కిటికీలో నుండి కనబడ్డ దృశ్యం సరిగా అర్థం కాలేదు.. కానీ! మహేశ్వరి ఆమె భర్త నర్సింలు ఏదో గొడవ పడుతున్నారు అని మాత్రం తెలిసింది భార్యాభర్తల గొడవలోకి ఎందుకు వెళ్లడం అని అనుకుంది కానీ.. మహేశ్వరి ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనబడుతుంది మనసు ఆమెకు ఏమైందో అని లాగుతున్నా కూడా “చూద్దాం మహేశ్వరి చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటాను” అని అనుకున్నది నీలాంబరి.
ఎప్పటిలా ప్రకృతిని ఆస్వాదించలేకపోయింది మామూలుగా తన దినచర్య ముగించుకొని దేవుడి పూజ ముగించి గుడికి వెళ్లడానికి సిద్ధంగా కూర్చుంది… “మహేశ్వరి ని కూడా రమ్మన్నాను మరి వస్తుందో రాదొ? భర్తతో ఏదో గొడవ పడుతున్నట్లు ఉంది” అని మనసులో అనుకొని మహేశ్వరిని పిలిచింది…
” మహీ! గుడికి వెళ్దామని చెప్పాను కదా తయారయ్యావా” అని అడిగింది..
అప్పటికే తయారైన మహేశ్వరి బయటకు వచ్చింది.. చక్కని జరి అంచు కాటన్ చీర కట్టుకొని తలలో కొన్ని పూలు పెట్టుకొని ఉన్నంతలో ముచ్చటగా తయారైంది..
” మహీ! చాలా బాగున్నావే కానీ కళ్ళు ఏంటి అలా ఎర్రగా ఉన్నాయి సరిగ్గా నిద్ర పోలేదా ఏంటి” అని అడిగింది.
” అదేం లేదమ్మా బాగానే నిద్రపోయాను కళ్ళల్లో నలకపడింది..” అన్నది మహేశ్వరి.
ఇంకా ఆ విషయం గురించి ఆరా తీయడం బాగుండదని తలచిన నీలాంబరి “సిద్దయ్య కచ్చరం తీసుకొని వచ్చాడా” అని అడిగింది.
” వచ్చాడమ్మా వాకిట్లో నిలబడ్డాడు” అని చెప్పింది.
పసుపు రంగు పట్టుచీరకి ఆకుపచ్చ అంచుతో జరీబుటాలతో ఉన్న చీర ధరించింది నీలాంబరి ఆకుపచ్చ రవికే నిండా అద్దాలు కుట్టబడి ఉన్నాయి రెండు చేతుల నిండా ఆకుపచ్చ గాజులు ధరించి నుదుట సింధూరం కళ్ళకు కాటుక పాదాలకు పసుపు రాసుకొని లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది నీలాంబరి.
మహేశ్వరికి నీలాంబరిని చూస్తుంటే ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉంటుంది “అమ్మగారు మనసు ఎంత అందమైనదో రూపం కూడా అలాంటిదే.. చక్కని తల్లి నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి” అని అనుకొని అలాగే తదేకంగా చూసింది నీలాంబరిని.
” ఏంటే అలాగే నన్ను చూస్తున్నావు?” అని నవ్వుతూ అడిగింది నీలాంబరి..
” ఏ.. ఏ.. ఏమీ లేదమ్మా” అని తడబడింది మహేశ్వరి.
” చెప్పు పర్వాలేదు నీ మనసులో ఏముందో నాకు తెలియాలి కదా” అన్నది నీలాంబరి.
” మిమ్మల్ని చూస్తే దేవతలా ఉంటారని అనిపిస్తుంది అమ్మ అందుకే అలాగే చూస్తున్నాను” అన్నది మహేశ్వరి.
నీలాంబరి మహేశ్వరి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని “పద గుడికి వెళ్దాం” అన్నది నవ్వుతూ.
