మసి అంటని స్పటికం

పల్లెటూరు కావడంతో ఆ ఇంట పెళ్ళిసందడి ఆ ఊరంతా పాకింది. ఆకుపచ్చని పేడతో చానిపి చల్లి, జాజుతో గలమలు అలికి, సున్నంతో ముగ్గుపెట్టి, మామిడాకు తోరణాలు కట్టి,చలువ పందిళ్ళు వేస్తే ఏదో పచ్చి కమ్మని వాసనతో వాతావరణమైతే బాగుంది. పది ఊర్ల కరణీకం ఉండడంతో సేకుసిందులు, పాల కావిళ్ళు, బట్ట వాసనలు కట్టిన నేతి రాతెండి తప్యాలలు తెచ్చిస్తున్నారు. పదిండ్లవారు కలసి పనులూ-పాటలూ చేస్తున్నారు.. మనిషి చాటైతే ముక్కులూ-మూతులూ విరుస్తూ గుసగుసలు పోతున్నారు. ఎవరైనా రాగానే మామూలు మాటలు మాట్లాడుకుంటున్నారు. కూరగాయలు చాపలలో పరిచి తరిగే వాళ్ళు తరుగుతున్నారు. రెండు మూడు మూకుళ్ళు పెట్టి అప్పాలు చేస్తున్నారు కొందరు. పిండి, పసుపు విసిరేవారు విసుర్రాయిలతో విసురుతున్నారు.. ఇలా హడావుడిగా ఉందా ఇల్లు. కానీ పెండ్లి పిల్ల తల్లి మాత్రం నిశ్శబ్దంగా తిరుగుతూ… లోలోపల దుఃఖంతో కుములుతున్నది.
ఇవేవీ పట్టని పెండ్లి పిల్ల దోస్తులొచ్చి, కచ్చకాయాలాడుకుందాం రా! అని సీతను పిలుస్తుంటే పెద్దవారు కోప్పడుతున్నారు. పెళ్ళి పిల్లను చేసిన తరువాత గడపదాటి బయటకు పోవద్దని… అంటున్న ఈ మాటలేవీ అర్ధం కావడంలేదు సీతకు. కొత్త పరికిణీ కట్టుకుని పొడుగ్గా ఉండి కాళ్ళకు అడ్డంపడి నడవలేక రెండుచేతులతో ఎత్తి పట్టుకుని నడుస్తుంటే… పసుపు పచ్చటి శరీర రంగుకు ఆకుపచ్చ పరికిణీ, మిరుపపండు రంగు అంచుతో ఉన్న పరికిణి- ఎఱుపు రంగు జాకెట్టు కొట్టొచ్చినట్టు కనపడుతూ ముఖం వెలిగిపోతున్న కూతురును చూసి తండ్రి కంటినీరు భుజాన కండువాతో తుడుచు కుంటూ ఏమీ తోచక అటూ-ఇటూ తిరుగుతున్నాడు.
అటుగా వచ్చిన భుజంగ రావు “ఎందుకా ఏడుపు? ఇపుడేమైందనీ? చక్కటి జమీందారీ సంబంధం, వంద ఎకరాల భూస్వామి, పెద్ద పసులమంద, పాడీ-పంటా; ఎద్దూ-వ్యవసాయం; పది ఊర్ల కరణీకం, పదిమంది గుమాస్తాలు ఇరవైనాలుగు గంటలు పనిచేసినా తరగని పట్వారీ గిరి…బంధు బలగం, ఇంటినిండా ఆడపాపలు, నౌకర్లు, వంటకు వంటస్వామి ఆ రాజభోగం అనుభవించలేకనా? ఆ ఏడుపు? నేను కష్టపడి పైరవీలు చేసి మీ ఆస్తులను దక్కించాను. నేను – నా కుటుంబం భోజనాలు తప్ప మాకేమొరిగిందని ఈ కంచి గరుడ సేవ ? ఈ సంబంధం వద్దంటే మేము మా ఊరుకు పోతాం, నువ్వూ- నీభార్య పిల్లలు సంతోషంగా ఉండండి” అని గదమాయిస్తూ… భుజాన కండువ తీసి చిటచిట దులిపి మళ్ళీ భుజంమీద వేసుకుంటూ బంకులకు పోయిండు.
అసలే అమాయకం, పిల్ల పెళ్ళి కుదిరిస్తే… ఊరినుండి వెళ్ళగొట్టిండనే అపవాదు పడాల్సి వస్తుందని నోరు మూసుకొని పొలం వైపు వెళ్లి పోయాడు సీత తండ్రి పీతాంబర రావు.
