో ఓ సినిమా చూసుకోవటం, ఇంటికి వచ్చినవాళ్ళు వెళ్ళిపోగానే హమ్మయ్య అని లోలోపల అనుకుంటూ, హాల్లోకి వచ్చి టి.వి. ముందు కూర్చోవటం. ఇలానే జరుగుతుంది దాదాపుగా మా ఇంట్లో. కానీ ఆర్‌.పి.గారు కూడా సరదాగా కూర్చుని ఆడటం, వాళ్ళావిడ పద్మిని మీద చెణుకులు విసరటం, మాలినికీ నాకు ఎలా ఆడితే కౌంట్‌ తగ్గుతుందో కొన్ని టిప్స్‌ చెప్పటం… సరదాగా నవ్వుకోవటాలు… టైమ్‌ ఎలా గడిచిపోయిందో తెలియటం లేదు మాకు. అందరూ బాగానే షోలు కొడుతున్నారుగానీ, నాకు పట్టుకోవటం చేతగాక, చేతిలోంచి కార్డ్సు జారిపోతుంటే నాకే నవ్వొస్తోంది. మా అల్లుళ్లు వచ్చినప్పుడు అందరం సరదాగా కూర్చుంటాం, ఆడుకుంటాం అని పద్మిని అన్న మాటలను మననం చేసుకుంటుంటే ఆర్‌.పి.గారు గురించి, నాకు ఆశ్చర్యంతో కూడిన వింత దృశ్యం కండ్లముందు కదలాడిరది.

‘‘మళ్ళీ ఒకసారి చాయ్‌ పెట్టవోయ్‌!’’ అని అనటంతో పద్మిని వంటగదికి వెళ్ళింది. చిన్న విరామం తీసుకున్నాం అందరం.

ఏదో ఫోన్‌ వస్తే ఆర్‌.పి.గారు బాల్కనీలోకి వెళ్ళారు, ఆన్సర్‌ చేసేందుకు.

నేను, మాలిని వాష్‌రూంకి వెళ్ళొచ్చాం.

‘‘అవునండీ… పద్మినీ వాళ్ల అల్లుళ్ళు చాలా మంచివాళ్ళండీ… తనకు ఫోన్లు లాంటివి బహుమతులు కూడా ఇస్తూంటారట అప్పుడప్పుడు’’ అంది మాలిని నాతో.

అల్లుడంటే హోదాని వెలగబెట్టాలనుకునే కోవలోకే వస్తారు కొందరల్లుళ్లు. కానీ ఇక్కడ వరుసగా ఆశ్చర్యపు టపాసులు పేలటంతో మేమున్న ఆ గదితోపాటు నా మనసంతా హర్షపు వెలుగులతో నిండిపోయింది. మాటల, ఆశ్చర్యాల ఫలహారంతో నిండిపోయింది నా కడుపు. అందుకే సగం కప్‌ మాత్రమే టీ తాగగలిగాను. మిగతా సగం మాలిని కప్‌లో కొంచెం, ఇంకొంచెం పద్మిని కప్‌లో పోసేశాను, తాగమంటూ.

సరదాగా ఆడిన ఆటకు వేసిన స్కోర్‌ను చూశాను నేను. అందరూ బాగానే జాగ్రత్తగా ఆడారు. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు సరదాగా మొద్దాట ఆడిన గుర్తు నాకు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఆడటం ఆనందాన్నిచ్చింది. చెప్పద్దూ… నా స్కోర్‌. దిగ్విజయంగా రెండొందలు దాటేసింది. అంటే నేనే ఓడిపోయానని అర్థమైంది. అసలింతకీ నా పట్టుదల మీదే పద్మిని వాళ్ళాయనతో చెప్పి, పేకల్ని సెట్‌ చేయించటం, అందరం సరదాగా ఆడటం జరిగింది. ఇంతలోకి హాసిని నుండి ఫోన్‌ వచ్చింది పద్మినికి. ‘మైథిలిని, మాలినిని అక్కడే ఉండమను, నేనో గంటలో వచ్చేస్తా, మావారితో కలిసి’ అని దాని సారాంశం. ఆ ఇల్లంతా సంతోషాలకి చిరునామాగా అన్పించింది. నాకు.

నెమ్మదిగా మా ఫ్రెండ్స్‌ ముగ్గురమూ హాల్లోకి వచ్చాం. మా మేడమ్స్‌ అంటూ పద్మిని పిల్లలు ముగ్గురూ కూడా మాతో చేరిపోయారు.

‘‘ఎంతో సంతోషంగా అనిపిస్తోంది మిమ్మల్ని చూడగానే’’ అంటూ మాతో ఫొటోలు తీసుకోవటం… వాళ్ళ పిల్లల్ని మాకు పరిచయం చేయటం… ఇలా అన్నీ ఎవరి ప్రమేయం లేకుండానే ఒకదాని వెంట మరొకటి జరిగిపోతూ, సమయం అరచేతిలోని ఇసుకలా జరజరా జారిపోతోంది.

