
ప్రస్తుతం మానవుని తత్త్వం ఎలా ఉన్నదంటే తాను చేసిన తప్పు ఎదుటివారి మీద చెప్పడానికి ఎలాంటి కారణాలు దొరుకుతాయా అని ఆలోచించడం, ఏ కారణము దొరక్కపోతే తనను నిర్దోషిగా నిరూపించుకునేందుకు ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తాడు. సామాన్యంగా ప్రతి ఉపన్యాసంలోనూ కొంతమంది స్త్రీల కట్టు,బొట్టు,జుట్టు గురించి మాట్లాడడం తప్ప మగవారి పద్ధతుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు అనేది నా ప్రశ్న. అంటే వారు మగవాడు కనకనా…! లేక తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇదొక ఎత్తా…. లేకపోతే వారి నడతను గురించి, వారి ప్రవర్తనను గురించి, వీరికి దేనికి అన్న తీరా?
ఒకవేళ ఏ సందర్భంలోనైనా మగవారి పద్ధతిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పవలసి వస్తే వీరు ఏమని సమాధానాలు చెప్పి ప్రశ్నించిన వారిని సమాధానపరుస్తారో వారికే తెలియాలి.
అయినా ఎవరో తెలియని అమ్మాయి మీద ఏదో ఒకటి అనేయడం సజ్జనుల లక్షణమా? ఇవాళ సమాజం సనాతన పద్ధతిలో లేదు అభ్యుదయ పథంలో ముందుకు దూసుకుపోతోంది పురుషులతో పాటు, సమానంగా స్త్రీలు కూడా అన్ని పనులు చేయడానికి సిద్ధమయ్యారు.
మనం కూడా నేటి విధానాలను దృష్టిలో పెట్టుకొని
ప్రవర్తించి నట్లయితే…
కార్యాలయానికి వెళ్లడానికి ఒక స్త్రీ చీర కట్టుకొని వెళ్లడం సులభమా? ఆమెకు అనువుగా ఉండే ప్యాంటు వేసుకొని వెళ్ళడం మంచిదా.
బయటకు వచ్చి అలవాటు లేని చీరతో ఇబ్బంది పడుతూ
ఏదైనా యాక్సిడెంట్ అయితే అక్కడకు వచ్చి అతను కాపాడుతాడా? ఇలా ప్రసంగాలు చేసే వాడు. రక్షించే వాడికి బాధ్యత ఉంటుంది తప్ప భక్షించే వాడికి కాదు కదా అది అర్థం చేసుకోకుండా అవకాశం వచ్చింది కదా అని ఏదో ఒకటి మాట్లాడటం వల్ల విన్నవారికి అతను ఎంతో చులకనగా కనపడి నవ్వడం తప్ప, అతని వ్యక్తిత్వం గొప్పదని
ఎవ్వరూ అనుకోరు.
సనాతన ధర్మాన్ని గొప్పగా ప్రచారం చేయడమంటే అర్థం పర్థం లేని మాటలతో వ్యక్తిత్వాలను దూషించడం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో స్త్రీ, పురుషులు
సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. విద్యావంతురాలిగా ఆమెకు నచ్చిన విధంగా ఆమె ఉండటం తప్పు అని నిందించడం సమంజసం కాదు.
ఆమె బాధ్యతలను విస్మరించినప్పుడు మందలించడం మంచిదే కానీ.
ఆమె ఆహర్యాన్ని, వేషధారణను వ్యక్తీకరిస్తూ వివాదాలను తట్టి లేపడం పెద్దరికం అనిపించుకోదు. సమాజాన్ని
మేల్కొల్పాలన్న మీ ఉద్దేశం మంచిదే కానీ, మాటలను సమర్థించడానికి స్త్రీ వేషధారణను
వస్తువుగా తీసుకురావడం, పక్షపాతాన్ని వహించినట్లే కదా.
లోకజ్ఞానం తెలిసిన మీరే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే,
భావితరాల స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛ ప్రశ్నార్ధకమే అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు..
మగవారు ఇంతకుముందు పిలకపెట్టుకొని, పంచెకట్టుకొని, పై పంచె వేసుకుని పెద్దమనిషి తరహాగా బజార్లోకి వచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది అలా వస్తున్నారు. లాగులకు ఇది వరకు చిన్న చిరుగు కనిపిస్తే ఇది పాతబడింది చిరిగిపోయింది అని పక్కన పెట్టే వాళ్ళం. ఇవాళ అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది దానిని హర్షించడమా? లేక అభ్యంతరం చెప్పడమా? లేక మగవాడు కనుక మగవాడు మాట్లాడకూడదన్న మౌనమా? కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న వధువు అత్తవారింట్లో నేను నిన్ను కొన్నాను నీవు నాకు పని చేయాలి తప్ప నేను నీకు చేయను అని అభ్యుదయ వాదంతో మాట్లాడితే మీ సనాతనం ఏమైనా సమాధానం చెప్పగలడా? లేదే. ప్రాథమిక హక్కులనే తొలగించిన మీకు ఇలాంటి ప్రసంగాలు చేసే అధికారం ఎవరిచ్చారు అని స్త్రీ ఎదురు తిరిగితే మీరు ఏం చేస్తారు…? ఏం చెప్తారు….?
సమాధానాలు లేవు కదా…మౌనమే సమాధానం అనుకుందామా…!
అరుణానంద్,
విజయవాడ,
7780380144.