ఎవరి ప్రమేయం లేకుండానే… పిల్ల నిర్ణయం తెలుసుకోకుండానే, కనీసం పెండ్లి పిల్లగాడిని ఈ ఇంటివారికి చూపెట్టకుండానే పెళ్ళి జరిపించేసాడు భుజంగరావు.
అత్తగారింట అడుగుపెట్టిన సీత పసితనం వదలని పచ్చని పైడి బొమ్మ! మనసుకు మసి అంటని స్పటికం.
మగడని పరిచయం కాబడ్డ అతను భుజాల మీద గూనితో చూడడానికీ ఏమంత బాగాలేడు… ఎత్తులో తనకు నడుము వరకు ఉన్నాడు. అతనేమంత పొడుగు కాకపోయినా తల -భుజాలు వంచి నడుస్తాడు. సరే! ఏదోలే అనుకుంటే అతనికి ఆడా-మగా మధ్య తేడా తెలియని అమాయకత్వం,
ఇక లౌకిక విషయాలసలే తెలియదు! అందాకా అతని తల్లి , నౌకర్ల సాయంతో ముఖం కడగడం, స్నానం చేయించడం, బట్టలు కట్టడం, తిండి తినిపించడం మొదలైన పనులన్నీ జరిగేవి. ఇప్పుడు సీత వంతున పడింది. కొత్త జంట వలె లేనే లేరు. అంతా అగమ్య గోచరంగా ఉంది సీతకు.
అది జీవనమే కాదు! అంటే జీవితమంటే ఒక్క శృంగారమే ముఖ్యమని చెప్పడంలేదు. తన సహచరుడితో సంతోషకరమైన సంభాషణలే లేవు. బుద్ధి మాంద్యపు ఆ వ్యక్తికి ఏమీ తెలియని ఆ వ్యక్తిని చంటిపిల్లాడివలె ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి వచ్చినప్పుడు… ఆ పిల్ల మనసు పడే క్షోభ ఎవరికీ తెలియదు! మరో ఆడదానికే తెలుస్తుంది.
పెండ్లి అయినాక దోస్తులు తన మెడనిండ మెరిసే బంగారం చూసి, “అబ్బా! ఈ గొలుసులన్నీ నీకేనా?” అంటే ఔను! నాకే మా అత్తగారు పెట్టారని మురిసి పోయిన ఆ పిల్ల మురిపెం మూడురోజులే అని ఆమెకు గానీ, ఆ దోస్తులకు గానీ తెలియని అమాయకత అప్పుడు.. బలిపశువుగా అత్తగారింటికి పోతున్నానని తెలియని తనమే చాలా కాలం కొనసాగింది… తీరా ఇక్కడికొచ్చాక ఒక్కో విషయం తెలిసినప్పూడల్లా ఒక్కో పిడుగు తల పై పడి క్రమంగా ఆరోగ్యంపై వేటు పడింది. ఆ అసరుతో ఒక విధమైన మానసిక వ్యాధికి గురిఅయింది.
దానికి చుట్టూ ఉన్నవారు దేవుడికి ప్రదిక్షాణాలు చేయాలని బలవంతంగా చేయిస్తున్నారు. అలా ఎన్నో మండలాలు చేసింది. అసలే బలహీనంగా ఉన్న సీత పాలల్లో పడిన బల్లివలె తయారైంది. మనసు ఎదురు తిరగడంతో మొండిగా తయారైంది. ఆ ఫ్రస్టేషన్ లో మగపుట్టుక పుడితే బాగుండును. ఈ ఆడజన్మ వద్దని కోపంగా మగవారి దుస్తులు ధరించేది. ఆ తరువాత కూడా పెండ్లికో పేరంటానికో పోవాలన్నా బంధువుల అదోరకమైన చూపులు తాను చేయని నేరానికి శిక్ష వలె తాకేవి. తన తోటివారు చిలకా-గోరింకల వలె హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ గడుపుతుంటే.. తానేమో పసిపిల్లవాడికి తినిపించినట్టు అన్నం తినిపించి మూతి కూడా కడగాలంటే, ఒక స్థాయిలో మనసు మరిగి, ఇక జన్మ లో ఏ ఫంక్షన్ కూ పోవద్దు.. ఇది కూడా మనసు వద్దని చెప్పినా తనకు సహాయపడే వారింటికి పోయి, కట్నమో కానుకో పెట్టకుంటే తనను పట్టించుకోరేమో? అనే అభద్రతా భావంతోనే అన్యమనస్కంగానే వెళ్ళేది.. ఇక ఎక్కడికి పోవద్దని అలా సమాజాన్ని తానే బహిష్కరణ చేసి, మరో మానసిక శిక్ష అనుభవించింది. ఇలా చెప్తూ పోతే ఒకటా? రెండు? ఏడుపదుల జీవితంలో హేళనలే ఎక్కువ.