ముందుగా మహేశ్వరి వెళ్లి దేవుడికి సంబంధించిన పూలు పండ్లు అన్నీ కచ్చరంలో సర్ది నీలాంబరి కోసం వాకిట్లోనే నిలబడింది.
నీలాంబరి వచ్చి కచ్చరం ఎక్కగానే తర్వాత మహేశ్వరికి కూర్చుంది…
కచ్చరం శివాలయం వైపు వెళ్ళ సాగింది… అలా దారిని గమనిస్తూ ఉంది నీలాంబరి.
కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు మీద అంతా చెత్త చెదారాలతో నిండి ఉంది అసలు శుభ్రం చేయక ఎన్నో రోజులు అయింది అనిపించింది… ఒక్కసారి అమెరికా రోడ్లను తలచుకుంది అక్కడి పద్ధతి మాత్రం బాగుంది. ఇక్కడ వాళ్ళకి కూడా దీనిమీద కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎవరికివారు చెత్త పడేయకుండా ఒకవేళ పడ్డా కూడా తీసివేసే విధంగా వాళ్ళని మార్చాలి” అని అనుకున్నది.
శివాలయం రాగానే కచ్చరం దిగి లోపలికి వెళ్ళిపోయారు..
ఎప్పటిలానే ఆ పరిసరాలన్నీ చాలా ప్రశాంతంగా అనిపించాయి..
పూజారి గారు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారు…
” అమ్మా! అమెరికా నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా! బడలిక తీరిందా ఆ రోజే వచ్చి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను” అని అన్నాడు పూజారి.
” అయ్యో అదేం లేదు పూజారి గారు మిమ్మల్ని కాసేపు నేను కూర్చోమనాల్సింది కానీ కొంచెం అలసటగా ఉండటం వల్ల మిమ్మల్ని కూర్చోమని కూడా నేను చెప్పలేకపోయాను.. మన్నించండి అందుకే ఇప్పుడు మీతో మాట్లాడడానికి నేను ప్రత్యేకంగా వచ్చాను” అని చెప్పింది నీలాంబరి.
” మీరు స్వామి పేరు మీద అర్చన చేయండి నేను ప్రదక్షిణం చేసుకొని వస్తాను” అని చెప్పి ప్రదక్షిణాలకు వెళ్ళింది నీలాంబరి..
ప్రదక్షణం చేస్తూ గుడి వెనక వైపు వెళ్లిన నీలాంబరికి గుబురుగా ఉన్న పారిజాతం చెట్లు మరియు మందార చెట్ల ప్రక్కన ఒక జంట కూర్చున్నట్లు కనిపించింది… ప్రదక్షిణం చేస్తున్న సమయంలో అలా పక్కకు చూడ్డం తప్పు అనిపించినా కూడా ఎందుకో చూడకుండా ఉండలేకపోయింది.. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దాదాపు 20 ఏళ్ల వయసు ఉంటుందేమో ఆ చెట్ల దాపున దాగి కొంచెం అసహజంగా కనిపించారు. ఇంకా తను ఏమీ చూడనట్లుగా మామూలుగా ప్రదక్షిణాలు ముగించుకొని పూజారి దగ్గరికి వెళ్ళింది నీలాంబరి.
పూజారి గారు అర్చన చేసి తీర్థప్రసాదాలు పెట్టి దేవుడు ధరించిన ఒకమాలను తీసి నీలాంబరికి ఇచ్చారు.
ఆమాలను కళ్ళకు అద్దుకొని అందులోనుండి కొన్ని పూలు తను పెట్టుకొని మహేశ్వరికి కొన్ని ఇచ్చి ఆగుడి ప్రాంగణంలోనే ఒక పక్కన కూర్చుంది… “పూజారి గారూ! శివరాత్రి ఉత్సవాల గురించి మాట్లాడదామని అన్నారు కదా మరి ఇప్పుడు వీలవుతుందా లేక మీరు ఇంటికి వస్తారా”? అని అడిగింది నీలాంబరి.
