తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.
కమ్మని ఆమె గళంలో కవితాగుబాళింపులు, ఆలోచనాతరంగాల ఉరకులు, పరుగులు!వినయవిధేయతలతో వెరసిన యువ కవయిత్రి నీలం స్వాతి!
అమ్మానాన్నల బంగారు తల్లిగా, గురువుగారికి ఆత్మీయ శిష్యురాలిగా, చదువులలో సరస్వతిగా, కలాన్ని పట్టిన
నేటి కవయిత్రిగా, ఎందరి మన్ననలనో అందుకుంటున్న ఈ డాక్టర్ గారి ప్రయాణాన్ని తెలుసుకుందాం పదండి….
చదివింది ఫార్మా-డి. 88% ఉత్తీర్ణతను సాధించి కాలేజీలో టాపర్ గా నిలవడంతో పాటు ప్రస్తుతం అపోలో హాస్పిటల్ నెల్లూరులో క్లినికల్ ఫార్మసిస్ట్ గా ఉద్యోగాన్ని చేస్తున్నారు.
ప్రతి రోజు ప్రిస్క్రిప్షన్ ఆడిటింగ్, వార్డ్స్ రౌండ్స్, ఓ.పి పేషంట్ కౌన్సిలింగ్ ఇలా హెల్త్ సెక్టార్ లో డాక్టర్స్ టీమ్ తో కలిసి కలివిడిగా గడిపే ఈమెకు కవితల పై మక్కువ కలగడం కాస్త భిన్నంగా అనిపిస్తుంది కదా. అందుకే ఆమె గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం రండి!
నాన్న రైతు శ్రీ నరసయ్య.అమ్మ కృష్ణవేణి గృహిణి. ఇద్దరూ పదో తరగతి వరకు చదివారు. తమ్ముడు CMA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన స్వాతి స్వగ్రామం చిన్న చెరుకూరు! చదువులకోసం నెల్లూరులో వుంటున్నారు. 10 వ తరగతి నించి భావాలు కాగితం పై పెట్టడం మొదలు పెట్టిన స్వాతికి సామాజిక స్పృహ కల్గిన కవితలు రాయటం హాబీగా మారింది. తొలి కవిత “మిత్రమా మరవకు” కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ లో చదివిన కవితకు మంచి ప్రశంసలు రావడంతో మరింత గొప్పగా సాహిత్యాన్ని రాయాలన్న ఉత్సాహం ఆమెలో కలిగింది.
టౌన్ హాల్ లో జరిగిన కవితాగోష్ఠి లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఆనంద్ గారి చేతుల మీదగా తొలి సత్కారాన్ని అందుకుంది స్వాతి. తొలుత తాను రాసిన కవితలను అమ్మ నాన్నలకు వినిపించేది. ఆ తర్వాత తన గురువు గారైన ఆనంద్ గారికి. ఈమె కవితలోని సున్నితత్వం పాఠకుల హృదయాలను కదిలిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాధారణమైన మాటలతో అసాధారణమైన భావాలను పలికించగల ప్రతిభ ఈమె సొంతం దానికి తోడు రవికుమార్, భాగ్యలక్ష్మి గారి సాహిత్యపరమైన తోడ్పాటు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈమె ఇంగ్లీషులో, హిందీలో కూడా కోట్స్ ను రాస్తూ త్రిభాషా కవయిత్రిగా అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈమె తెలుగులో 500 కు పైగా అంశాలను రాయడమే కాక ఈ మధ్య కాలంలోనే “నా కలం కల్పన” అన్న టైటిల్ తో తాను రాసిన కవితలతో మొదటి పుస్తకాన్ని ప్రచురించారు ద్వితీయ పుస్తకం “నా కలం సృజన” అన్న భాగాన్ని ప్రచురించే పనిలో ఉన్నారు. అనేక మంది సాహితీ ప్రియుల అభినందనలతో పాటు, అనేక ప్రశంసా పత్రాలను కూడా అందుకున్నారు. సాహిత్యపరమైన మెళకువలను నేర్పుతూ, అక్షర దోషాలను సవరిస్తూ వారి
మానస పుత్రికగా స్వీకరించి,
ఆమె ఎదుగుదలలో వెన్నంటి ఉన్న పితృసమానులు ఆకాశవాణి ఏ.బి ఆనంద్- అరుణ గార్ల ఆశీస్సులను పొందడం నిజంగానే ఆమె పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి.