అదిగో అప్పుడు హాసిని హడావుడి చేస్తూ రానే వచ్చింది. రాగానే అమాంతం నన్నూ, మాలినిని వాటేసుకుంది. తన కండ్లలోని సంతోషపు చెమరింత నా చూపుల్నుండి తప్పించుకోలేకపోయింది. ‘ఏంటి?’ అని కనుసైగతోనే ప్రశ్నించా హాసినిని.

‘‘చాలా సంవత్సరాలైందిగా మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో కలిపి పనిజేసినప్పుడు, మళ్ళీ ఇన్నేళ్ళకు’’ అంటూ తాను కూడా కండ్లతోటే సమాధానమిచ్చింది.

మళ్ళీ ఫోటోస్‌ సెకండ్‌ సెషన్‌ స్టార్టయింది. అయితే కొన్ని, పద్మినివాళ్ల హజ్బెండ్‌ తీస్తే, మరికొన్ని హాసిని వాళ్ళాయన జనార్థన్‌గారు తీశారు.

ఏంటో జనార్ధన్‌గారు లోపలికి రావటము బిడియంగానే వచ్చారు, సోఫాలో కూడా ఓ మూలకు ఒదిగి ఒదిగి కూర్చున్న తీరుని చూస్తే చాలా సిగ్గరిలాగా

అనిపించారు మాకు. అది గమనించిన హాసిని… తన భర్తను ఈ వాతావరణంలో పడేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఫొటోలు కూడా తీసేపని భర్తకు అప్పగించిందేమోనన్పించింది నాకు మనసులో.

లోపలికి రాగానే నేనూ, మాలిని కూడా జనార్థన్‌గార్ని పలకరించాము. హాసినికి పెండ్లి అయిన చాలా రోజుల వరకు అనేకంటే, కొన్ని సంవత్సరాలు వరకు అనచ్చేమో. ఆ… అవును ఇదే నిజం. అప్పుడు జనార్ధన్‌గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఎప్పుడైనా మాల్స్‌లోగానీ, బిగ్‌బజారు లాంటి వాటి దగ్గర కలిసినపుడు నాతో, ‘ఈయన మావారు. పేరు జనార్థన్‌గారని హాసిని పరిచయించటం అన్నీ గుర్తొచ్చాయి మళ్ళీ ఒకసారి. నవ్వు ముఖమే అతనిది. బాగానే మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో తమకు ఇద్దరు పిల్లలని, బాబుకు చదువు పూర్తయి బెంగుళూరులో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్లుగా, పాపేమో హైదరాబాదులో మెడిసిన్‌ రెండవ సంవత్సరం చేస్తున్నట్లుగా చెప్పారు జనార్థన్‌ గారు. మేము ఊకొడ్తున్నాం.

‘‘చూడండి… చూడండి… ఏమీ ఎరగనట్లుగా నంగనాచిలా ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో’’ అంటూ నా చెవిలో గుసగుసగా చెప్పింది హాసిని.

‘‘ఉష్‌… ఊరుకోమ్మా… వినపడుతుందని’’ కొద్దిగా నెమ్మదిగా మందలించినట్టుగా అన్నాను తనతో.

మా ఫ్రెండ్సుకి ఈతని గురించి చాలా విషయాలు ముందుగానే తెలుసన్నట్లుగా నావైపు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ, సంభాషణ మళ్లించే ప్రయత్నాలు చేశారు మాలిని, పద్మినిలు. నాకూ గతంలో కొన్ని విషయాలు జనార్థన్‌ గారి గురించి చూచాయగా తెలిసి బాధపడ్డాను. హాసిని మంచి ఎడ్యుకేటెడ్‌. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. హాసినే చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో. ఎత్తుగా, తెల్లగా, బక్కపల్చగా అందంగా ఉంటుంది. అల్లారు ముద్దుగా పెరిగినట్లుగా అన్పించేది తన మాటలు వింటుంటే. అప్పుడప్పుడూ చంద్రిక ద్వారానో లేకపోతే ఆమని ద్వారానో సమాచారం తెలిసేది ఫోన్‌లో మాట్లాడుకునేటప్పుడు. వీలు చూసుకుని నేను వెళ్లేలోగా కొంతైనా హాసినిని ఊరడిరచాలనే నా నిర్ణయం. బాగా బలపడిరది. ఆలోచిస్తూనే హాసినిని క్లియర్‌గా గమనించటం మొదలెట్టా. పైకి తను నవ్వుతూ మాట్లాడుతున్నా, హాసిని మనసులో గూడు కట్టుకున్న బాధ తొంగి చూస్తూనే ఉంది. కంటి చెమరింపు ద్వారా అది బహిర్గతమవుతుంటే నా మనసంతా ఒక్కసారిగా దేవేసినట్టయిపోయింది.

‘‘ఇక మేము బయల్దేరుతామని చెప్పటంతో గబగబా లిఫ్ట్‌లో క్రిందకి వచ్చి ఆర్‌.పి.గారు తమ కారుని బైటకి తీశారు.

‘‘నేనూ వస్తాను’’ అంది పద్మిని.

‘‘అవును, చంద్రికను చూసి చాలా రోజులైంది. నేను కూడా వస్తానంది’’ హాసిని.

Written by Sompaka Seetha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నవ చైతన్యం

కవనశిల్పులు