దీనికి పరిష్కారమే లేదా?
ఆడదానికి, తెలివికి, చదువుకు, పనిపాటలు చేయడంలో నైపుణ్యాలు ఇలా ఎన్ని అర్హతలున్నా… ఆడ అనే అనర్హత వేటు ఒక జీవితాన్ని బలిగొన్న వైనం ఆర్ధిక కారణాలు ఒక్కటే అనలేని పరిస్థితి. తిరస్కరిస్తే బరితెగించిందంటారు. ఒప్పుకుంటే శారీరక మానసిక ఆనందాలులేని ఆ జీవితంలో ఫ్రస్టేషన్ తో మానసిక వ్యాధులొచ్చి, దానికి చికిత్స చేయించకుండా.. విధిచేతిలో వదిలేసి, దైవకృపకోసం బలవంతంగా ఆధ్యాత్మిక చింతనలోకి నెట్టివేయబడి, అటు లౌకిక ఆనందాలను పొందలేక- ఇటు మనసుభక్తి పై కుదురుకోక నరకయాతన అనుభవించడం పెద్దలకెదురుచెప్పలేని అతిమర్యాద, బతుకు రాజీలతో ఎన్నేండ్లు జీవిస్తేనేం?
అలా అని మరీ వదులుకోలేక చావులకో- ఆపదలొచ్చినప్పుడో పోతే ఏమున్నది? చాకిరీ చేయలేక చావాలి… కొంతమందికి తాను చేసిన సేవలు, కొంతమంది డబ్బులకు ఇలాఎవరైనా తమ తమ పబ్బాలు గడుపుకునేందుకే తప్ప …తన మీద ప్రేమ కారిపోయికాదు! అలా ఆస్తులూ- బంగారం అంతా హారతి కర్పూరమై పోయింది.
ఎలా ఐనా తానే రాజీపడాలి… ఎందుకంటే తనకంటూ సంతానం లేదు! రేపు… రేపు… ఎవరితో ఏ అవసరం పడుతుందో? అనే ఆదుర్దాలోనే ఆయువంతా గడిచిపోయింది. మరణానికి భయపడిన దానికన్నా ఎక్కువ ఆమెకు బతుకు పోరాటం కోసం ఆరాటం- ఎవరు సేవలు చేస్తారనే చింతనే ఎక్కువ అయింది. మంచంలో పడితే ఎలా? అనే రంధితో ఓ పదేళ్లు బతికుండగానే చచ్చిపోయింది. కొందరి జీవితాలు బాల్యంలో బాగాలేకపోయినా,యవ్వనలో భర్త సాంగత్యంలో బాగానే జరిగిపోతుంది. కొందరికి భర్తతో సహజీవనం చేసినప్పుడు సుఖ జీవనం గడవకపోయినా సంతానంతో సంతోషంగా గడుపుతారు.ఈ సీత జీవితమే
సీతమ్మ చెరలన్నట్టు చివరికంటా కష్టమే మిగిలింది… ఇక రోజూవారీ పనులు చేసుకోలేని స్థితికి వచ్చింది. అయినవారు పాపమని వృద్ధాశ్రమంలో చేర్చారు.
ఆమె తన ఇంటిలో ఏనాడూ అధ్వాన్నంగా ఉండలేదు… ఎప్పుడు చూసినా కడిగిన ముత్యంవలె ఎంతో బాగుండేదని ఆమె తెలిసిన వారందరికీ తెలుసు.
జరీ అంచు ఇస్త్రీ నలగని చీర-రవిక; ఒక్క వెంట్రుక కూడా చెదరకుండా నొక్కునొక్కుల పొడవాటి జుట్టు… హుందాగా ముడివేసుకుని, నుదుట చక్కని నామం పెట్టుకుని, పసుపుపచ్చని శరీరచ్ఛాయతో, మెరుపులు తగ్గని మొహంలో చిరునవ్వే ఆభరణంగా, చక్కటి కళ్ళద్దాల ఫ్రేమ్, కాశ్మీర్ శాలువా కప్పుకుని ఒక జమీందారిణి వలె తిరిగిన ఆమె, ఆ ఆశ్రమంలో ఏ అర్ధరాత్రో ప్రాణం పోతే చూసేవారులేక, తెల్ల వారిన తర్వాత కేర్ టేకర్ చూసి, ఆమె బంధువులకు ఫోన్ చేసి, చనిపోయిన విషయం చెప్పి మా ఆశ్రమంలో అందరూ వయసైపోయినవారే.. ఈమె మరణించిందని తెలిస్తే అందరూ భయపడిపోతారు. శవాన్ని త్వరగా తీసుకొని పోండి! అని వెంట వెంట ఫోన్ చేసి ఊదరగొట్టారట.
