
ఈమె పేరు అనసూయమ్మ. ఈవిడ మహబూబ్ నగర్ కరణం శ్రీనివాసరావు రుక్కునమ్మ కూతురు. ఈమె భర్త అమ్రాబాద్ ఆయన ఆరవ కూతురు కడుపులో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. 26 సంవత్సరాల లోపలనే ఆరుగురు సంతానం ఆరుగురు ఆడపిల్లలే. ఆరవ కూతురు కడుపులో ఉన్నప్పుడు భర్త చనిపోయిన తరువాత కాన్పు జరగడం చాలా విచిత్రంగా జరిగింది. అందరూ అయ్యో అనేవాళ్లే. కానీ ఆవిడ ఏనాడు భయపడలేదు ఒంటరిగా ఉన్నానని తలంచలేదు తన పిల్లలే తన భవిష్యత్తు అనుకొని ఇప్పుడు కూడా జీవిస్తున్నారు ఒంటరిగా ఒక ఫ్లాట్లో హైదరాబాదులో కూతుర్లకు దగ్గర్లో. కూతుర్లు వారి ఇంటికి రమ్మన్నా వెళ్లదు. తానే స్వయంగా తన పనిని తాను చేసుకుంటూ ఎంతో ధైర్యంగా జీవిస్తున్నారు శతాధిక వృద్ధురాలు అయినా మనో నిబ్బరం ధైర్యం సాహసం వ్యక్తిత్వ వికాసం పనిలో శ్రద్ధ శుభ్రత పనిమీద ఏకాగ్రత ఆవిడని చూసి నేర్చుకోవాల్సిందే. తన పనులన్నీ తానే చేసుకుంటూ తనను చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సంతోష పరుస్తూ స్వయంగా వంట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . కాబట్టి మహిళలందరూ ఒంటరి వాళ్ళు ఎప్పుడూ కారు , మహిళలకు ఉండే ధైర్యం మగవాళ్ళకు ఉండదు. వారు తోడు కావాలని భార్య చనిపోగానే వివాహాలు చేసుకుంటారు. కానీ ఆనాటి స్త్రీ అయినా వయోధిక వృద్ధురాలు అయినా అనసూయమ్మ. ఒంటరిగా నే తన సంతానాన్ని పెంచి పెద్ద చేసింది.
ఈవిడకి కుట్లు అల్లికలు కూడా వచ్చు. ఒక కూతురు యూఎస్ లో ఉంటే 60 సంవత్సరాల వయసులో ఒంటరిగా వెళ్ళింది ఒంటరిగా వచ్చింది. ఇంగ్లీష్ నేర్చుకుంది.
ఇప్పుడైనా ఎవరైనా ఫోటో దిగాలంటే నేను తయారై వస్తాను ఆగండి అంటుంది చక్కగా ముస్తాబయ్ వస్తుంది. రెండు పూటలా స్నానం చేస్తూ భగవాన్ నామ స్మరణ చేస్తూ తన పనులు తాను చేసుకుంటుంది. ఆమె దగ్గరకు ఎవరు వెళ్లినా పళ్ళు కట్ చేసి ఇస్తుంది. కరెంటు స్టవ్ లో అన్నం వండుకొని తింటుంది . ఇల్లు నీటుగా సర్దుకుంటుంది. కొత్త చీరలు ఏమైనా వచ్చాయా మార్కెట్లో లైట్ వెయిట్ చీరలు కావాలని అడుగుతుంది.
చక్కగా రేడియో పెట్టుకుని పాటలు వింటూ పాటలు పాడుతూ కాలక్షేపం చేస్తుంది ఈనాడు ఒంటరినని బాధపడలేదు.వీరి భర్త పట్వారీ ఉద్యోగం చేసారు కాబట్టి గవర్నమెంట్ పెన్షన్ ఇంకా వస్తుంది. ఈమె మా అమ్మ కమలమ్మకు సొంతం అక్క. మా ఆయమ్మ. అంటే, మా అమ్మ కు అక్క కాబట్టి మేం ఆయమ్మ అని అంటాం.
ఇవాల్టి కి ఆమె జ్ఞాపకశక్తికి జోహార్లు అసలు ఆవిడ ఒక గిన్నిస్ బుక్ అన్ని జ్ఞాపకం ఉంటాయి అన్ని మా అమ్మ నాన్నతో ఇవ్వాల్టి కి చెబుతాను అంటుంది. ఆ జ్ఞాపకాల ఘని ఇంకా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని మనకందరికీ మార్గదర్శకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
“ఓ దీపం కరిగిపోతూ
ఎందరికో వెలుగునిస్తుంది
ఓ రూపం తరిగిపోతూ
ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది”
మా ఆయమ్మ అనసూయమ్మ జీవితం మహిళలందరికీ మార్గదర్శకం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నాను.