” అమ్మా! అన్యధా భావించకండి నేను మీ దివాణంకు వచ్చి మాట్లాడతాను మిమ్మల్ని ఇంత సేపు ఇక్కడ కూర్చోబెట్టడం నాకే మర్యాదగా అనిపించడం లేదు” అన్నాడు పూజారి గారు.
” ఒక విషయం పూజారి గారు ఇక్కడ మాట్లాడొచ్చా లేదా నాకు అర్థం కావడం లేదు గుడి వెనకాల పొదల్లో ఇద్దరూ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులలో కనిపించారు ఎవరు వాళ్ళు మీరేమైనా గమనించారా” ? అని అడిగాడు.
వాళ్లు గుడి వెనకాల కెళ్ళడం నేను గమనించలేదు కానీ ఇందాకే దర్శనంకి వచ్చి పూజ చేయించుకుని ప్రసాదం తీసుకుని వెళ్లారు నేను బయటకు వెళ్లిపోయారేమో అనుకున్నాను…
అబ్బాయి ఏమో సురేందర్ రెడ్డి గారి కొడుకు మన ఊర్లో మోతుబరి రైతు కదా… ఆ అమ్మాయేమో వాళ్ళ పొలం చేసే ఐలయ్య బిడ్డ చాలాసార్లు వాళ్ళిద్దరిని బయట కూడా చూశాను వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలుసో లేదో నాకు తెలియదు కానీ వారిని హెచ్చరించాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఇప్పుడు మాత్రం వాళ్లు వెనకాలకు వెళ్లడం నేను గమనించలేదు నేను పిలిచి మందలిస్తాను” అని చెప్పాడు.
“వద్దు పూజారి గారు ఆ విషయం నాకు వదిలేయండి నేను మాట్లాడతాను కాకపోతే వాళ్లు ఎక్కడ ఉంటారు వాళ్ళ వివరాలు నాకు కావాలి” అని చెప్పింది.
” నేను వారి వివరాలు కనుక్కొని చెప్తాను అమ్మా! ” అన్నాడు పూజారి.
” కనుక్కోవడమే కాదు వారిని మీరు నాదగ్గరికి తీసుకొని రండి ఎందుకంటే మన ఊరి బాగోగులు చూడటంలో నాకు ఒక్కదానికే కాదు అందరికీ బాధ్యత ఉంది అందులో మీరు స్వయానశివయ్యకు నిరంతరం సేవ చేస్తున్నారు మీవాక్కు మాకు బలాన్ని ఇస్తుంది అందుకని మీరు కూడా నాకు తోడుగా ఉండాలి” అని చెప్పింది నీలాంబరి.
ఎంతో సంతోషపడ్డ పూజారి..
” సరేనమ్మా మీరు ఏది చెప్పినా నేను కాదనను మీ గొప్పతనం అలాంటిది అందర్నీ కన్నబిడ్డ లాగా చూసుకునే మంచి మనసు మీకు ఉంది తప్పకుండా నేను వారిని తీసుకొని వస్తాను” అని చెప్పాడు.
నీలాంబరి మహి ఇద్దరూ కలిసి కచ్చరం ఎక్కారు…..
” మహీ! ఇప్పుడు చెప్పు ఏమయింది నేను ఉదయం నువ్వు నీ భర్త గొడవ పడుతుంటే చూశాను ఇంకా నా దగ్గర దాచే ప్రయత్నం చేయకు” అని అడిగింది.
నీలాంబరి చేతులను పట్టుకొని గట్టిగా ఏడ్చింది మహి..
” చెప్తానమ్మా తల్లి లాంటి మీకు చెప్పకుండా మరెవరికి చెప్తాను”… అని చెప్పడం మొదలు పెట్టింది మహేశ్వరి..
ఇంకా ఉంది