
అమెరికా ప్రకృతి తన అంద చందాలతో రంగులు పులుముకొన్నది
వనాలతో వానజల్లుల మబ్బులతో
మసకేసిన సూర్యచంద్రుల నీడలో
నిలువునా నిలిచి రంగులు వెదజల్లే వనదేవతే మన బతుకమ్మల సమూహ సాదృశ్యం
వృక్ష సంపదతో తులతూగుతూ
ఈ ప్రకృతి తల్లిగవెలసి
ధాత్రిగ నిలిచిన తల్లి
ఈ బంగరు రంగుల బతుకమ్మ
పడతుల మనసులు గెలువగ
ఎటుచూసినా వర్ణ సముదాయాలు
గుట్టలు,దిబ్బలు కొలను గట్టులు
కట్టిపడేసే దృశ్యాలు
రహదారులు,రైలుట్రాకులు,
రంగురంగుల ఉద్యానవనాల ఆహ్లాదమై వెలసింది
ఇప్పుడు అమెరికా అంతటినీ ఆవరించిన బతుకమ్మ మన తెలంగాణ బంగారు బతుకమ్మ
తంగేడుల పసుపు
పట్టు కుచ్చుల ఎరుపు
గునుక పువ్వుల తెలుపు
రంగురంగుల తళతళలు
అన్నీ ఒకే దగ్గర గుట్టలు గుట్టలుగా ,
కట్టలు కట్టలు గా బారులుదీరినట్టు ఈ ప్రకృతి బతకమ్మలు
మనకు తెలియకుండనే
మనం మరవకుండా
ఎన్నో ఏళ్ల క్రితమే
అమెరికాకు వచ్చేసిన
మన తెలంగాణ బతుకమ్మ – ఆకులు రాలే కాలంలో అమెరికా లో
ప్రకృతి మనకిచ్చిన తెలంగాణ బంగారు బతుకమ్మ
ఫాల్సకలర్ పేరుతో
భూతల్లే తాంబాలంగా
ఆకాశమే అందమైన శిఖరంగా
చెట్ల పుప్పొ డే గౌరమ్మలా
అమెరికాకు సత్తు-ముద్దలతో
సకల వైభవంగా రంగురంగుల ఆకులతో ,పూలతో
ఈ పుడమిని పులకితలు పెడుతుంది మన బతుకమ్మ
అమెరికా ప్రకృతి మనకిచ్చిన
మన తెలంగాణ బంగారు బతుకమ్మ!