ఆమెను ఎక్కడికి తీసుకుపోవాలనేది పెద్ద సమస్య. ఎలాగో ఒక లాగ తీసుకొని రావాల్సిందే అని నేరుగా స్మశానానికే తెచ్చారు. అక్కడ ఆమెను చూసిన వారికి కడుపు తరుక్కుపోయింది. మాసిపోయిన నైట్ గౌన్, అదీ మలమూత్రాలతో తడిసిపోయి, కంపుకొడుతున్నది. కనీసం అందరూ వచ్చేవరకైనా డెడ్ బాడీనీ ఆశ్రమంలో ఉంచనివ్వకుండా- స్మశాన వాటికలో ఓ పక్కన పడుకో బెట్టారు. అపరిశుభ్రంగా ఉన్న ఆమెను చూసిన వారికి గుండెలు పిండైనవి.
ఒక మంచి ఇంట పదుగురి మధ్యా పుట్టిన ఆమె- పదుగురు బంధువుల మధ్య మెట్టినింట కాలు పెట్టిన ఆమె చివరకు ఎలా అయిందని చెప్పలేనంత బాధపడ్డారు. బంధువులంతా…కానీ ఎవరేం చేస్తారు? ఎవరికి తగిన సమస్యలు వారికున్నాయి.. ఆమెను దగ్గర పెట్టుకుని చూడాలంటే ఆర్ధిక బాధలొకరికైతే…అనారోగ్య సమస్యలొకరికైతే, తామే ఒకరిమీద ఆధారపడిన సమస్యలొకరికైతే…తమ పిల్లల బాధ్యతలలో మునిగి తేలని పరిస్థితులొకరికైతే… మానవ విలువలు లోపించి, ఆర్థికపరమైన అవసరాలతోనే ఇన్నిరోజులూ ఆమెతో బంధుత్వం కొనసాగించిన వారికి ఆమె అదనపు బరువే! అందుకే ఆ బరువు నెత్తికెత్తుకోలేక వృద్ధాశ్రమంలో దించుకున్నారు. అదికూడా ఒకందుకు నయమే! ఆకలితో చావు రాలేదు…అనాదరణకు గురికాలేదు. ఇంకా లోకంలో మానవత్వం మన్నుకరవలేదని నిరూపించే బంధువర్గం ఆమెకు శారీరక సేవలు చేయలేకున్నా…క్షేమసమాచారాలు అరుచుకునే వారున్నారు కనుకే…ఆ చివరి రోజులు గడవడమే కాకుండా… ఆమెకోరుకున్న పద్ధతిలో అంత్య క్రియలు జరిగి- తాళి కట్టినా..మగడిగా కాక- పసి బిడ్డ వలె సాకిన పతి చెంతకు చేరిందా సూక్ష్మ శరీరం… పురాణ పాత్రలైన ఏ సుమతీ, సీతా, అనసూయ, అరుంధతిలేమాత్రం తీసిపోని ఆమె పాతివ్రత్యం పతి ( శ్రియఃపతి) పాదాలచెంతకు చేరాలన్న ప్రార్ధన ( ఇంట్లో కూచునే సుమా- ఏదో సహాయ సహకారాలందించి కాదు) చేసి, శాపగ్రస్థ ముక్తాత్మకు ప్రణమిల్లడం కన్నా చెసేదేమీలేక కలచిన హృదయంతో- తడసిన కంటితో- బరువెత్తిన గుండెతో…ఆమె మళ్ళీ జన్మించవద్దనే ప్రార్ధనతో ఇల్లుచేరి ఓ వారం మనసు మనసులో లేక- పౌరాణికుల మాటల్లో విన్న మెట్టవేదాంతం వంట పట్టించుకొని, విధివ్రాతను తప్పించుకోలేరనే ఒక సాకుతో…సమాధాన పరుచుకోవడం తప్ప మరో మార్గంలేని వ్యధా భరితమైన మనసుతో అక్కడ మాట్లాడిన కొందరి అభిప్రాయం తల్లిదండ్రుల నిర్ణయం సరైంది కాదని, అంత తెలివైన అమ్మాయి ఆ పెండ్లికి వ్యతిరేకించకపోవడం ఏమిటనే ఎన్నో విషయాలు విన్నాక ఏదేతేనేం? ఒక ఆడపిల్ల జీవితం కునారిల్లి పోవడానికి ‘తిలా పాపం- తలా పిడికెడు’ అనుకోవడం, ఇందులో ఎవరూ విలన్లు కారు.అంతా తనవారే! అననుకూల పరిస్థితులే విలన్లు ( ప్రతినాయకులై) కలసిరాని కాలమే శతృవై, అతి మర్యాదలే అంతరంగ శతృవై ఆమె జీవితాన్ని చీల్చి చెండాడి, నలుగురికీ మాట్లాడుకునే ఒక కథా వస్తువైంది.