వారి శిష్యరికంలో ఆమె రాసిన అనేక కవితలు ప్రముఖుల ప్రశంసలతో పాటు, పారితోషికాలను కూడా తెచ్చిపెట్టాయి. అలా ఎన్నో పత్రికలలో ఆమె కవితలు ప్రచురణ కావటం, ప్రశంసల జల్లు కురవటంతో కాలేజ్ వ్యాన్ లో కూచుని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. భ్రూణహత్యలు, రైతుల కష్టాలు ఆమె కవితల్లో ముఖ్య అంశాలుగా ఉండి విశేషంగా అన్ని పత్రికలలో, సభల్లో ప్రశంసల జల్లు కురిపించాయి.

ఈమె కవితలను ప్రచురించిన కొన్ని పత్రికల వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం-
ఈనాడు దినపత్రికలో ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ తో పాటు మదర్స్ డే సందర్భంగా గర్భగుడి అన్న కవిత, జమీన్ రైతు పత్రికలో యువ కవయిత్రి స్వాతి అన్న పేరుతో ఓ వ్యాసాన్ని ప్రచురించారు. సత్యాగ్రాహి బాపూజీకి కవితా నీరాజనం అన్న పుస్తకంలో, ప్రకృతి వ్యవసాయ గీతాలు అన్న పుస్తకంలో, డాక్టర్ జయప్రద సోమిరెడ్డి గారి నానీల సంకలనంలో, నవ మల్లె తీగ సకుటుంబ సాహిత్య మాస పత్రికలో యశోద కృష్ణుడు అన్న శీర్షికతో, బెంగళూరు వారి తెలుగు తేజం పత్రికలో మట్టి వాసన అన్న కవితను, సింహపురి రైతు, విశాఖ సమాచారమ్, స్టేట్ లీడర్, రెడ్డి జ్యోతి, మన జ్యోతి, పున్నమి తెలుగు దిన పత్రికలలో కవితలతో పాటు ఛాయాచిత్రాలను కూడా ప్రచురించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్ గారు తమిళసై మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమార్తె కవిత గారి చేతుల మీదగా ఆవిష్కరించబడిన బంగారు బతుకమ్మ అన్న సంకలనంలో ఈమె కవిత చోటు సంపాదించుకుంది. కరోనా కవితా సంకలనం, దాశరథి కవితా సంకలనం ఇలా అనేక సంకలనాలలో ఈమె కవితలు ముద్రించబడ్డాయి.
ఈమె అందుకున్న ఆత్మీయ సత్కారాల వివరాలు-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వ్యవహరించిన వాడ్రేవు చినవీరభద్రుడు గారిచే చిరు సత్కారాన్ని అందుకున్నారు, సినీ గీత రచయిత వెన్నెలకంటి గారి చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. ఈ మధ్య కాలంలోనే నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ గారి చేతుల మీదగా ఉగాది పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది.
సామాజిక సమరసతా వేదిక ఆంధ్ర ప్రదేశ్ డాక్టర్ గుర్రం జాషువా జయంతి ఉత్సవాల సందర్భంగా సాహితీ సప్తాహం లో నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతిని అందుకున్నారు. తెలుగు సాహితీ వేదిక వారు కులం కథ కథా సంకలనం సభలో శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు నిర్వహించిన పోటీలలో ద్వితీయ బహుమతిని, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలో ప్రశంసాపత్రాన్ని, తెలుగు రాష్ట్ర స్థాయి ప్రకృతి వ్యవసాయం పాటల పోటీలో విజేతగా నిలిచి పారితోషకాన్ని కూడా అందుకున్నారు.
54వ గ్రంథాలయ వారోత్సవాల లో ప్రముఖ కవి శ్రీ చిన్ని నారాయణ గారిచే చిరు సత్కారం అందుకున్నారు. ఆదిత్య విద్యా సంస్థల అధినేత ఆచార్య ఆదిత్య గారి చేతుల మీదగా ప్రశంసాపత్రాన్ని కూడా అందుకుంది. అంతే కాదండి తన గురువుగారి పుస్తకాలకు అభిప్రాయాన్ని కూడా రాసే అదృష్టాన్ని సద్వినియోగం చేసుకున్న భాగ్యవంతురాలిగా
పేరు తెచ్చుకున్న స్వాతి ముందు ముందు మరెన్ని కవితా సంకలనాలను వెలువరించి, ఇంకా ఎన్నో విజయాలను అందుకోవాలని తరుణి పత్రిక మనసారా కోరుకుంటుంది…