ఆ వృద్ధాశ్రమంలో చేరాక సరేలే ఏదో గుడ్డిలో మెల్ల.. వేళకు తినడానికి తిండి- మంచాన పడితే సేవలు దొరుకుతాయన్న భరోసా వచ్చినా, అసలే పుత్రులు లేకుంటే పున్నామ నరకం అంటారు ( అపుత్రస్య గతిర్నాస్తి) అనీ, చివరకు ఎవరు అంత్యక్రియలు చేస్తారో? ఏమిటో? అని ఇలా జీవితంలో ప్రతీ దశలోనూ దిగులుతోనే జీవితం గడిచిపోయింది.
నేను మొదటే చెప్పినట్టు ఒక మనిషి వందేండ్లు ఆయువు భగవంతుని దగ్గర అడుక్కొని వస్తే 99 ఏండ్లు కష్ట పడినా , చివరి ఒక సంవత్సరం సుఖపడ్డట్టు ఆమెను రక్తసంబంధీకులు సగౌరవంగా సాగనంపారు. సజల నయనాలతో అశ్రుతర్పణమే కాకుండా… అన్నతర్పణంకూడా చేసి, స్వర్గపాథేయంతో స్వర్గద్వారాల వరకూ సాగనంపిన ఆ పదమూడు రోజులు ఆమె ఆత్మ సంతోషంతో గడిపి, పరవాసుదేవుడి పాదాలను చేరిన ఆ ధన్యజీవి సీత!
నాకనిపించిందేమిటంటే? అన్యాయాలు జరిగిన తర్వాత మాట్లాడుకునే కంటే నా అన్నవారు అనర్ధాలు జరగకుండా మానవీయ కోణంలో ఆలోచిస్తే కొంత మేలు జరిగేదేమో? ఏ ఆడదాని చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? పరాధీనం- పరపీడనం తప్ప…
ఈ విషయం వందేళ్ళ కింద జరిగిందా? యాబై ఏళ్లా? అని కాదు..నిన్నా- ఇవాళా ఆడదానిది అదే పరిస్థితి… కాకపోతే మరోతీరు! ఆడదీ ఆడనే ఉండాలని…ఆ పిల్ల ఈడ కూడా ఉండొచ్చు అనుకునే తనవారుంటే తప్ప తలరాతలు మారని వైనం ఆడదెప్పుడూ- వస్తువినిమయ పదార్థమే- ఆడదానికంటూ ఓ మనసుంది- దాన్ని సంతోషపెట్టాలనీ, ఆడ దానికంటూ ఓ మెదడుంది- దానికి జ్ఞానం ఇవ్వాలనీ; ఆమెకూ హృదయం ఉంది- దానికి అనుభవం ఇవ్వాలనీ, ఆడదీ ఆలోచన చేస్తుందనీ, దాన్ని పరిగణనలోనికి తీసుకోవాలనీ, ఆమె ప్రణాళికలకు బలం చేకూర్చాలనీ అనుకోని సమాజమున్నంత కాలం ఈ ఆడవారి( సీతల) జీవితాలిలా సాగాల్సిందే ఏ మార్పూ లేకుండా…
కాలమొక్క రీతి గడపవలయు అనే పెద్దల మాట ఆలంబనతో- వాటినే ఊతకర్రవలె పట్టుకుని జీవిత ప్రయాణం చేయాల్సిందే!
ఇంకా ఎన్నాళ్ళు? ఎన్నేండ్లు? అనే ప్రశ్నకు నా సాటి పడతుల్లారా! పకృతిలో సృష్టి ఉన్నంతవరకంటాను. ఆడా- మగా అనే జాతులున్నంతవరకంటాను. కాకపోతే సమస్యలు ఇంకోరూపంలో…సాధకబాధకాలు మరో లెవల్లో అంతే తేడా…

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

రాణీ రాణమ్మ – పాట విశ్లేషణ